వెల్లింగ్టన్: వర్షం కారణంగా న్యూజిలాండ్, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ టీ విరామం తర్వాత జరగలేదు. భారత్ తొలి ఇన్నింగ్స్ పేలవంగా సాగింది. న్యూజిలాండ్ బౌలర్ల ముందు భారత బ్యాట్స్ మెన్ ఎవరూ నిలదొక్కుకోలేకపోయారు. జేమీసన్ మూడు వికెట్లు తీశాడు. సౌథీ, బౌల్ట్ లకు చెరో వికెట్ దక్కింది. అజింక్యా రహానే 38 పరుగులతో, రిషబ్ పంత్ 10 పరుగులతో క్రీజులో ఉన్నాడు. టీ విరామం తర్వాత వర్షం కారణంగా ఆట కొనసాగలేదు. ఆటకు మైదానం అనుకూలంగా లేకపోవడంతో తొలి రోజు ఆట ముగిసినట్లు ప్రకటించారు.

టీ విరామ సమయానికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. అజింక్యా రహానే న్యూజిలాండ్ బౌలర్లను ఎదుర్కునే ప్రయత్నం చేస్తూ 38 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ అతనికి తోడుగా నిలిచాడు. వర్షంతో టీ విరామం తర్వాత మ్యాచ్ జరగలేదు. 

న్యూజిలాండ్ పై జరుగుతున్న తొలి టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్సులో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 40 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా నిరాశపరిచాడు. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. 101 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. తెలుగు క్రికెటర్ హనుమ విహారి కేవలం 7 పరుగులు చేసి జెమీసన్ బౌలింగులో అవుటయ్యాడు.

రెండు ఫోర్లు బాది ఊపు మీద ఉన్నట్లు కనిపించిన పృథ్వీ షా8 బంతుల్లో 16 పరుగులు చేసి సౌథీ బౌలింగులో అవుటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఛతేశ్వర్ పుజారా కూడా 11 పరుగులకే అవుటయ్యాడు. అతను జేమీసన్ బౌలింగులో వాంటింగ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

దాంతో భారత్ 35 పరుగులకే రెండు కీలకమైన వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు. అతను రెండు పరుగులు మాత్రమే చేశాడు. జేమీసన్ బౌలింగులోనే రాస్ టైలర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. 

ఆ తర్వాత వికెట్ల వద్ద నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూ మయాంక్ అగర్వాల్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగులో జేమీసన్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో భారత్ 88 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. మయాంక్ అగర్వాల్ 34 పరుగులు చేశాడు.