ఆస్ట్రేలియాలో భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌పై ఆసీస్ ఫ్యాన్స్ చేసిన ‘రేసిజం’ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేయకూడదని భారత క్రికెట్ బోర్డు, క్రికెట్ ఆస్ట్రేలియాను గట్టిగా డిమాండ్ చేస్తోంది.

ఇప్పటికే జరిగినదానికి బీసీసీఐకి క్షమాపణలు చెప్పిన క్రికెట్ ఆస్ట్రేలియా, ఈ విషయంపై విచారణ జరుపుతున్నామని రిపోర్టు వచ్చిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. మహ్మద్ సిరాజ్‌ను బౌండరీ లైన్ దగ్గర ఆస్ట్రేలియా అభిమానులు ఎలా అవమానించారో తెలుపుతూ ఓ చిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇందులో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్‌కి వచ్చిన సిరాజ్‌ను ‘సి... రాజ్’ అంటూ పిలుస్తూ ఆహ్వానించారు కొందరు అభిమానులు. అయితే మధ్యలో ‘బ్లాక్ డాగ్’, ‘బ్రౌన్ డాగ్’ అంటూ కొందరు అరవడం స్పష్టంగా వినిపించింది.

ఈ వీడియో కేవలం వాళ్లు చేసిన దాంట్లో ఓ చిన్న బిట్ మాత్రమే. అంపైర్‌కి ఫిర్యాదు చేసే సమయంలో సిరాజ్ కళ్లల్లో నీళ్లు వచ్చాయంటే, అతను ఎంతగా బాధపడ్డాడో అర్థం చేసుకోవచ్చు.