ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా వార్తల్లో నిలిచిన అహ్మదాబాద్ ‌లోని మొటేరా క్రికెట్ స్టేడియంకు సంబంధించిన ఫోటోలను భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.

ఏరియల్ ద్వారా కెమెరాలో బంధించిన స్టేడియం ఫోటోలను పోస్ట్ చేస్తూ.. భారతదేశంలోని అహ్మదాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం.. దీని సీటింగ్ కెపాసిటీ 1.10 లక్షలు అని పేర్కొంది.

Also Read:ట్రంప్ నా కలలోకి వచ్చాడంటూ... విగ్రహం కట్టిన తెలంగాణవాసి

ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా ఘనత వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పరిమల్ నాత్వాని ఈ స్టేడియం ఫోటోలను షేర్ చేశారు.

అయితే అప్పటికి ఈ గ్రౌండ్‌లో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ సమయంలోనే ఆయన ఇది మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియం కంటే పెద్దదిగా చెప్పారు. ఎంసీజీ సీటింగ్ కెపాసిటీ 90,000.

Also Read:3 గంటలు... 100 కోట్లు @ ట్రంప్ పర్యటన ఖర్చు ఇది

ఈ నెల 24న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా మొటేరా స్టేడియంను  ప్రారంభించనున్నారు. త్వరలో జరగనున్న ఆసియా ఎలెవన్- వరల్డ్ ఎలెవన్ మ్యాచ్‌కు ఈ స్టేడియం తొలిసారిగా ఆతిథ్యమివ్వనుంది.

ట్రంప్ రాక నేపథ్యంలో స్టేడియంలో ఏర్పాట్లను గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ట్రంప్ ఆయన సతీమణి మెలానియా ట్రంప్ ఇద్దరు మొటేరా స్టేడియంలో ‘‘నమస్తే ట్రంప్’’ ఈవెంట్‌లో పాల్గొననున్నారు.