వెల్లింగ్టన్: భారత్ పై జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్సులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఔట్ చేసిన తీరుపై న్యూజిలాండ్ పేసర్ జెమీసన్ మాట్లాడాడు. విరాట్ కోహ్లీని జెమీసన్ రెండు పరుగులకే అవుట్ చేశాడు. నెల రోజులుగా ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని, కోహ్లీని ఔట్ చేసేందుకు అతని బలహీనతలను వెతకలేదని ఆయన అన్నాడు.

నిజంగా నమ్మశక్యం కావడం లేదని, రెండు వారాలుగా ఏం జరుగుతోందో అర్థం కావడం లేదని ఆయన అన్నాడు. మ్యాచును చూస్తే తాము ప్రస్తుతం మంచి స్థితిలో ఉన్నామని ఆయన చెప్పాడు. విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆటగాడని, టీమిండియా బ్యాటింగ్ లైనప్ లో అతను కీలకమైన ఆటగాడని ఆయన అన్నాడు. 

ఇద్దరు భారత్ ఆటగాళ్లను తొలి సెషన్ లోనే పెవిలియన్ కు పంపించడం తనకు ప్రత్యేకమని ఆయన అన్నాడు. విరాట్ కోహ్లీని, ఛతేశ్వర పుజారాను ఆయన తొలి సెషన్ లోనే అవుట్ చేశాడు. మిడిలార్డర్ లో హనుమ విహారి వికెట్ కూడా తీశాడు.

ఔట్ చేసేందుకు విరాట్ కోహ్లీలోని బలహీనతలను వెతకడం తెలివైన పని కాదని, ఎందుకంటే అతను అన్ని దేశాల్లోనూ పరుగులు చేస్తున్నాడని, స్టంప్ కు విసిరితే కోహ్లీ బాగా ఆడుతాడని ఆయన అంటూ తాను ట్రాప్ చేసిన తీరును జమీసన్ చెప్పాడు.

తాను పిచ్ సహకారంతో స్టంప్ లైన్ కు కొద్దిగా పక్కకు బంతిని విసిరానని, అదృష్టవశాత్తు బంతి కోహ్లీ బ్యాట్ అంచుకు తాకి దొరికిపోయాడని జమీసన్ అన్నాడు.