పాకిస్తాన్ క్రికెట్ పై నిత్యం ఏదో ఒక దుమారం చెలరేగుతూనే ఉంటుంది. గతంలో మ్యాచ్ ఫిక్సింగ్ ల నుంచి నిన్నమొన్నటి స్పాట్ ఫిక్సింగుల వరకు ఆ టీం ను చుట్టుముట్టని వివాదం ఒకటి కూడా లేదంటే అది అతిశయోక్తి కాదు. 

తాజాగా కూడా పాకిస్తాన్ క్రికెట్ ను మరోసారి మ్యాచ్ ఫిక్సింగ్ దుమారం చుట్టుముట్టునది. పాకిస్తాన్ దేశవాళీ టోర్నీ పాకిస్తాన్ సూపర్ లీగ్ సందర్భంగా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు దుమారాన్ని రేపుతూ.... యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. 

పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) 2020 సీజన్‌ ఆరంభమైన రెండు రోజుల్లోనే ఈ లీగ్‌ను వివాదం చుట్టుముట్టడం గమనార్హం. కరాచీలోని నేషనల్‌ స్టేడియంలో శుక్రవారం రాత్రి కరాచీ కింగ్స్‌, పెషావర్‌ జల్మీ మధ్య జరిగిన మ్యాచ్‌లో వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. 

Also read; టీమిండియాతో మ్యాచ్ కావాలి: మ్యాచ్ మధ్యలో పాక్ అభిమానుల గోల

మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో కరాచీ కింగ్స్‌కు చెందిన జట్టు మేనేజ్‌మెంట్‌ సిబ్బంది ఒకరు డగౌట్‌లో ఫోన్‌ మాట్లాడటం ప్రత్యక్ష ప్రసారం అయ్యింది. దీంతో నెటిజన్లు ఈ దృశ్యాన్ని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. 

సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉండే రావల్సిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ దీనిపై స్పందించాడు. 'డగౌట్‌లో మొబైల్‌ ఫోన్‌ వినియోగించటం చాలా తప్పు' అని ఫోటో జతచేస్తూ అక్తర్‌ ట్వీట్‌ చేశాడు. 

ఐసీసీ నిబంధనల ప్రకారం డ్రెస్సింగ్‌రూమ్‌, డగౌట్‌లో ఆటగాళ్లు, సహాయక సిబ్బంది మొబైల్‌ ఫోన్లు వాడటం నిషిద్ధం. సమాచారం పంచుకునేందుకు వాకీటాకీలు మాత్రమే వినియోగించాలి. 

మొబైల్‌ ఫోన్‌ వినియోగించిన తరీఖ్‌ వాసి కరాచీ కింగ్స్‌ జట్టు మేనేజర్‌ అని ఆ ప్రాంఛైజీ మీడియా మేనేజర్‌ ఫైజల్‌ మీర్జా వెల్లిడించాడు. కానీ టాస్‌ సందర్భంగా ఇచ్చిన జాబితాలో జట్టు మేనేజర్‌ నవీద్‌ రషీద్‌ అని ఉంది. దీంతో మరో వివాదం మొదలైంది. ఐసీసీ, పీసీబీలు ఈ ఘటనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి!.

ఇలా డగ్ అవుట్ లలో ఫోన్లను వినియోగించడం వల్ల ఏదైనా బయట సమాచారాన్ని క్రీడాకారులకు చేరవేసే ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా గతంలో బుకీలు ఇదే మాదిరి ఆటగాళ్లతో సంభాషించేవారు. 

ఇలా సంభాషణలు జరుగుతున్నాయని తేలినాకనే... ఐసీసీ ఇలా సెల్ ఫోన్ల వాడకంపై నిషేధాన్ని విధించింది. ఇప్పుడు మరోమారు సెల్ ఫోన్ లో మాట్లాడుతూ కనబడడం, అందునా లిస్ట్ లో ఉన్న వ్యక్తికాకుండా మరో వ్యక్తి రావడంతో అందరూ విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.