కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ కరాళనృత్యం చేస్తోంది. ఈ ఒక్క రోజే పది మందికి కరోనా వైరస్ సోకింది. ఇందులో ఇద్దరు డాక్టర్లు కూడా ఉన్నారు. దీంతో కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ సోకిన డాక్టర్ల సంఖ్య నాలుగుకు చేరుకుంది. ఇప్పటి ఓ ప్రైవేట్ డాక్టర్ కరోనా వైరస్ తో మరణించిన విషయం తెలిసిందే. 

తాజాగా నమోదైన పది కేసులో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 184కు చేరుకుంది. ఇటీవల ఓ ప్రైవేట్ నర్సింగ్ హోం డాక్టర్ కరోనా వైరస్ తో మరణించాడు. అతని వద్ద చికిత్స పొందినవారు, వైద్య సిబ్బంది కలిపి మొత్తం 213 ప్రైమరీ కాంటాక్ట్ కేసులు ఉండగా, వారికి పరీక్షలు నిర్వహించగా 20 మందికి పాజిటివ్ వచ్చింది. మరో 250 మంది సెకండరీ కాంటాక్టు కేసులకు సంబంధించి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. 

కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు కోవిడ్ -19తో ఐదుగురు మరణించారు. కరోనా వైరస్ నుంచి కోలుకుని నలుగురు డిశ్చార్జీ అయ్యారు. తొలుత కర్నూలు జిల్లాలో ఓ రాజస్థాన్ నుంచి వచ్చిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత మూడు రోజులకు అవుకు, బనగానపల్లిల్లో ఒక్కటేసి కేసులు బయటపడ్డాయి. పెద్దగా కేసులు ఏవీ లేవని భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా 50కి పైగాకేసులు నమోదయ్యాయి. ఆ సంఖ్య ఆ తర్వాత 74కు చేరుకుంది. దాంతో మర్కజ్ వెళ్లి వచ్చినవారి కోసం ఆరా తీశారు. మర్కజ్ వెళ్లి వచ్చిన 400 మందిని పరీక్షించగా 72 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.

రోజు రోజుకు కర్నూలు జిల్లాలో కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రత్యేకంగా కోవిడ్ -19 ఆస్పత్రి ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 4 వేల మందికి పరీక్షలు నిర్వహించగా దాదాపు 2 వేల మందికి నెగెటివ్ వచ్చింది. మిగతావారి రిపోర్టులు రావాల్సి ఉంది.  ఒక్క కర్నూలులో 90 కేసులు నమోదు కాగా, నంద్యాలలో 42 కేసులు నమోదయ్యాయి. ఈ రెండు ప్రాంతాల్లోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.