హైదరాబాద్: ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మర్కజ్ కు వెళ్లి హైదరాబాదు పాతబస్తీకి వచ్చినవారిని అధికారులు గుర్తించారు. మర్కజ్ నుంచి వచ్చినవారి నుంచి కరోనా వైరస్ ఇతరులకు సోకుతున్న విషయం తెలిసిందే. ఈ స్థితిలో విదేశీయులను గుర్తించే పనిలో అధికారులు పడ్డారు.

నిజాముద్దీన్ మర్కాజ్ కు హాజరై వచ్చినవారి లెక్క తేల్చాలని కేంద్రప్రభుత్వం ఆదేశించింది. వారి పాస్ పోర్టులను బ్లాక్ లిస్టులో పెడుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. మర్కాజ్ కు హాజరై హైదరాబాదు పాతబస్తీకి 64 మంది వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వారిని నిజామియా ఆస్పత్రికి తరలించారు.

హైదరాబాదు పాతబస్తీకి ఇరాన్ నుంచి 6గురు, ఇండోనేషియా నుంచి 10 మంది, సూడాన్ నుంచి 8 మంది, అల్జిరీయా నుంచి ఒకరు, బంగ్లాదేశ్ నుంచి ఒకరు, కజికిస్తాన్ నుంచి 14 మంది, మలేషియా నుంచి 6గురు, థాయ్ లాండ్ నుంచి ఇద్దరు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. 

దేశవ్యాప్తంగా 647 మంది మర్కాజ్ నలో పాల్గొన్నవారు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. నిజాముద్దీన్ ప్రాంతంలో మర్కాజ్ లో పాల్గొన్నవారి వల్ల వివిధ రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చినవారు కూడా వివిధ ప్రాంతాల్లో ఉన్నట్లు భావిస్తున్నారు.

మర్కాజ్ లో పాల్గొని వచ్చినవారు స్వతంత్రంగా వారంత వారు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నప్పటికీ పెద్దగా స్పందన చూపడం లేదు. పైగా వివిధ రాష్ట్రాల్లో పోలీసులపై, వైద్యులపై దాడి చేస్తున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. 

ఉత్తరప్రదేశ్ లో కరోనా వైరస్ బాధితులు మహిళా నర్సుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో కరోనా వైరస్ బాధితుల వార్డుల్లో మగ నర్సులను మాత్రమే నియోగించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.