ముంబై: సర్ఫరాజ్ ఖాన్ టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ను మరిపించాడు. సిక్స్ తో అతను ట్రిపుల్ సెంచరీ సాధించాడు. రింక్ సింగ్ వేసిన బంతిని సిక్స్ గా మలిచి సెహ్వాగ్ ను తలపించాడు. 250 పరుగులను కూడా సిక్స్ తోనే సాధించాడు.

ట్రిపుల్ సెంచరీతో సర్ఫరాజ్ ఖాన్ ముంబై స్టార్ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, విజయ్ మర్చంట్, వాసిం జాఫర్, రోహిత్ శర్మ, సంజయ్ మంజ్రేకర్, అజిత్ వాడేకర్ సరసన నిలిచాడు. ముంబై, ఉత్తరప్రదేశ్ మధ్య జరిగిన రంజీ ట్రోఫీలో అతను ఈ ఘనత సాధించాడు. 

 

రంజీల్లో ముంబై తరఫున ట్రిపల్ సెంచరీ చేసిన ఏడో బ్యాట్స్ మన్ గా రికార్డులకు ఎక్కాడు. గతంలో సర్ఫరాజ్ ఉత్తరప్రదేశ్ కు ప్రాతినిధ్యం వహించాడు.  ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సర్ఫరాజ్ ఖాన్ చేసిన 301 పరుగులు అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాట్స్ మన్ గా నిలిచాడు. 2014 - 15లో కరుణ్ నాయర్ రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచులో వాంఖడే స్టేడియంలోనే 328 పరుగులు చేశాడు.

సర్ఫరాజ్ ఖాన్ 388 బంతులో ఆడి 30 ఫోర్లు, 8 సిక్స్ లతో 301 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. 63 పరుగుల ఆధ్యక్యతతో ముంబై మూడు పాయింట్లు సాధించింది. 

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఉత్తరప్రదేశ్ ఉపేంద్ర యాదవ్ (203), అక్షదీప్ నాథ్ (115) చెలరేగి ఆడడంతో 625 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ముంబై 128 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో బ్యాటింగ్ కు వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ 301 పరుగులు చేశాడు. సుద్దేశ్ లాడ్ 98, ఆదిత్య తారె 97 పరుగులు చేశారు. 

మిడిల్ ఆర్డర్ రాణించడంతో ముంబై 688 పరుగులు చేసి ఉత్తరప్రదేశ్ పై 63 పరుగుల ఆధిక్యం సాధించింది. అయితే, మ్యాచ్ డ్రా అయింది.