హైదరాబాద్: చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందనేది తప్పుడు ప్రచారమని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పారు. చికెన్, గుడ్లు తింటే కరోనా వ్యాధి తగ్గుతుందని, అవి రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి పనికి వస్తాయని ఆయన శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశంలో ఆ విషయం చెప్పారు. రోగనిరోధక శక్తిని పెంచుకోవడం వల్లనే కరోనా వైరస్ ఎదుర్కోగలమని ఆయన చెప్పారు. 

దానిమ్మ, బత్తాయి, నిమ్మ, కమలాలు వంటి సీ విటమన్ ఉన్న పండ్లు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని, వాటిని తినడం అలవాటు చేసుకోవాలని ఆయన అన్నారు. నల్లగొండ జిల్లాలో బత్తాయి పండ్లు పండుతాయని, వాటిని వేరే రాష్ట్రాలకు పంపించవద్దని, మన రాష్ట్రంలోనే వాడుకుందామని ఆయన చెప్పారు. నల్లగొండ జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు సమన్వయం చేసి వాటిని రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు పంపించేలా చూడాలని ఆయన అన్నారు.

Also Read: చికెన్, గుడ్లు తింటే కరోనా వైరస్ ను ఎదుర్కోవచ్చు: కేసీఆర్

ఇప్పుడు మామిడి పండ్లు కూడా వస్తాయని, అవి కూడా ఆరోగ్యానికి మంచిదని ఆయన అన్నారు. వాటిని జిల్లా, తాలూకా కేంద్రాలకు పంపించాలని ఆయన అన్నారు. కోడి గుడ్ల రవాణాకు, నిత్యావసర సరుకుల రవాణాకు ఆటంకాలుండవని ఆయన చెప్పారు. 

తమ పంటల విషయంలో రైతులు ఆందోలనకు గురి కావద్దని ఆయన చెప్పారు. పట్టణాల్లో మార్కెట్ యార్డులన్నీ మూసే ఉంటాయని ఆయన చెప్పారు. ప్రభుత్వ అధికారులే గ్రామాలకు వస్తారని, రైతులు పండించిన ప్రతి గింజా ప్రభుత్వం కొంటుందని ఆయన అన్నారు. రైతులు తమ బ్యాంక్ ఖాతాల నెంబర్లు ఇస్తే డబ్బులు అందులో వేస్తామని ఆయన చెప్పారు. అధికారులు నిదానంగా ధాన్యం కొనుగోలు చేస్తారని, ఆగమాగం కావద్దని ఆయన అన్నారు. 

See Video: ఇళ్లలోనే శుక్రవారం ప్రార్థనలు : మక్కా మసీదు ఇలా...

గ్రామాల సరిహద్దుల్లో కంచెలు వేసుకోవడం ఒక రకంగా మంచిదే గానీ మరో రకంగా చెడ్డది కూడా అని ఆయన అన్నారు. అంబులెన్స్ లు, ఇతర నిత్యావసర సరుకుల వాహనాలు రావడానికి ఇబ్బంది అవుతుందని, అందువల్ల కంచెలు తొలగించాలని ఆయన అన్నారు.