ఫోర్త్ వేవ్ టెన్షన్.. భారత్ లో కొత్త XE వేరియంట్ గుర్తింపు.. ? దీని లక్షణాలేంటి ?
యూకేలో మొదట వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త XE వేరియంట్ ఇండియాలోని ముంబైలో కూడా గుర్తించారని నివేదికలు వచ్చాయి. అయితే దీనిని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఇది తప్పుడు సమాచారం అని తెలిపింది. అయితే అసలు XE వేరియంట్ అంటే ఏమిటీ ? దీని లక్షణాలు ఏమిటీ అనే విషయాలను తెలుసుకునేప్రయత్నం చేద్దాం.
భారత్ లో కరోనా కొత్త వేరియంట్ బుధవారం కలకలం రేపింది. మన దేశంలో మొట్టమొదటి సారిగా SARS-CoV2 కు చెందిన XE వేరియంట్ కేసును మహారాష్ట్రలోని ముంబైలో గుర్తించినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఆందోళన నెలకొంది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ వేరియంట్ ఇంకా భారత్ లోకి ప్రవేశించలేదని చెప్పింది.
ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ 50 ఏళ్ల మహిళలో ఈ కొత్త వేరియంట్ సోకిందని బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ బుధవారం ప్రకటించింది. ఆమె ఫిబ్రవరి 10న భారత్ కు వచ్చిందని, ఫిబ్రవరి 27వ తేదీన పరీక్షించగా కోవిడ్-19 పాజిటివ్ అని తేలిందని పేర్కొంది. ఆమె నుంచి సేకరించిన శాంపిల్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ముంబైలోని కస్తూర్బా హాస్పిటల్ సెంట్రల్‌కు రిఫర్ చేశామని పేర్కొంది. అయితే ప్రారంభ సీక్వెన్సింగ్‌లో ఇది కొత్త XE వేరియంట్‌గా కనుగొనబడిందని తెలిపింది. దీనిని GISAID కూడా ధృవీకరించినప్పటికీ, XE పూర్తి స్థాయి నిర్దారణ కోసం జాతీయ ప్రయోగశాలలో మరొక రౌండ్ జీనోమ్ సీక్వెన్సింగ్ కు వెళ్లాలని INSACOG నిర్ణయించిందని ఆరోగ్య శాఖ తెలిపింది.
ఏమిటీ XE వేరియంట్ ?
XE వేరియంట్ అనేది కోవిడ్-19కి కారణమయ్యే వైరస్ అయిన SARS-CoV-2 ఉప-వంశాలు అయిన BA.1, BA.2ల రీకాంబినెంట్. దీంతో పాటు ఇది Omicron లేదా BA.1 లేదా BA.2లో లేని మూడు ఇతర ఉత్పరివర్తనాలను కలిగి ఉంది. అందుకే దీనిని XE అని పిలుస్తారని బెంగళూరులోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ సొసైటీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా PTI కి చెప్పారు. ఈ కొత్త కోవిడ్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు. దాని తీవ్రత, ట్రాన్స్మిసిబిలిటీపై రాకేష్ మిశ్రా మాట్లాడుతూ.. UKలో సేకరించిన ఇన్ఫెక్షన్ డేటా ఆధారంగా XE 10 శాతం ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందని అన్నారు.
లక్షణాలేంటి ? భయపడాల్సిన అవసరం ఉందా ?
ప్రస్తుతం ఉన్న డేటా ఆధారంగా అయితే ఈ వేరియంట్ కు రోగనిరోధక శక్తి ఎలా ఉందనే సమాచారం అందుబాటులో లేదని రాకేశ్ మిశ్రా తెలిపారు. ఈ వేరియంట్ కు ఒమిక్రాన్ లక్షణాలైన జ్వరం, గొంతు నొప్పి, గొంతు గీసుకోవడం, దగ్గు, జలుబు, చర్మ చికాకు, రంగు మారడం జీర్ణశయంలో కొంత బాధ ఉంటాయని తెలిపారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)లోని ఎపిడెమియాలజీ, కమ్యూనికేబుల్ డిసీజెస్ విభాగానికి చెందిన మాజీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రామన్ గంగాఖేడేకర్ మాట్లాడుతూ.. రీకాంబినెంట్ సంభవించినప్పుడు అది చాలా తక్కువ సమయం వరకు ఉంటుందని అన్నారు. ‘‘ రీకాంబినెంట్ ఈవెంట్స్ అనేవి అనుకోకుండా ఏర్పడుతాయి. ఎందుకంటే శరీరంలో రెండు రకాల వైరస్‌లు ఉంటాయి. అవి రీకాంబినెంట్ కొత్త వైరస్‌ను అభివృద్ధి చేస్తాయి ’’ అని ఆయన తెలిపారు. రీకాంబినెంట్ ఈవెంట్ ద్వారా వైరస్ కు ఫిట్‌నెస్ పెరగదని ఆయన అన్నారు. రీకాంబినెంట్‌లు అరుదైన సంఘటనలు కాబట్టి ఇది స్థిరంగా ఉండే అవకాశం లేదని అన్నారు.
XE ఆందోళనకరమైన వేరియంటా ?
XE వేరియంట్ విషయంలో అశోక విశ్వవిద్యాలయంలో బయోసైన్సెస్ అండ్ హెల్త్ రీసెర్చ్ డీన్ అనురాగ్ అగర్వాల్ మాట్లాడుతూ... XEకి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి క్లిష్టమైన, ఆందోళన చెందే సంకేతాలు కనిపించడం ఏదు.’’ అని అన్నారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ 2వ తేదీన ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా వైరస్ మునుపటి జాతుల కంటే XE ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని పేర్కొంది.
మొదట ఎక్కడ కనుగొన్నారు ?
XE రీకాంబినెంట్ (BA.1-BA.2)ను మొదటిసారి జనవరి 19న UKలో కనుగొన్నారు. అప్పటి నుంచి 600 కంటే ఎక్కువ సీక్వెన్సులు బయటపడ్డాయని, అవి నిర్దారణ అయ్యాయని WHO తన తాజా నివేదికలో పేర్కొంది. XE వేరియంట్ థాయిలాండ్, న్యూజిలాండ్‌లలో కూడా వెలుగులోకి వచ్చింది.