క్రైస్ట్ చర్చ్: న్యూజిలాండ్ తో జరిగే రెండో టెస్టు మ్యాచులో పృథ్వీ షా ఆడకపోవచ్చుననే పుకార్లకు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి తెర దించారు. రెండో టెస్టు మ్యాచ్ ఆడేందుకు పృథ్వీ షా సిద్ధంగా ఉన్నాడని ఆయన చెప్పారు. శనివారం న్యూజిలాండ్ పై రెండో టెస్టు మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

కాలి పాదం ఉబ్బడంతో గురువారం ప్రాక్టీస్ సెషన్ కు పృథ్వీ షా దూరంగా ఉన్నాడు. దీంతో అతను తుది జట్టులోకి రాకపోవచ్చుననే వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై రవిశాస్త్రి స్పష్టత ఇచ్చారు. రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో మయాంక్ అగర్వాల్ తో కలిసి పృథ్వీ షా తొలి టెస్టు మ్యాచులో ఇన్నింగ్సును ప్రారంభించాడు. అయితే, అతను 16 పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. 

Also Read: బౌన్సీ వికెట్లపై గెలువలేదా: కోహ్లీ సేనపై కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

దాంతో అతని టెక్నిక్ పై, ఆటకు అనుగుణంగా తనను తాను మలుచుకోకపోవడంవంటి విషయాలపై విమర్శలు వచ్చాయి. దీనిపై కూడా రవిశాస్త్రి స్పందించారు. పృథ్వీ షా మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు న్యూజిలాండ్ పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మలుచుకోవాల్సి ఉంటుందని అన్నారు. 

మొదటి రోజు ఇండియాలో కన్నా న్యూజిలాండ్, ఇంగ్లాండుల్లో పిచ్ లు భిన్నంగా ఉంటాయని, రెండు చోట్ల కండీషన్లు ఒకే రకంగా ఉండవని, ప్రతి ఒక్కరు దాన్ని గమనించి ఆడాలని, పృథ్వీ షా మాత్రమే ఎందుకు అని ఆయన అన్నారు. 

Also Read: కోహ్లీపై భీకరంగా దాడి చేస్తాం, ఇలా చేస్తాం: టామ్ లాథమ్

రెండో టెస్టు మ్యాచులో ఎవరు మైదానంలోకి దిగుతారనే విషయాన్ని రవిశాస్త్రి వెల్లడించలేదు. రవిచంద్రన్ అశ్విన్ ను తీసుకోవాలా, జడేజాను తీసుకోవాలా అనే విషయంపై టీమ్ మేనేజ్ మెంట్ శనివారం ఉదయం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. 

రవిచంద్రన్ అశ్విన్ ప్రపంచ స్థాయి ప్రమాణాలు ఉన్న బౌలర్ అనే విషయంలో సందేహం లేదని, అయితే జడేజాను తీసుకోవాలా, అశ్విన్ ను కొనసాగించాలా అనే విషయంపై టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా తగిన ఆటగాళ్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. చాలా ఏళ్లుగా అశ్విన్ బౌలింగ్ బాగా చేస్తున్నాడని, బ్యాటింగ్ విషయంలోనే అసంతృప్తి ఉందని, బ్యాటింగ్ ను మెరుగుపరుచుకుంటానని అశ్విన్ చెబుతున్నాడని ఆయన వివరించారు.