బిగ్‌బాష్ లీగ్‌లో పేలవమైన అంపైరింగ్‌పై బీభత్సమైన ట్రోలింగ్, విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి ఓ నిర్ణయానికే అవుట్ అయ్యాడు మిచెల్ మార్ష్. బిగ్‌బాష్ లీగ్ 2020-21 సీజన్‌లో భాగంగా క్వాలిఫైయర్ మ్యాచ్‌లో పెర్త్ స్కాచర్స్ తరుపున బరిలో దిగిన మిచెల్ మార్ష్... స్టీవ్ ఓ కెఫీ బౌలింగ్‌లో వైడ్‌గా వెళ్తున్న బాల్‌ను ఆడేందుకు ప్రయత్నించాడు.

అయితే అది బ్యాటుకి తగలకుండానే వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. వెంటనే వికెట్ కీపర్, బౌలర్ అప్పీలు చేయడం, అంపైర్ అవుట్‌గా ప్రకటించడం జరిగిపోయాయి. దీంతో తీవ్ర అసహనానికి గురైన మిచెల్ మార్ష్... ఆ కోపంతో పెవిలియన్‌కి వెళుతూ... అంపైర్‌ను బూతులు తిట్టాడు.

ఐసీసీ నియమావళిని ఉల్లంఘించి అంపైర్‌పై అసభ్య పదజాలం వాడినందుకు మిచెల్ మార్ష్‌కు  5 వేల డాలర్లు (దాదాపు 3 లక్షల 65 వేల రూపాయలు) జరిమానాగా విధించింది ఐసీసీ. మార్ష్ త్వరగా అవుట్ కావడంతో పెర్త్ స్కాచర్స్ 167 పరుగుల స్కోరు మాత్రమే చేయగలిగింది. ఈ టార్గెట్‌ను ఆడుతూ పాడుతూ చేధించిన సిడ్నీ సిక్సర్స్ ఫైనల్‌కి అర్హత సాధించింది.