అనంతపురం జిల్లాలో అనుమానాస్పద స్ధితిలో మరణించిన డిగ్రీ విద్యార్ధినిని ప్రేమ వ్యవహారమే బలి తీసుకుందని పోలీసులు నిర్థారించారు.

వివరాల్లోకి వెళితే.. గుత్తికి  చెందిన అరుణ కుమారి పట్టణంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం నుంచి ఆమె అదృశ్యమైంది.

అరుణకుమారి కోసం కుటుంబసభ్యులు, బంధువులు, స్థానికులు తీవ్రంగా గాలించారు. ఈ నేపథ్యంలో ఇంటికి సమీపంలోనే డ్రైనేజీ వద్ద ఆమె అపస్మారక స్థితిలో పడివుంది. వెంటనే స్పందించిన స్థానికులు అరుణను ఆసుపత్రికి తరలించారు.

ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే  మృతిచెందినట్లు తెలిపారు. అయితే అరుణ మెడపై గాట్లు ఉండటంతో పాటు తలకు వెనుక భాగంలో గాయాలుండటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

దర్యాప్తులో భాగంగా తన ప్రేమను ఒప్పుకోలేదన్న కారణంతో రంగస్వామి అనే వ్యక్తి అరుణ కుమారిని గొంతునులిమి  దారుణంగా హత్య చేసినట్లు  తేలింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు.