ఢిల్లీ: న్యూజిలాండ్ వన్డే సిరీస్ లో ఒక్క వికెట్ కూడా తీయని మాజీ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా మద్దతుగా నిలిచాడు. ప్రతి సిరీస్ లోనూ బుమ్రా రాణించాలని అనుకోవడం సరి కాదని ఆయన అన్నాడు. అతను ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకుంటున్నాడని నెహ్రా అన్నాడు. 

ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని, ఆడిన ప్రతీసారి అత్యుత్తమ ప్రదర్శన ఎవరికీ సాధ్యం కాదని అన్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం ఈ సిరీస్ లో విఫలమయ్యాడని ఆయన వ్యాఖ్యానించాడు. తుది జట్టును ప్రకటించే ముందు జట్టు యాజమాన్యం సరైన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డాడు.

Also Read: కివీస్ పై చెత్త ప్రదర్శన: అగ్రస్థానాన్ని కోల్పోయిన బుమ్రా

బుమ్రా, మొహమ్మద్ షమీలు కాకుండా మిగతా పేస్ బౌలర్లు కూడా వారి బాధ్యతలను గుర్తించాలని నెహ్రా అన్నాడు. ప్రధాన బౌలర్లపై ఆధారపడకుండా తమ వంతు కృషి చేయాలని ఆయన సూచించాడు. బుమ్రాపై ఒత్తిడి తీవ్రమవుతోందని ఆయన అన్నాడు. టీ20ల్లో మంచి ప్రదర్శన చేసిన నవదీప్ సైనీని కివీస్ తో జరిగే టెస్టు సిరీస్ కు తీసుకోవాలని ఆయన సూచించాడు. 

ఉమేష్ యాదవ్ కన్నా సైనీనే మంచి ప్రదర్శన చేస్తాడని ఆయన అభిప్రాయపడ్డాడు. నవదీప్ సైనీకి అవకాశాలు ఇ్తే సరైన లైన్ అండ్ లెంగ్త్ లో బంతులు వేసి భవిష్యత్తులో వికెట్లు తీస్తాడని నెహ్రా అన్నాడు.

Also Read: కేఎల్ రాహుల్ 12వ స్థానంలో వచ్చినా....: శిఖర్ ధావన్ కామెంట్

గత రెండేళ్లుగా బుమ్రా, షమీ టీమిండియాకు కీలకమైన పేసర్లుగా మారారు. డెత్ ఓవర్లలో కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్ లో బౌలింగ్ చేస్తూ టీమిండియా విజయంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుమ్రాపై వస్తున్న విమర్శలపై నెహ్రూ స్పందించాడు. న్యూజిలాండ్ పై జరిగిన మూడు వన్డేల సిరీస్ ను ఇండియా కోల్పోయిన విషయం తెలిసిందే. సిరీస్ ను న్యూజిలాండ్ క్లీన్ స్వీప్ చేసింది.