Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్: ఔషధాల తయారీ సరుకుల కొరత...ఆ మందులకు ఇబ్బందులు..

కరోనా వైరస్ నియంత్రణ కోసం ఔషధాలు తయారు కాలేదు. కానీ ప్రత్యామ్నాయంగా హైడ్రాక్సీ క్లోరోక్వీన్, క్లోరోక్వీన్ ఫాస్పేట్, పెరాసిటమాల్ తదితర ఔషధాలు వాడుతున్నారు. కానీ ప్రస్తుతం వీటి తయారీకి అవసరమైన ముడి సరుకు కొరత ఏర్పడుతోంది. 
 

Shortage of medicines as COVID-19 battle intensifies
Author
Hyderabad, First Published Apr 18, 2020, 3:58 PM IST

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాధికి ఇంతవరకూ సరైన చికిత్స లేదు. దీన్ని నియంత్రించే ఔషధం ఇంతవరకు ఆవిష్కరించలేదు. అదే సమయంలో వ్యాక్సిన్‌ను తయారుచేసే యత్నాలు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో ఇతర వ్యాధులకు చికిత్సలో వినియోగించే కొన్ని ఔషధాలు కరోనా బాధితులకు ఉపశమనాన్ని కలిగిస్తున్నట్లు తేలింది.

దీంతో ఆ ఔషధాలకు ఒక్కసారిగా గిరాకీ ఏర్పడింది. అందులో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ నివారణకు వినియోగించే మందులు, మలేరియా వ్యాధి నియంత్రణ కోసం వాడే క్లోరోక్విన్‌, యాంటీ-బయాటిక్‌ ఔషధాలు ఉన్నాయి. ఈ మందులను తయారు చేసే ఫార్మా కంపెనీలు మనదేశంలోనే అధికంగా ఉన్నాయి.

వాస్తవంగా ఔషధ పరిశ్రమ మనదేశంలో గత రెండు, మూడు దశాబ్దాల్లో బహుముఖంగా విస్తరించింది. అభివృద్ధి చెందిన అమెరికా, ఐరోపా దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, కొన్ని ఆసియా దేశాలు, మనదేశం నుంచి మందులను పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నాయి.

దీనికి తోడు కొవిడ్‌-19 వ్యాధిగ్రస్తులకు చికిత్సలో వినియోగిస్తున్న హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌, మలేరియా మందుల తయారీ కూడా భారత్​లోనే అధికం. ఫలితంగా ఈ ఔషధాలను సరఫరా చేయాల్సిందిగా అమెరికా నుంచి బ్రెజిల్‌, ఇజ్రాయెల్‌ తదితర ఎన్నో దేశాలు మనదేశంపై ఒత్తిడి తెస్తున్నాయి. 

అదే సమయంలో దేశీయ అవసరాలకు మందులు సరఫరా చేయాల్సిన బాధ్యత ఎటూ ఉండనే ఉంది. ఈ పరిస్థితుల్లో దేశీయ ఫార్మా కంపెనీలు పెద్దఎత్తున ఈ ఔషధాల తయారీని చేపట్టాయి. కానీ ఇక్కడే సమస్య ఉంది. ప్రస్తుత అవసరాలకు తగినట్లు ఈ ఔషధాలు తయారు చేయటానికి ఫార్మా కంపెనీలకు ముడిపదార్థాల కొరత ఎదురవుతోంది. 

రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఫార్మా కంపెనీల వద్ద ఉన్న ముడిసరకు నిల్వలు దాదాపుగా అయిపోయాయి. కొత్తగా ముడిపదార్థాలు అందితే గానీ మందులు తయారు చేయటం సాధ్యం కాని పరిస్థితి నెలకొన్నట్లు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ప్రధానంగా 'క్లోరోక్విన్‌' తయారీకి అవసరమైన ముడిపదార్థాల కొరతను స్థానిక ఫార్మా కంపెనీలు ఎదుర్కొంటున్నాయి.

ప్రధానంగా హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌, అజిత్రోమైసిన్‌, క్లోరోక్విన్‌ తయారు చేసే ఫార్మా కంపెనీలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. అందులోనే క్లోరోక్విన్‌కు ప్రస్తుతం అధిక గిరాకీ ఉంది. ఒక పక్క ఎగుమతులకు తోడు దేశీయ మార్కెట్లోనూ ఈ ఔషధాన్ని అధికంగా కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో.. స్థానిక ఫార్మా కంపెనీలు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌, క్లోరోక్విన్‌ ఫాస్పేట్‌ మాత్రల తయారీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. 

also read ఆర్‌బిఐ కీలక ప్రకటన...బ్యాంకులు రిస్క్ చేస్తేనే ఉపయోగం...

వీటి అవసరాలకు తగినంతగా ముడిపదార్థాల సరఫరా లేదు. కరోనా వ్యాధి విస్తరించటానికి ముందు క్లోరోక్విన్‌ మాత్రలకు ఉన్న గిరాకీ ఎంతో తక్కువ. కేవలం మలేరియా, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, లుపస్‌ వ్యాధిగ్రస్తులకు మాత్రమే వైద్యులు ఈ టాబ్లెట్లు సిఫారసు చేస్తారు. అందువల్ల పరిమితమైన వినియోగం మాత్రమే ఉండేది. అంతేగాక ఎగుమతులు కూడా తక్కువ. 

అందువల్ల పెద్దఎత్తున ముడిపదార్ధాలను నిల్వ చేయటంపై కానీ, తయారు చేయటంపై కానీ ఇక్కడి కంపెనీలు పెద్దగా దృష్టి సారించలేదు. కరోనా వైరస్​ విజృంభణతో ఒక్కసారిగా క్లోరోక్విన్‌కు గిరాకీ లభించింది. 

ఫలితంగా అప్పటికప్పుడు అందుబాటులో ఉన్నంత మేరకు ముడిపదార్ధాలు సేకరించి ఔషధం తయారు చేశాయి. ఇక కొత్తగా ముడిపదార్ధాలు సరఫరా అయితే గానీ ఈ మాత్రలు తయారు చేయలేని పరిస్థితి ఏర్పడినట్లు సంబంధిత వర్గాలు వాపోతున్నాయి.

క్లోరోక్విన్‌ తయారీలో ఇప్కా ల్యాబ్స్‌, జైడస్‌, సిప్లా తదితర అగ్రగామి ఔషధ కంపెనీలతో పాటు హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హెటెరో డ్రగ్స్‌, నాట్కో ఫార్మా, లారస్‌ ల్యాబ్స్‌... తదితర పలు ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ ఇప్పుడు సాధ్యమైనంత మేరకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రల తయారీలో నిమగ్నమై ఉన్నాయి. 

కానీ కొన్నింటికి తగినంతగా ముడిపదార్ధాల లభ్యత లేదని తెలిసింది. ఇందులో కొన్ని కంపెనీలు చైనా నుంచి ముడి పదార్ధాలు ఆర్డర్‌ చేసి... అక్కడి నుంచి కంటైనర్లు ఎప్పుడు వస్తాయా... అని ఎదురుచూస్తున్నాయి. మరోపక్క స్థానికంగా ఉన్న బల్క్‌, ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్స్‌) లు తయారు చేసే యూనిట్లు కొన్ని ఇప్పుడు క్లోరోక్విన్‌ తయారీకి అవసరమైన ముడిపదార్ధాలు, ఇంటర్మీడియేట్స్‌ తయారీని చేపట్టినట్లు తెలిసింది. 

తెలంగాణ డ్రగ్‌ కంట్రోలర్‌ డైరెక్టర్‌ కార్యాలయం కూడా ఈ సమస్యను గుర్తించి ఇటీవల ఇంటర్మీడియేట్స్‌ తయారీ చేపట్టాలని కొన్ని బల్క్‌ డ్రగ్‌ యూనిట్లను కోరింది. గతంలో క్లోరోక్విన్‌ ముడిపదార్థాలు, ఇంటర్మీడియేట్స్‌ తయారు చేస్తూ గిరాకీ లేదని.. వాటి తయారీని నిలుపుదల చేసిన కొన్ని యూనిట్లు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు అవి మళ్లీ ముడిపదార్దాల తయారీని చేపట్టినట్లు తెలుస్తోంది. 

ఏది ఏమైనా ముడిపదార్థాలు లేకపోవటం వల్ల 'క్లోరోక్విన్‌' తయారీ పూర్తిస్థాయిలో సాధ్యం కావటం లేదు. 'అన్ని సిద్ధంగా పెట్టుకొని ముడిపదార్ధాల కన్‌సైన్‌మెంట్ల కోసం ఎదురుచూస్తున్నాం, ఎప్పుడు వస్తే అప్పుడు క్లోరోక్విన్‌ తయారీని చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం' అని స్థానిక ఫార్మా కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios