న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని నియంత్రించడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది. దీంతో చాలా మంది వ్యక్తిగత ఆదాయం తగ్గిపోయింది. ఇంతకుముందే తీసుకున్న రుణాల నెలవారీ వాయిదా చెల్లింపుల విషయంలో వారు తీవ్ర ఒత్తిళ్లకు గురయ్యారు. 

అయితే వీరికి ఊరట కల్పించేందుకు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) గత మార్చి 27న తొలిసారి మూడు నెలలు మారటోరియం విధించింది. ఆ గడువు ఈ నెలతో ముగియనున్నది. అయితే లాక్ డౌన్ ఈ నెల 17 వరకు కొనసాగనున్నది. 

ఈ నేపథ్యంలో ఆర్బీఐ మరోమారు రుణ వాయిదాల చెల్లింపుపై మూడు నెలల మారటోరియం విధించాలని యోచిస్తున్నట్లు వార్తలొచ్చాయి.ఇప్పటికే ఎన్బీఎఫ్సీలకు ఇచ్చిన రుణాల చెల్లింపునకు మారటోరియం గడువు పెంచుతున్నట్లు వివిధ బ్యాంకులు వెల్లడించాయి. ఇది రిటైల్ రుణాలకు కూడా వర్తిస్తుందని పలువురు ఆశాభావంతో ఉన్నారు. ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ కూడా ఈ అంశాన్ని పరిశీలించాలని ఇప్పటికే ఆర్బీఐని కోరింది. 

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వేతనాల్లో కోత, వ్యక్తిగత ఆదాయం తగ్గుదల రుణ వాయిదాల చెల్లింపు వాయిదా వేయడం రుణ గ్రహీతలకు ఊరటే. అయితే ఈ మారటోరియం వాడుకోవడం వల్ల తాత్కాలికంగా ఆర్థిక పరమన ఒత్తిళ్లను తగ్గించుకోవచ్చు కానీ భవిష్యత్‌లో భారంగా పరిణమిస్తుందని.

ఆర్బీఐ మార్చి 27న మారటోరియం విధించగానే చాలా మంది వాయిదాల చెల్లింపులను రద్దు చేసిందని అపోహలకు గురయ్యారు. కానీ తర్వాత బ్యాంకులు తమ వైఖరి వెల్లడించడంతో వాస్తవ పరిస్థితులు రుణ గ్రహీతలకు అవగతం అయ్యాయి. మూడు నెలల వాయిదా వడ్డీ, అసలు రుణంలో కలిపేయడమే ఈ మారటోరియం మతలబు. దీనివల్ల అసలుమొత్తంతోపాటు చెల్లింపు వ్యవధి పెరుగుతుంది. 

also read ఫోర్బ్స్ జాబితా విడుదల...మళ్ళీ భారత బిలియనీర్ గా ముకేశ్ అంబానీ

వాణిజ్య, సహకార బ్యాంకులు, బ్యాంకేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ), ఇతర ఆర్థిక సంస్థలు ఇచ్చిన టర్మ్, వ్యవసాయ రుణాలకు ఈ మారటోరియం వాడుకోవచ్చు.. క్రెడిట్ కార్డు బిల్లులు, క్రెడిట్ కార్డు రుణ వాయిదాలకు కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. ఒక బ్యాంకులో హోం లోన్, మరో బ్యాంకులో పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు ఉన్నా.. వాటన్నింటికీ ఈ మారటోరియం కల్పించిన వెసులుబాటును వాడుకోవచ్చు.

వాయిదా చెల్లింపు మారటోరియానికి అనుగుణంగా తాత్కాలికంగా ఆపేస్తే బ్యాంకులు వడ్డీని అసలులో కలిపివేస్తాయి. అంటే మళ్లీ కొత్త రుణాలిచ్చినట్లే. బ్యాంకులకు ఇది ఒకరకంగా మేలు చేసే విసయమే. రుణ గ్రహీతలకు మాత్రం తాత్కాలిక ఊరట మాత్రమే.దీర్ఘకాలంగా భారంగా మారడం ఖాయం. 

మూడు నెలల ఈఎంఐలకు మారటోరియం వాడుకుంటే అదనపు రుణ భారానికి అనుగుణంగా ఈఎంఐలు ఏడాది పెరుగుతాయి. మరో మూడు నెలలు కూడా మారటోరియం ఆర్బీఐ పొడిగిస్తే రుణ చెల్లింపు గడువు రెండేళ్లకు పెరుగుతుంది.

ఆదాయం తగ్గిన వారు మాత్రమే మారటోరియం వాడుకుంటే బావుంటుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉండి రుణ వాయిదాలు చెల్లించగల స్థితి ఉన్న వారు చెల్లించేయడమే బెటర్. ఇక క్రెడిట్ కార్డుల బిల్లులు, ఈఎంఐలు చెల్లించడమే మేలు చేస్తుందంటున్నారు. 

మార్చి 27న ఆర్బీఐ ప్రకటించిన మారటోరియాన్ని రుణ గ్రహీతలు పెద్దగా వాడుకున్న దాఖలాలు లేవు. ఇంటి రుణదాతల్లో 10 శాతం మంది మాత్రమే ఈ వెసులుబాటు వాడుకున్నట్లు ఎస్బీఐ వెల్లడించిందిన ఇక ఎల్ఐసీ హౌసింగ్ లోన్ తీసుకున్న వారు 15 శాతం వరకు మారటోరియం వాడుకున్నారు.ఎన్బీఎఫ్సీల రుణాలపై మారటోరియం అమలు చేస్తామని ఎస్బీఐ వెల్లడించింది. 

ఇప్పుడు బ్యాంకులన్నీ రెపో ఆధారిత వడ్డీరేటు (ఆర్ఎల్ఎల్ఆర్) ప్రామాణికంగా తీసుకుని కొంత వడ్డీ అదనంగా వసూలు చేస్తున్నాయి. కనుక బ్యాంకులు, హౌసింగ్ లోన్ సంస్థల నుంచి తీసుకున్న హోం రుణాల చెల్లింపుల్లో రుణ గ్రహీతలు పాత విధానం ఎంసీఎల్ఆర్ విధానంలో కొనసాగితే దాన్ని మార్చుకుని ఆర్ఎల్ఎల్ఆర్ విధానంలోకి మారాలని సూచిస్తున్నారు. ఇందుకు ఎస్బీఐ రూ.5000 వసూలు చేస్తోంది. దీనివల్ల వడ్డీ భారం తగ్గుతుంది. 

మారటోరియం వాడుకుని.. తర్వాత కొంత అసలు చెల్లిస్తే భారముండదని కొందరు బావిస్తున్నా.. అందువల్ల పెద్దగా కలిసొచ్చేదేమీ లేదని ఆర్థిక వేత్తల అభిప్రాయం. మారటోరియం వడ్డీ అసలులో కలవడమే దీనికి కారణం. కొత్తగా మీరు మారటోరియం తర్వాత చెల్లించేది కొత్తగా కలిసిన వడ్డీకే సరిపోతుంది.. అసలు రుణంలో మార్పు ఉండదు కనుక రుణ వాయిదాలను ఎప్పటికప్పుడు చెల్లించడమే బెటర్.