కరోనా వైరస్ కరాళ నృత్యానికి ప్రపంచం వణికిపోతుంది, పేద, ధనిక అన్న తేడా లేకుండా... నాకు అందరూ ఒక్కటే అన్నట్టుగా రెచ్చిపోతోంది కరోనా వైరస్. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ పాటిస్తున్నాయి. మందు లేకపోవడంతో ఈ వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి లాక్ డౌన్ ద్వారా పూర్తి సోషల్ డిస్టెంసింగ్ మైంటైన్ చేయడమే మార్గమని భావిస్తున్నాయి అన్ని దేశాలు. 

భారతదేశం కూడా ఇదే తరహాలో లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా రెక్కాడితే కానీ డొక్కాడని వారి పరిస్థితి దయనీయంగా మారిపోయింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరికి అవి ఇంకా చేరుకోవడం లేదు. 

ఇలాంటి వారికి సహాయం చేసేందుకు మేమున్నామని ముందుకొస్తున్నారు ఈ ముగ్గురు యువకులు. అక్కు జైన్, భాస్కర్, శివ కుమార్. ఏఎం ఫౌండేషన్ అనే సంస్థను ఏర్పాటు చేసి హైదరాబాద్ లో ఉంటున్న ఎందరో పేదలకు ఈ లాక్ డౌన్ వేళ మేము ఉన్నామని అభయమిస్తూ వారికి అవసరమైన నిత్యావసరాలను అందిస్తున్నారు. 

ఇంత చేస్తున్నారు వారేమన్నా అపర కుబేరులా అంటే అది కాదు. ఉన్న వ్యాపారమో ఉద్యోగమో చేసుకుంటే తప్ప కుటుంబ పోషణ సాగదు. అయినా సహాయం చేయాలంటే మనసుండాలి కానీ ఎంత డబ్బుంటే ఏమిటి చెప్పండి. 

వీరిలో ఒకతను ఉద్యోగస్థుడు కాగా, మరొక అతను వ్యాపారం చేసుకుంటున్నాడు. వ్యాపారం అంటే... ఏ అంబానీ లెవెల్ అనో ఊహించకండి. సాధారణ వ్యాపారం చేస్తున్నాడు. ఇంకో వ్యక్తి చదువుకుంటున్నాడు. ఇలా కలిసిన వీరంతా ఈ ఆపద సమయంలో ప్రజలకు తమకు తోచిన విధంగా కూరగాయల నుంచి మొదలు బియ్యం ఉప్పు పప్పు వరకు వారికి తోచినంత మేర, సాధ్యమైనంత వరకు అందిస్తున్నారు. 

వీరు వాస్తవానికి ఫౌండేషన్ ప్రారంభించింది, అత్యవసర సమయంలో రక్తం అందకుండా ఎవరు మరణించొద్దు అనే ఒక సదుద్దేశంతో. 

కరోనా తో బయట అంతా లాక్ డౌన్ కొనసాగుతున్నా... వీరు మాత్రం ఇప్పటికి రక్తం అవసరమంటే వెంటనే స్పందించి రక్తదాతలను సమకూరుస్తున్నారు. రక్తదాతలకు ఆసుపత్రుల వరకు రవాణా సదుపాయాన్ని కల్పిస్తూ సేవ చేస్తున్నారు. 

అయినా సేవ చేయాలంటే మంచి మనసుండాలి , ఇతరులకు సహాయపడాలనే గుణముండాలి కానీ... డబ్బు ఎంతున్నా వ్యర్థమే. తమ చేతనైనంత డబ్బును సమకూరుస్తూనే... మిత్రుల వద్ద, తెలిసిన వారి వద్ద కూడా డబ్బులు సేకరించి అవసరమైన వారికి నిత్యావసరాలు అందిస్తున్నారు. 

పూటగడవడమే కష్టంగా మారి ఈ కరోనా కష్టకాలంలో అన్నమో రామచంద్ర అని అలమటిస్తున్న వారందరికీ... మేము ఉన్నామంటూ అభయమిస్తూ, అవసరమంటే  వాలిపోతున్నారు ఈ కుర్రాళ్ళు. ఇలాంటివారిని అభినందించకుండా ఉండలేము.