ప్రపంచకప్ ఆడేందుకు వెళ్లి యువతిని రేప్ చేసిన శ్రీలంక క్రికెటర్..! అరెస్టు చేసిన సిడ్నీపోలీసులు
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ ఆడేందుకని ఆస్ట్రేలియాకు వెళ్లిన శ్రీలంక జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న దనుష్క గుణతిలకపై ఓ యువతి అత్యాచార ఆరోపణలు చేసింది. దీంతో అతడిని సిడ్నీ పోలీసులు అరెస్టు చేశారు.
శ్రీలంక బ్యాటర్ దనుష్క గుణతిలకను పోలీసులు అరెస్టు చేశారు. ఓ యువతిపై అత్యాచారం చేశాడనే ఫిర్యాదుల మేరకు పోలీసులు.. గుణతిలకను అదుపులోకి తీసుకున్నారు. ఇంగ్లాండ్ తో శనివారం మ్యాచ్ ముగిసిన తర్వాత శ్రీలంక ఆటగాళ్లు ఇంటికి బయలుదేరగా గుణతిలక మాత్రం ఆస్ట్రేలియాలోనే ఆగిపోవాల్సి వచ్చింది. మ్యాచ్ ముగిసిన వెంటనే టీమ్ హోటల్ కు వచ్చిన పోలీసులు.. గుణతిలకను అదుపులోకి తీసుకున్నారు.
టీ20 ప్రపంచకప్ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన జట్టులో గుణతిలక కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఈ టోర్నీలో క్వాలిఫై రౌండ్ ఆడిన లంక.. తాము ఆడిన తొలి మ్యాచ్ (నమీబియా) లో గుణతిలక ఆడాడు. కానీ ఆ తర్వాత గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు.
టోర్నీ నుంచి వైదొలిగినా గుణతిలకను టీమ్ మేనేజ్మెంట్ శ్రీలంకకు పంపలేదు. అతడు ప్రస్తుతం జట్టుతోనే ఉన్నాడు. జట్టుతో ఉన్న గుణతిలక.. డేటింగ్ యాప్ ద్వారా ఓ యువతిని కలిసి ఆ తర్వాత తనపై అత్యాచారం చేసినట్టు ఆస్ట్రేలియా మీడియా కథనాల ద్వారా తెలుస్తున్నది.
పలు రిపోర్టుల ప్రకారం.. సిడ్నీకి చెందిన 29 ఏండ్ల ఓ యువతిని డేటింగ్ యాప్ లో కలిసిన గుణతిలక ఆపై ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆ క్రమంలో అతడు ఆమెను లైంగికంగా వేధించాడని సదరు యువతి సిడ్నీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నవంబర్ 2న ఆ యువతిపై గుణతిలక అత్యాచారానికి పాల్పడ్డట్టు అందులో పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు గుణతిలకను అదుపులోకి తీసుకున్న సిడ్నీ పోలీసులు.. నేడు అతడిని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.
31 ఏండ్ల ఈ లంక క్రికెటర్.. ఆ జట్టు తరఫున 3 టెస్టులు, 47 వన్డేలు, 45 టీ20లు ఆడాడు. టెస్టులలో 299, వన్డేలలో 1,601, టీ20లలో 741 పరుగులు సాధించాడు. వన్డేలలో రెండు సెంచరీలు కూడా చేసిన గుణతిలక.. పార్ట్ టైం బౌలర్ గా కూడా లంక జట్టుకు సేవలందించాడు. ఈ టోర్నీలో లంక.. ఐదు మ్యాచ్ లలో 2 మాత్రమే గెలిచి మూడింటిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.