కరోనా వైరస్‌ మనిషి నోరు, ముక్కు నుంచి వెలువడ్డ తుంపర్ల ద్వారా మరో మనిషికి సోకుతున్నా నేపథ్యంలో.... ఇది ఇప్పుడు క్రికెట్ రూపురేఖలను మార్చేందుకు సిద్ధమయిపోయింది. కరోనా వైరస్‌ సోకిన వ్యక్తి లాలా జలంలో వైరస్‌ జీవించి ఉంటుంది. ఆ లాలాజలం ద్వారా ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఎక్కువ. 

క్రికెట్‌ ఆవిష్కరణ నాటి నుంచి బంతిపై మెరుపు నిలుపుకునేందుకు సహజంగా లాలాజలం (ఉమ్మి) వాడటం పరిపాటి. ఇప్పుడు కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో క్రికెట్‌లో మళ్లీ ఉమ్మి వాడటం చరిత్రే అంటున్నారు. 

క్రికెట్‌ సీజన్‌ పున ప్రారంభానికి రంగం సిద్ధం అవుతున్న తరుణంలో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) క్రికెట్‌ కమిటీ ఉమ్మి వాడకంపై నిషేధం విధించింది. అనిల్‌ కుంబ్లే సారథ్యంలోని ఐసీసీ క్రికెట్‌ కమిటీ వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశమైంది. కరోనా వైరస్‌ ముప్పు నేపథ్యంలో ఉమ్మి వాడకాన్ని నిషేధిస్తున్నట్టు కుంబ్లే కమిటీ ప్రకటించింది. 

ఉమ్మి వద్దు స్వేదం ముద్దు.....!

ఐసీసీ క్రికెట్‌ కమిటీ నిర్ణయంపై భిన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఉమ్మి వాడకంపై నిషేధం విధించినా.. చెమట (స్వేదం) వాడేందుకు ఐసీసీ అనుమతించింది. ఇక నుంచి బంతిపై మెరుపు నిలిపేందుకు ఉమ్మిని కాకుండా చెమటను ఉపయోగించాలని ఐసీసీ నిర్దేశించింది. 

ఈ గండం గట్టెక్కెందుకు బాల్‌ టాంపరింగ్‌కు చట్టబద్దత కల్పించాలనే డిమాండ్‌ ఆరంభంలో ఎక్కువగా వినిపించింది. ఐసీసీ క్రికెట్‌ కమిటీ ఎజెండాలో ఆ అంశం ఉన్నదనే వార్తలు సైతం వినిపించాయి. కానీ అనిల్‌ కుంబ్లే కమిటీ బాల్‌ టాంపరింగ్‌కు చట్టబద్దతపై చర్చించలేదని సమాచారం. అందుకే ఉమ్మి వాడకంపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

క్రికెట్‌ జట్టుగా ఆడే ఆట. వికెట్‌ పడినప్పుడు మైదానంలో ఆటగాళ్లు భౌతిక దూరం పాటిస్తూ సంబురాలు చేసుకోవచ్చు. సెంచరీ చేసినప్పుడు సహచరుడిని ఆలింగం చేసుకోకుండా అభినందనించవచ్చు. కానీ మ్యాచ్‌పై పట్టు నిలిపేందుకు దోహదం చేసే బంతిపై మెరుపు కొనసాగించేందుకు ఉమ్మి ప్రయోగం అనివార్యం. 

ఉమ్మితో బంతిపై మెరుపును మరికొన్ని ఓవర్ల పాటు నిలుపుదల చేయకపోతే 10-15 ఓవర్ల తర్వాత నుంచే బ్యాట్స్‌మెన్‌ పెత్తనానికి తెరలేస్తుంది. బౌలర్లకు పోషించేందుకు క్రీయాశీలక పాత్ర ఉండబోదు!. 

కరోనా పరిస్థితుల్లో క్రికెట్‌ నిర్వహణకు ఇరు జట్ల ఆటగాళ్లు, సహాయక సిబ్బంది సహా ప్రసారదారు సిబ్బందికి సైతం ఆరోగ్య పరీక్షలు చేయాల్సి ఉంటుంది. వీరితో పాటు మైదాన సిబ్బంది ఆరోగ్య పరిస్థితిపై పర్యవేక్షణ కీలకం. సురక్షిత పరిస్థితుల్లో ఓ మ్యాచ్‌ను నిర్వహించాల్సి ఉంటే, కనీసం 200 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయాలి. 

భారత్‌లో ఇప్పుడు ర్యాపిడ్‌ కిట్ల కొరత వేధిస్తోంది. ఈ విపత్కర సమయంలో క్రికెట్‌ మ్యాచ్‌ల నిర్వహణకు పెద్ద మొత్తంలో ర్యాపిడ్‌ కిట్లను వినియోగించటం అనుమానమే. కరోనా వైరస్‌ భయం వెంటాడుతున్న సమయంలో క్రికెట్‌ నిర్వహణ అవసరం ఉందా?అనే విషయాన్ని నిర్వాహకులు తేల్చుకోవాలి. 

కరోనా వైరస్‌ నేపథ్యంలో క్రికెట్‌ పూర్తిగా నిలిచిపోయింది. భవిష్యత్‌ కార్యాచరణపై ఐసీసీ నుంచి ఎటువంటి సమాచారం లేదు. విపత్కర పరిస్థితుల్లో ముందుండి మార్గనిర్దేశనం చేయాల్సిన ఐసీసీ, వెనుక సీట్లో కూర్చోని చోద్యం చూస్తోంది. 

ఈ సమయంలో సభ్య దేశాల క్రికెట్‌ బోర్డులు అభిప్రాయాలను పంచుకుంటున్నారు. వీటిపైనా ఐసీసీ నుంచి ఎటువంటి స్పందన లేదు. కరోనా సంక్షోభం నుంచి క్రికెట్‌ను గట్టెక్కించేందుకు ఐసీసీ దగ్గర ఎటువంటి ప్రణాళిక లేకపోవటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.