కరాచీ:  పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ ఉమర్ అక్మల్ పై సస్పెన్షన్ వేటు పడింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అవినీతి నిరోధక నియమావళిలోని ఆర్టికల్ 4.7.1 కింద ఆయనను సస్పెండ్ చేశారు. ఈ ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయని పీసీపీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. 

దాంతో పీసీబీ అవినీతి నిరోధక విభాగం విచారణ పూర్తి అయ్యే వరకు అక్మల్ క్రికెట్ కు సంబంధించిన ఏ కార్యకలాపంలోనూ పాల్గొనే అవకాశం లేదు. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నందున దానిపై తాము ఏ విధమైన వ్యాఖ్యలు చేయబోమని పీసీబీ స్పష్టం చేసింది. 

Also Read: బ్రదర్ ని మదర్ చేసిన ఉమర్ అక్మల్ ... ఏకిపారేస్తున్న నెటిజన్స్

ఓ ఫిట్నెస్ టెస్టు సందర్భంగా ఉమర్ అక్మల్ దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. లాహోర్ లోని జాతీయ క్రికెట్ అకాడమీ వద్ద జరిగిన ఫిట్నెస్ టెస్టులో అక్మల్ విఫలమయ్యాడు. దాంతో అక్కడి సిబ్బందితో అక్మల్ అభ్యంతరరకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. 

కొద్ది రోజుల క్రితం ఆ సంఘటనపై అక్మల్ క్షమాపణ కోరాడు. దాంతో అతనిపై ఏ విధమైన చర్యలు కూడా తీసుకోవడం లేదని పీసీబీ చెప్పింది. తాజాగా అతనిపై చర్యలు తీసుకోవడంలో ప్రధాన కోచ్ మిస్బావుల్ హక్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. నిరుడు ఆగస్టులో శ్రీలంకపై జరిగిన టీ20 మ్యాచులో అక్మల్ పాకిస్తాన్ తరఫున చివరి మ్యాచ్ ఆడాడు.

Also Read: ఆసియా కప్: తేల్చేసిన భారత్, చేతులెత్తేసిన పాకిస్తాన్

ఆ సిరీస్ లో అక్మల్ ఘోరంగా విఫలమయ్యాడు. దాంతో పాకిస్తాన్ జట్టులో అతను స్థానం కోల్పోయాడు. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ప్రారంభానికి ముందు అక్మల్ ను సస్పెండ్ చేయడం విశేషం.