Asianet News TeluguAsianet News Telugu

కంగారూల లెక్క సరిచేసేనా....?

గత సంవత్సర ఆరంభంలో స్వదేశంలో ఆస్ట్రేలియాకు హ్యాట్రిక్‌ విజయాలు అందించి సిరీస్‌ చేజార్చుకున్న కోహ్లిసేన.. తాజాగా మరో సిరీస్‌ కోల్పోయే ప్రమాదంలో పడింది. సిరీస్‌లో ఆరంభ మ్యాచ్‌లో ఓటమి ఎదుర్కొవటం భారత్‌కు ఇది తొలిసారి కాదు. 

India vs Australia 2nd ODI: Kohli batting at number 3 is the only solution
Author
Rajkot, First Published Jan 17, 2020, 12:46 PM IST

గత సంవత్సర ఆరంభంలో స్వదేశంలో ఆస్ట్రేలియాకు హ్యాట్రిక్‌ విజయాలు అందించి సిరీస్‌ చేజార్చుకున్న కోహ్లిసేన.. తాజాగా మరో సిరీస్‌ కోల్పోయే ప్రమాదంలో పడింది. సిరీస్‌లో ఆరంభ మ్యాచ్‌లో ఓటమి ఎదుర్కొవటం భారత్‌కు ఇది తొలిసారి కాదు. 

గతంలోనూ ఐదు పర్యాయాలు ఈ పరిస్థితిని చవిచూసింది. అందులో నాలుగుసార్లు పుంజుకుని సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఆ విజయాలు కోహ్లీ, రోహిత్‌ సారథ్యంలోనే సాధించారు.

వీరే ఇప్పుడు మరో మారు సారథ్య బాధ్యతల్లో ఉండడం ఈ మ్యాచ్‌లో భారత్‌కు కలిసొచ్చే అంశం. ఆస్ట్రేలియా సిరీస్‌ కైవసం చేసుకోవాలని చూస్తుండగా, లెక్క సరి చేయాలని భారత్‌ భావిస్తోంది. భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య రెండో వన్డే సమరం నేడు రాజ్ కోట్ వేదికగా జరగనుంది. 

2020 టీ20 వరల్డ్‌కప్‌ నేపథ్యంలో ఈ ఏడాది భారత్‌ ప్రథమ ప్రాధాన్యత టి 20 ఫార్మటు కే. 2021 ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్స్‌ ఫైనల్లో చోటు సాధించేందుకు మరో అడుగే మిగిలి ఉండగా.. టెస్టులపై కోహ్లిసేన ఫోకస్‌ ఏమాత్రం తగ్గలేదు. ఏ కోణంలో చూసినా టీమ్‌ ఇండియా ప్రయారిటీ లిస్టులో వన్డేలకు మూడో స్థానమే దక్కుతోంది. 

ఏదో ఈ కారణం చెప్పి ముంబయి వాంఖడెలో భారత్ చవిచూసిన 10 వికెట్ల పరాజయాన్ని కప్పిపుచ్చలేము. అగ్రజట్ల నడుమ సమరం అనగానే విజేత ఎవరో ఆఖరు బంతి వరకూ నిర్ణయించలేనట్టుగా మ్యాచ్ సాగుతుంది.  

అయినా, సొంతగడ్డపై కోహ్లిసేనకు ఈ స్థాయిలో ఓటమినీ ఎవరూ అంచనా వేయలేదు. విరాట్‌ కోహ్లి నాయకత్వంలో భారత్‌ ఇప్పటికే ఆస్ట్రేలియాకు ఓ సిరీస్‌ కోల్పోయింది. అది కూడా స్వదేశంలో. 

ఇప్పుడు మరోసారి ఆ వైఫల్యం పునరావృతం అయ్యే ప్రమాదం ముంచుకొస్తుంది. అన్ని రంగాల్లో అద్భుత జోరుతో ఉన్న ఆస్ట్రేలియా రాజ్‌కోట్‌లోనే సిరీస్‌ ను చేజిక్కించుకోవాలని చూస్తుంది. 

Also read; ఆస్ట్రేలియా చేతిలో 10 వికెట్ల తేడాతో ఓటమి.... అనవసరపు చెత్త రికార్డును మూటగట్టుకున్న కోహ్లీ

కానీ మరోపక్క విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఫైనల్ సమరాన్ని బెంగళూరు చిన్నస్వామి వేదికగా తేల్చుకోవాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో రాజ్‌కోట్‌లో భారత్‌, ఆస్ట్రేలియా జట్ల బాహాబాహీ ఆసక్తి రేపుతోంది.

విరాట్‌ నెంబర్ 3లోనే ఆడేనా...? 

స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య లేడు. సీనియర్‌ సీమర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ గాయం కారణంగా దూరమయ్యాడు. సూపర్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్ కోహ్లీ తన స్థానాన్ని మరోకరికి త్యాగం చేసాడు. బహుశా జూనియర్స్ కి అవకాశం ఇవ్వడం కోసం చేసినప్పటికీ.... ప్రయోగాలు వికటించి కోహ్లిసేన దారుణ ఓటమిని చవిచూసింది. 

నేడు ఖచ్చితంగా నెగ్గి తీరాల్సిన మ్యాచ్‌లో భారత్‌ ముందుగా బ్యాటింగ్‌ ఆర్డర్‌పై దృష్టి సారించాలి. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తిరిగి 3వ స్థానంలోనే బ్యాటింగ్‌కు రావాలి. మాజీ క్రికెటర్లు సైతం కోహ్లి బ్యాటింగ్‌ పొజిషన్‌పై ఇదే చెబుతున్నారు. 

మూడో స్థానంలో వస్తే క్రీజులో నిలదొక్కుకునేందుకు కోహ్లికి తగినంత సమయం లభిస్తుంది. ఆఖర్లో ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ అండ కూడా లభిస్తుంది. కెఎల్‌ రాహుల్‌ వరల్డ్‌కప్‌లో వచ్చినట్టే నాల్గో స్థానంలో వస్తే బ్యాటింగ్ లైన్ అప్ బలంగా మారుతుంది. 

బాల్ హెల్మెట్ పై బలంగా తగలడం వల్ల రిషబ్‌ పంత్‌ రాజ్‌కోట్‌ వన్డేకు దూరమయ్యాడు. దీంతో కెఎల్‌ రాహుల్‌ వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు తీసుకోనున్నాడు. 

రిషబ్‌ పంత్‌ గాయం కేదార్‌ జాదవ్‌కు తుది జట్టులో లైన్‌ క్లియర్‌ చేసేలా కనబడుతుంది. పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌గా జాదవ్‌ ఐదారు ఓవర్లు అత్యంత కీలకం కానున్నాయి. అయితే భారత్ కేదార్ జాదవ్ వేసే 5 ఓవెన్లను పరిగణలోకి తీసుకుంటుందా లేదా మనీష్ పాండే ఫామ్ ని పరిగణలోకి తీసుకుంటుందా చూడాలి. మనీష్ పాండే ప్రస్తుతం భీకరమైన ఫామ్ లో కొనసాగుతున్నాడు. 

ఇక సొంత మైదానం కూడా అవడం వల్ల రవీంద్ర జడేజా రెగ్యులర్‌ ఆల్‌రౌండర్‌గా ఆడనున్నాడు. బౌలింగ్‌ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా గాయం నుంచి కోలుకున్న అనంతరం ఆడిన తొలి వన్డే లో అనూహ్యంగా విఫలమయి అందరినీ విస్మయానికి గురి చేసాడు. 

ఫామ్‌లో ఉన్న మహ్మద్‌ షమి సైతం తేలిపోయాడు. ఇటీవల దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను వణికించిన మహ్మద్‌ షమి వాంఖడెలో సరైన లెంగ్త్‌లో బంతులు వేయలేక తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఆరంభంలో ఫుల్‌ లెంగ్త్‌ బంతులు వేసి ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ దంచి కొట్టుడికి బలవ్వగా, ఆఖర్లో మరీ షార్ట్‌ లెంగ్త్‌ బంతులతో తగిన మూల్యం చెల్లించుకున్నాడు. 

నవదీప్‌ సైని సైతం తుది జట్టులోకి వచ్చే అవకాశం లేకపోలేదు. కుల్దీప్‌ యాదవ్‌, యుజ్వెంద్ర చాహల్‌ స్పిన్నర్‌ కోటా స్థానం కోసం పోటీపడుతున్నారు. షమీ, షార్దుల్‌ ఠాకూర్‌ లేదా నవదీప్ సైనీలతో కలిసి బుమ్రా పేస్‌ బాధ్యతలు పంచుకోనున్నాడు.

కంగారూల జోరుకు కళ్లెం పడేనా...? 

కీలక ఆటగాళ్లు డేవిడ్ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌ సహకారం లేకుండానే 2019లో టీ20, వన్డే సిరీస్‌ ఎగరేసుకుపోయిన ఆస్ట్రేలియా.. ఇప్పుడు స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ ల అండతో మరింత రెచ్చిపోతుంది. 

అన్ని విభాగాల్లో భారత్‌ను మట్టికరిపించి మానసికంగా పైచేయి సాధించిన కంగారూ సేన.. నేడు రాజ్‌కోట్‌లోనూ అదే జోరు ప్రదర్శించాలని భావిస్తోంది. వార్నర్‌, ఫించ్‌ జోరుతో మార్నస్‌ లబుషేన్‌ అరంగ్రేట ఇన్నింగ్స్‌ సాధ్యపడలేదు. 

Also read; విరాట్ కోహ్లీకి ఆడమ్ జంపా రిటర్న్ గిఫ్ట్: స్టీవ్ వా కామెంట్ ఇదీ...

చిన్న బౌండరీలున్న రాజ్ కోట్ మైదానంలో లబుషేన్‌, స్మిత్‌, టర్నర్‌, అగర్‌, కేరి సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్నారు. బౌలింగ్‌ విభాగంలో పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌ త్రయం మరోసారి భారత్‌కు గట్టి సవాల్‌ విసరనుంది. 

స్పిన్నర్‌ ఆడం జంపా నుంచి భారత స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లి గట్టి పోటీని ఎదుర్కొంటున్నాడు. కోహ్లి క్రీజులోకి రాగానే ఫించ్‌ స్పిన్నర్‌ జంపాను ప్రయోగించడం తథ్యంగా కనబడుతుంది. రాజ్‌కోట్‌లో కోహ్లి ధీటుగా బదులిస్తే సిరీస్‌ విజేత నిర్ణయం కోసం ఆస్ట్రేలియా బెంగళూర్‌కు వెళ్లక తప్పదు. 

పిచ్‌, వెదర్ కండిషన్స్ 

రాజ్‌కోట్‌ పిచ్‌ వాంఖడె కంటే ఫ్లాట్‌గా ఉంటుంది. మంచి ఎండకాయటంతో పిచ్‌ పచ్చిక లేకుండా కనిపిస్తోంది. రాజకోట్‌ మైదానంలో బౌండరీ లెంగ్త్ చాలా తక్కువ. ఈ చిన్న బౌండరీల మైదానంలో భారీ హిట్టర్లు విశ్వరూపం ప్రదర్శిస్తారనటంలో  ఎటువంటి సందేహం అవసరం లేదు. 

మ్యాచ్‌కు ఎటువంటి వర్షం ముప్పు లేదు. లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు వేస్తూ వైవిధ్యాన్ని గనుక ప్రదర్శిస్తే పేసర్లు ప్రభావం చూపగలరు. మరో భారీ స్కోర్లు నమోదవనున్న మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన తొలుత బౌలింగ్‌ చేసే అవకాశాలు మెండు. మంచు ప్రభావం ఎలాగూ ఉండనే ఉంది.  

ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా)...  

భారత్‌ : శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, కెఎల్‌ రాహుల్‌, శ్రేయస్ అయ్యర్‌, మనీష్ పాండే / కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా, నవదీప్ సైనీ / షార్దుల్‌ ఠాకూర్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, జస్ప్రీత్ బుమ్రా. 

ఆస్ట్రేలియా : అరోన్‌ ఫించ్‌, డెవిడ్‌ వార్నర్‌, మార్నస్‌ లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, అలెక్స్‌ క్యారి, అగర్, ఆష్టన్‌ టర్నర్‌, పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌, ఆడం జంపా.

Follow Us:
Download App:
  • android
  • ios