దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్లకు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కొద్దిరోజుల నుంచి ఆటకు దూరంగా విశ్రాంతి తీసుకుంటున్న డుప్లెసిస్ తన నిర్ణయాన్ని ప్రకటించి అందరికీ షాకిచ్చాడు.

అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు అందుబాటులో ఉంటానని ప్రకటించిన అతను.. కొత్త నాయకత్వంలో దక్షిణాఫ్రికా మరింత ముందుకు వెళుతుందనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.

Also Read:కోహ్లీలో నాకు నచ్చింది అదే: సచిన్ తో విభేదించిన స్టీవ్ వా

జట్టుకు కొత్త కెప్టెన్ అవసరం ఉందని.. ఇన్ని రోజులుగా దక్షిణాఫ్రికాకు సారథ్యం వహించడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు. టీ20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం ఉంటుందని చెప్పిన డుప్లెసిస్ ఇంత హఠాత్తుగా నిర్ణయం తీసుకోవడంపై క్రికెట్ వర్గాలు విస్మయానికి గురయ్యాయి.

ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు, టీ20 సిరీస్‌కు మేనేజ్‌మెంట్ డుప్లెసిస్‌కు విశ్రాంతి ఇవ్వడంతో డీకాక్ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. అతని కెప్టెన్సీలో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను కోల్పోయినప్పటికీ జట్టు పోటీ బాగా ఆడిందని విమర్శకులు తెలిపారు.

Also Read:టీ20 ప్రపంచకప్... భారత్, పాక్ మ్యాచ్ రద్దు.. నిరాశలో అభిమానులు

ఓ వైపు కెప్టెన్‌గా జట్టును నడిపిస్తూనే డీకాక్ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో తన వారసుడిగా డీకాక్ సరైనవాడని భావిస్తున్న డుప్లెసిస్.. ఇదే తగిన సమయం అని భావించే ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చునని భావిస్తున్నారు.

గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ సందర్భంగా డుప్లెసిస్ నాయకత్వంలోని దక్షిణాఫ్రికా ఘోరంగా ఓడిపోయింది. ఇటీవల టీమిండియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌ను 3-1 తేడాతో కోల్పోయింది. పేలవమైన ఫామ్‌కు తోడు వరుస ఓటములు అతనిని తీవ్ర ఒత్తిడికి గురిచేశాయి. డుప్లెసిస్ గత 14 టెస్టుల్లో 20.92 సగటు మాత్రమే నమోదైంది.