ప్రస్తుతం కరోనా ధాటికి ప్రపంచం వణుకుతున్న సంగతి తెలిసిందే. దేశాలకు దేశాలే లాక్‌డౌన్లు ప్రకటించి జనాన్ని కట్టడి చేస్తున్నాయి. అయినప్పటికీ కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి.

దేశాధినేతలు, క్రీడా, రాజకీయ, సినీ ప్రముఖులు కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. సొంత రాష్ట్రమైన హర్యాణాలో ఖాకీ దుస్తులు ధరించి వీధుల్లో, రోడ్లపై విధులు నిర్వహిస్తున్నారు.

Also Read:టి20 ప్రపంచ కప్: భారత్ ఓకే అంటే వాయిదా, లేకపోతే రద్దు! ఎలాగంటే....

ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణా మండలి (ఐసీసీ) అతడిని రియల్ హీరో అంటూ అభినందించింది. ప్రపంచం కరోనా బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో జోగిందర్ తన వంతు కృషి చేస్తున్నాడని ప్రశంసించింది.

2007 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో ఆఖరి ఓవర్ వేసిన జోగిందర్ శర్మ తన అద్భుతమైన బౌలింగ్‌తో టీమిండియాకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.

Also Read:కరోనాపై వీడియో రిలీజ్ చేసిన కోహ్లీ, ముందు డొనేషన్ ఇవ్వాలని ఫాన్స్ ఫైర్!

దీంతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన జోగిందర్ 2018లో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత క్రికెట్‌కు అతను అందించిన సేవలకు గాను హర్యానా ప్రభుత్వం జోగిందర్‌ను డీఎస్పీగా నియమించిన సంగతి తెలిసిందే.

ఐసీసీ పెట్టిన ట్వీట్‌పై స్పందించిన క్రీడాభిమానులు, నెటిజన్లు జోగిందర్‌పై ప్రశంసలు కురిపించారు. కరోనా నుంచి జనాలను కాపాడేందుకు చెమటోడ్చుతున్నారని కామెంట్ చేస్తున్నారు.