Asianet News TeluguAsianet News Telugu

బంతితో రాధా యాదవ్, బ్యాట్ తో షెఫాలీ: శ్రీలంకపై ఘన విజయం

మహిళల టీ20 ప్రపంచ కప్ పోటీల్లో భారత జట్టు అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. శ్రీలంకపై భారత్ ఏడు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. షెఫాలీ వర్మ మరోసారి దూకుడు కనబరిచింది.

ICC Women's T20 World Cup: Radha Yadav, Shafali help India beat Sri Lanka by 7 wickets
Author
Melbourne VIC, First Published Feb 29, 2020, 12:41 PM IST

మెల్బోర్న్: టీ20 మహిళా ప్రపంచ కప్ పోటీల్లో భారత మహిళల జట్టు అప్రతిహతంగా దూసుకెళ్తోంది. శనివారం జరిగిన మ్యాచులో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. రాధా యాదవ్ బంతితో, షెఫాలీ వర్మ బ్యాట్ తో అద్భుతమైన ప్రదర్శన చేసి భారత్ కు విజయాన్ని అందించారు. 

వరుసగా నాలుగు విజయాలు సాధించిన భారత జట్టు టీ20 మహిళల ప్రపంచ కప్ గ్రూప్ - ఏ పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. శ్రీలంక జట్టును భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. 16 ఏళ్ల షెఫాలీ వర్మ 34 బంతుల్లో 47 పరుగులు చేసింది. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. భారత్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 14.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది. శ్రీలంక ఆటగాళ్లలో చమిరా ఆటపట్టు 33 పరుగులతో, కవిషా దిల్హరి 25 పరుగులతో కాస్తా రాణించారు.  

భారత బౌలర్లలో స్పిన్నర్ రాధా యాదవ్ నాలుగు వికెట్లు తీసింది. మరో స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ రెండు వికెట్లు పడగొట్టింది. దీప్తి శ్రమ, పూనమ్ యాదవ్, శిఖా పాండేలకు తలో వికెట్ దక్కింది. 114 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ ఆదిలోనే ,స్మృతి మంథానా (17) వికెట్ కోల్పోయింది. 

షెఫాలీ వర్మ ఈ టోర్నీలో మరోసారి రాణించింది. 34 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 47 పరుగులు చేసింది. అయితే, అనవసరమైన పరుగుకు ప్రయత్నించి ఆమె రన్నవుట్ అయింది. 

Follow Us:
Download App:
  • android
  • ios