బోధన్: బోధన్ పట్టణంలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. బోధన్ కు చెందిన 19 ఏళ్ల బాలికపై ఇద్దరు యువకులు ఐదు నెలలుగా అత్యాచారం చేస్తూ వస్తున్నారు. దాంతో ఆ యువతి గర్భం దాల్చింది.

ఆ విషయాన్ని గమనించిన యువతి తల్లిదండ్రులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు అందించారు. తల్లిదండ్రులు ప్రతి రోజు కూలీ పనులకు వెళ్తుండగా యువతి ఒంటరిగా ఇంట్లో ఉండేది. 

ఇంటికి సమీపంలో నివసించే ఆమె పెదనాన్న కుమారుడు నవీన్ (25), మిత్రుడు రవి (22) ప్రతి రోజూ ఆమెను అడ్డుకునేవారు. ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. అది మొదలు ఐదు నెలలుగా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతూ వస్తున్నారు. దాంతో ఆమె గర్భం దాల్చింది. 

తల్లిదండ్రులు ఆ విషయాన్ని గుర్తించి ప్రశ్నించారు. దాంతో యువతి అసలు విషయం వారికి చెప్పింది. అత్యాచారం కింద కేసు నమోదు చేసి బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం పంపించారు. నిందితులు పరారీలో ఉన్నారు.