ఇస్లామాబాద్: ఆస్ట్రేలియాపై బెంగళూరులో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా బౌలర్లను చితక్కొట్టిన రోహిత్ శర్మపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ప్రశంసల జల్లు కురిపించాడు. అదే సమయంలో ఆస్ట్రేలియా బౌలర్లను హేళన చేశాడు. తన యూట్యూబ్ లో ఆ మేరకు ఓ పోస్టు పెట్టాడు. 

రోహిత్ శర్మ ఆస్ట్రేలియా బౌలర్లను మార్ మార్ కే భర్తా నికాల్ దియా (చెత్త కింద కొట్టేశాడు) అని షోయబ్ అక్తర్ అన్నాడు. రోహిత్ శర్మ 119 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

Also Read: మ్యాచ్ రివ్యూ: బాకీ తీర్చుకున్న రోహిత్... లెక్క సరిచేసిన కోహ్లీ

"చిన్నస్వామిలో ఇండియా ఆస్ట్రేలియాను భయపెట్టింది. వారిని చితక్కొట్టింది. పిల్లలతో ఆడుకున్నట్లు ఆస్ట్రేలియా క్రికెటర్లతో ఇండియా ఆడుకుంది. రోహిత్ శర్మ హోరెత్తినప్పుడు చెడ్డ బంతియా, మంచి బంతియా అనేది చూడడు. అతనికి చాలా సమయం ఉంది. చాలా ప్రతిభ ఉంది" అని అక్తర్ అన్నాడు. 

ప్రతిదీ రోహిత్ శర్మకు సులభంానే కనిపిస్తుందని, అది చాలా సహజంగా వచ్చేస్తుందని, బ్యాటింగ్ కు అత్యంత అనుకూలమైన చిన్నస్వామి స్టేడియంలో రోహత్ శర్మ నిర్దయగా వారిని ఊచకోత కోశాడని అన్నాడు. ఆడమ్ జంపాను, మిచెల్ స్కార్క్ ను ఉతికి ఆరేశాడని ఆయన రోహిత్ శర్మను ప్రశంసించాడు.

Also Read: రాహుల్ ఔటైన తర్వాత కోహ్లీకి అదే చెప్పా: రోహిత్ శర్మ

రోహిత్ శర్మ టచ్ లోకి వచ్చాడంటే ఆపడం కష్టమని అక్తర్ అన్నాడు. ఫాస్ట్ బౌలింగులో రోహిత్ శర్మ అప్పర్ కట్ తో సిక్స్ లు కొట్టి సచిన్ ను గుర్తు చేశాడని ఆయన అన్నాడు. 2003 ప్రపంచ కప్ పోటీల్లో సచిన్ టెండూల్కర్ తన బౌలింగులో ఇలానే సిక్స్ లు కొట్టాడని ఆయన గుర్తు చేశాడు. 

సెంచూరియన్ లో జరిగిన మ్యాచులో సచిన్ థర్డ్ మ్యాన్ దిశగా కొట్టిన అప్పర్ కట్ షాట్ తనకు ఇప్పటికీ గుర్తుందని చెప్పాడు. దాన్ని మరోసారి రోహిత్ శర్మ గుర్తు చేశాడని అన్నాడు.