Asianet News TeluguAsianet News Telugu

ఎవరీ సర్ఫరాజ్ ఖాన్?: జీవితంలో ఎక్కువ కాలం టెంట్ కిందే, తిండిపోతు

ఐపిఎల్ లో రాజస్థాన్ రాయల్స్ పై చేసిన పరుగులకు గాను విరాట్ కోహ్లీ తల వంచి సర్ఫరాజ్ కు అభివాదం చేశాడు. బాల్యంలోనే క్రికెట్ పై మక్కువ పెంచుకున్న అతను రంజీలో ట్రిపుల్ సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు.

Tripple century: Who is Sarfaraz Khan?
Author
Mumbai, First Published Jan 23, 2020, 2:54 PM IST

ముంబై: రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ఆడుతూ ఉత్తరప్రదేశ్ జట్టుపై ట్రిపుల్ సెంచరీ సాధించి వార్తల్లోకి ఎక్కి సర్ఫరాజ్ ఖాన్ సంచలనం సృష్టించాడు. దగ్గు, జ్వరంతో బాధపడుతూ కూడా మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు దిగి ముంబై జట్టును ఆదుకున్నాడు. ఫలితంగా ముంబై జట్టు మూడు పాయింట్లను రాబట్టుకుంది. 

సర్ఫరాజ్ ఖాన్ 1997 అక్టోబర్ 22వ తేదీన ముంబై శివారులో జన్మించాడు. ఇంతకు ముందు అతను రంజీట్రోఫీలో ఉత్తరప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించేవాడు. ఇప్పుడు ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్నాు. తిండిపై ఉన్న మక్కువ కారణంగా అతన్ని పాండా అని కూడా పిలుస్తారు. అయితే అతనికి కుట్టి ఎబీడీ అనే ముద్దు పేరు ఉంది. 

సర్ఫరాజ్ ఖాన్ 2014, 2016ల్లో అండర్ 19 ప్రపంచ కప్ జట్టుకు ఆడాడు. 22 ఏళ్ల అతను కుడిచేతి వాటం అగ్రెసివ్ బ్యాట్స్ మన్. పార్ట్ టైమ్ స్పిన్నర్ కూడా. ఐపిఎల్ మ్యాచ్ ఆడిన అతి తక్కువ వయస్సు ఆటగాడు అతనే. ప్రస్తుతం ఐపిఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 

Also Read: సర్ఫరాజ్ ఖాన్ కు దగ్గు, జ్వరం: అయినా 300 బాదేశాడు

తన బాల్యంలో ఎక్కువ కాలం అతను ఆజాద్ మైదాన్ లోని టెంట్ కిందే గడిపేవాడు. అక్కడ అతని తండ్రి, కోచ్ నౌషాద్ ఖాన్ యువకులకు శిక్షణ ఇచ్చేవాడు. ఇక్బాల్ అబ్దుల్లా, కమ్రాన్ ఖాన్ వంటి యువ ఆటగాళ్లను ముందుకు తెచ్చింది ఆయనే. టెంట్ కిందే ఎక్కవ కాలం గడపడం వల్ల సర్ఫరాజ్ కు క్రికెట్ పై ఆసక్తి ఏర్పడింది. తండ్రి అతనిలో ఉన్న ఆసక్తిని గమనించి శిక్షణ ఇచ్చాడు. 

వర్షాకాలంలో మైదానానికి చేరుకోవడం బురద వల్ల సర్ఫరాజ్ కు కష్టంగా ఉండేది. దీంతో ప్రాక్టీస్ కోసం అతని ఇంటి పక్కనే సింథటిక్ పిచ్ ను ఏర్పాటు చేశారు. హరీష్ షీల్డ్ గేమ్ లో 45 ఏళ్ల నాటి సచిన్ రికార్డును బద్దలు కొట్టడం ద్వారా అతని పేరు వెలుగులోకి వచ్చింది. అతను 421 బంతుల్లో 439 పరుగులు చేసి సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. తన 12 ఏళ్ల వయస్సులో హరీష్ షీల్డ్ గేమ్ లో 2009లో అతనికి మొదటి మ్యాచ్. 

ముంబై తరఫున అండర్ 19లో ఆడుతున్న క్రమంలో ప్రతిభ కారణంగా ఇండియా అండర్ 19 జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. 2013లో అండర్ 19లో దక్షిణాఫ్రికాపై 66 బంతుల్లో 101 పరుగులు చేసి మ్యాచ్ ను గెలిపించాడు. అండర్ 19లో చూపిన ప్రతిభ కారణంగా అతను ఐపిఎల్ లోకి అడుగు పెట్టాడు. 

2014లో బెంగాల్ పై జరిగిన మ్యాచ్ ద్వారా సర్ఫరాజ్ ముంబై జట్టులోకి వచ్చాడు. ఆ తర్వాత 2015 -16లో ఉత్తరప్రదేశ్ కు ప్రాతినిధ్యం వహించాడు. అతను 11 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడి 535 పరుగులు చేశాడు. అప్పటికి అతను అత్యధిక స్కోరు 155 పరుగులు. తాజాగా జరిగిన రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ చేసాడు. 

Also Read: సర్ఫరాజ్ ఖాన్ 300 బాదేశాడు: సెహ్వాగ్ ను మరిపించి, రోహిత్ శర్మ సరసన

సర్ఫరాజ్ వయస్సుకు సంబంధించిన వివాదంలో కూడా ఇరుక్కున్నాడు. 2011 స్కూల్ టీమ్ కు సంబంధించి ఓవర్ ఏజ్ వివాదం అతన్ని చుట్టుముట్టింది. పరీక్షల్లో అతని వయస్సు 15 ఏళ్లు అని తేలగా ముంబై క్రికెట్ అసోసియేషన్ రికార్డులో నమోదైన జన్మతేదీ ప్రకారం 13 ఏళ్లు ఉంది. దాంతో సర్ఫరాజ్ మానసికంగా ఆందోళనకు గురై సైకియాట్రిస్ట్ ను కూడా సంప్రదించాడు. తిరిగి క్రికెట్ పై దృష్టి పెట్టడానికి 2,3 నెలలు పట్టింది. 

సెమీ ఫైనల్ మ్యాచులో విజయం తర్వాత 2015లో సెలెక్టర్ల పట్ల అవాంఛనీయంగా ప్రవర్తించినందుకు సూర్యకుమార్ యాదవ్ తో పాటు అతన్ని జట్టు నుంచి తొలగించారు క్రికెట్ కమిట్ మెంట్స్ వల్ల అతను 4 నెలల పాటు బడికి సరిగా వెళ్లలేకపోయాడు. ఇంగ్లీష్, లెక్కల కోసం ప్రైవేట్ టీచర్ ను నియోగించారు. 

2014 అండర్ 19 ప్రపంచ కప్ పోటీల్లో చూపించిన ప్రదర్శనకు గాను రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ అతన్ని 50 లక్షలకు కొనుగోలు చేసింది. ఐపిఎల్ మ్యాచులు ఆడిన అతి పిన్నవయస్కుడిగా అతను గుర్తింపు పొందాడు. 17 ఏళ్ల వయస్సులో ఐపిఎల్ లోకి అడుగు పెట్టాడు.  చెన్నై సూపర్ కింగ్స్ పై అతను తొలి ఐపిఎల్ మ్యాచ్ ఆడాడు. అతను 7 బంతుల్లో 11 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, ఏబీ డివీలియర్స్ వంటి దిగ్గజాలు ఉండడంతో ఆ తర్వాతి రెండు మ్యాచుల తుది జట్టులో అతనికి స్థానం దక్కలేదు

ఆ తర్వాతి మ్యాచులో తుది జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ రాజస్థాన్ రాయల్స్ పై 21 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ఆరు ఫోర్లు, ఓ సిక్స్ బాదాడు. దాంతో అతను వెలుగులోకి వచ్చాడు. అతను డ్రెసింగ్ రూంకు బయలుదేరినప్పుడు విరాట్ కోహ్లీ అతను ముందు తల వంచి అభివాదం చేశాడు. ఐపిఎల్ లో అవకాశం వచ్చిన ప్రతిసారీ తన ప్రతిభను ప్రదర్శిస్తూ వచ్చాడు.

Follow Us:
Download App:
  • android
  • ios