కడప: బీసీసీఐ అండర్ 19 మహిళా క్రికెట్ టోర్నమెంట్ లో చండీగఢ్ అమ్మాయి అద్భుతం చేసింది. పదికి పది వికెట్లు తీసి రికార్డు సృష్టించింది. అరుణాచల్ ప్రదేశ్ పై కడపలో జరిగిన మ్యాచులో చండీగఢ్ జట్టు కెప్టెన్ కశ్వి గౌతం పది వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మంగళవారంనాడు ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. 

కశ్వి గౌతమ్ బౌలింగ్ ధాటికి చండీగడ్ అరుణాచల్ ప్రదేశ్ పై 161 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చండీగఢ్ 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. కశ్వి గౌతమ్ బ్యాటింగ్ లోనూ రాణించి 49 పరుగులు చేసింది. సిమ్రన్ జోహల్ 42, మెహుల్ 41 పరుగులు చేశారు.

లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాటింగ్ కు దిగిన అరుణాచల్ ప్రదేశ్ 8.5 ఓవర్లలో 25 పరుగులకే కుప్పకూలింది. మేఘా శర్మ 10 పరుగులు చేసింది. 8 మంది డకౌట్ అయ్యారు. కశ్వి గౌతమ్ 4.5 ఓవర్లలో 12 పరుగులు ఇచ్చి మొత్తం 10 వికెట్లు పడగొట్టింది. 29 బంతుల్లో అరుణాచల్ ప్రదేశ్ జట్టును కుప్పకూల్చింది. ఇందులో ఆరు ఎల్బీడబ్ల్యూలు, నాలుగు క్లీన్ బౌల్డ్ లు ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ లో తడఖా చూపి ఒంటి చేత్తో విజయాన్ని సాధించి పెట్టింది.  

 

కశ్వీ గౌతమ్ తొలి ఓవరులో రెండు వికెట్లు తీసుకుంది. రెండో ఓవరులో మరో మూడు వికెట్లు తీసింది. తర్వాతి ఓవరులో రెండో వికెట్లు పడగొట్టింది. అరుణాచల్ ప్రదేశ్ స్కోరు రెండంకెలకు కూడా చేరుకోకుండానే ఏడు వికెట్లను కోల్పోయింది. 

తర్వాతి ఓవరులో కశ్వీ గౌతమ్ మ్యాచునే ముగించింది. ఇన్నింగ్సు 9వ ఓవరులో ముగ్గురిని అవుట్ చేసింది. దీంతో అరుణాచల్ ప్రదేశ్ 25 పరుగులకే పది వికెట్లు కోల్పోయి ఘోర పరాజయాన్ని చవి చూసింది.

అంతర్జాతీయ క్రికెట్ లో ఈ ఘనతను ఇద్దరు బౌలర్లు మాత్రమే సాధించారు. ఒకరు ఇండియాకు చెందిన అనిల్ కుంబ్లే కాగా, మరొకతను ఇంగ్లాండ్ ఆఫ్ స్పిన్నర్ జిమ్ లేకర్. ఆస్ట్రేలియాపై 1956లో జరిగిన మ్యాచులో ఇంగ్లాండు ఆఫ్ స్పిన్నర్ లేక్ పది వికెట్లు పడగొట్టాడు. అనిల్ కుంబ్లే 1999లో జరిగిన టెస్టు మ్యాచులో ఇన్నింగ్సులో పది వికెట్లు తీశాడు.