Under 19 World Cup: పాక్ ను ఓడించి ఫైనల్‌కు చేరిన ఆసీస్.. ఇక భారత్‌తో టైటిల్ పోరు..
Under 19 World Cup: అండర్-19 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా- పాకిస్థాన్‌ల మధ్య రెండో సెమీ-ఫైనల్ మ్యాచ్ (AUS vs PAK U19 WC 2024) ఉత్కంఠభరితంగా జరిగింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 1 వికెట్ తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. ఇలా ఫైనల్‌లోకి అడుగుపెట్టిన ఆస్ట్రేలియా ఆదివారం జరగబోయే తుది మ్యాచ్‌లో భారత్‌ను (IND vs AUS) ఢీ కొట్టనుంది.
Under 19 World Cup: అండర్-19 ప్రపంచకప్ (U19 World cup) ఫైనల్‌లో భారత్ Vs పాక్ ఉత్కంఠ పోరు చూడాలనుకున్న క్రికెట్ లవర్స్ కల చెదిరింది. బెనోని వేదికగా పాకిస్థాన్‌తో (Pakistan) జరిగిన ఉత్కంఠభరిత సెమీస్ పోరులో ఆస్ట్రేలియా (Australia) ఘనవిజయం సాధించింది. ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా జట్టు అండర్ 19 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌లోకి ప్రవేశించింది. 2018 తర్వాత కంగారూ టీమ్‌కి టోర్నీ ఫైనల్ టిక్కెట్ లభించింది. ఇప్పుడు ఆదివారం జరగబోయే అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్- ఆస్ట్రేలియా మధ్య టైటిల్ పోరు జరుగనున్నది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 179 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్ ఆరంభం నుంచి కంగారూ బౌలర్లు పాక్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పు తిప్పాలు పెట్టారు. 200 పరుగుల మార్కును అందుకోవాలనుకున్నా.. పాక్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ మ్యాచ్ లో టామ్ స్ట్రాకర్ ఒంటిచేత్తో 6 వికెట్లు తీసి కంగారూ జట్టుకు అండగా నిలిచారు. సరైన సమయంలో పాకిస్థాన్ బ్యాట్స్ మెన్స్ వికెట్స్ పడగొట్టి తన జట్టు విజయానికి మార్గ సుగమం చేశారు.
అజాన్ అవైస్ (52; 91 బంతుల్లో 3×4), అరాఫత్ మిన్హాస్ (52; 61 బంతుల్లో 9×4) అర్ధశతకాలు చేశారు. ఓపెనర్ షమైల్ హుస్సేన్ కేవలం 17 పరుగులకే చేయగా.. మిగతా బ్యాట్స్ మెన్స్ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్ట్రేకర్ 6 వికెట్లు పడగొట్టగా మహిల్ బియర్డ్‌మ్యాన్, గాలం విడ్లెర్,రాఫ్ మెక్‌మిలాన్, టామ్ గాంప్‌బెల్ తలో వికెట్ పడగొట్టారు.
180 పరుగుల ఛేదనకు దిగిన యంగ్ ఆస్ట్రేలియా టీంకు విజయం సులభంగా లభించలేదనే చెప్పాలి. పాక్ బౌలర్లు కూడా ఆసీస్ బ్యాట్స్ మెన్స్ కు చుక్కలు చూపించారు. కేవలం 59 పరుగులకే ఆసీస్ కు చెందిన టాప్ 4 వికెట్లను పడగొట్టి.. జూనియర్ కంగారూ టీమ్ ను కంగారు పెట్టించారు. ఈ తరుణంలో ఓపెనర్ హ్యారీ డిక్సన్ నిలదొక్కుకుంటూ.. 75 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అయితే, జట్టు స్కోరు 102 పరుగుల వద్ద అరాఫత్ మిన్హాస్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అతడితో పాటు ఆలివర్ పీక్ 49 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
టామ్ క్యాంప్‌బెల్ 42 బంతుల్లో 25 పరుగులు చేశాడు. వరుసగా వికెట్లు పడటంతో ఆసీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆఖర్లో వచ్చిన రాఫ్ మ్యాక్ మిలన్ (19*) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివరి ఓవర్లో 3 పరుగులు సాధించాల్సి ఉండగా.. క్రీజులో ఉన్న చివరి బ్యాట్స్‌మన్ జీషన్ బౌండరీ బాదడంతో మ్యాచ్ ముగిసింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలదొక్కుకుని ఎట్టకేలకు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నారు. పాక్ బౌలర్లలో అలీ రజా 4 వికెట్లు పడగొట్టగా.. మిన్హాస్ 2, బెయిడ్ షా, నవీద్ అహ్మద్ ఖాన్ చెరో వికెట్ తీశారు.