తనకు కరోనా సోకిందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా, అతనికి జరిపిన పరీక్షలో నెగిటివ్ వచ్చిన విషాదకర ఘటన తమిళనాడులో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని మధురైకి చెందిన 35 ఏళ్ల వ్యక్తి కేరళలో కూలీగా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఉపాధి లేకపోవడంతో తన తల్లిని చూసేందుకు మధురైలోని తన స్వగ్రామానికి వచ్చాడు.

Also Read:బాలింత ఉన్న గదిలోనే కరోనా రోగి: తల్లి,బిడ్డకు వైరస్

ఈ క్రమంలో ఆ వ్యక్తిలో కరోనా లక్షణాలు కనిపించడంతో గ్రామస్తులు పోలీసులు, వైద్య సిబ్బందికి సమాచారం అందించారు. అతనిని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ రావడంలో ఆలస్యం అవ్వడంతో స్థానికులే ప్రైవేట్ వాహనాన్ని ఏర్పాటు చేసి ఆసుపత్రికి తరలించారు.

వైద్యులు అతనిని పరీక్షించి రక్త నమూనాలను ల్యాబ్‌కు పంపి అవి వచ్చే వరకు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా ఇంటికి పంపించేశారు. అయితే అదే సమయంలో ఆ కూలీని ఆసుపత్రికి తరలిస్తున్న వీడియోలను స్థానికులు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో వైరల్ అయ్యాయి.

Also Read:దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేత: రాష్ట్రాల సీఎంలకు మోడీ జాగ్రత్తలు

తనకు కరోనా వచ్చిందంటూ గ్రామస్తులు ప్రచారం చేస్తుండటంతో ఆ వ్యక్తి తట్టుకోలేకపోయాడు. దీంతో అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ కూలీ మృతదేహాన్ని మధురై, తిరుమంగళం మధ్యలో ఉన్న కప్పలూరు వద్ద రైల్వే  ట్రాక్‌పై గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

అయితే ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న సమయంలో చుట్టుపక్కల వారు దూర్భాషలాడటంతో ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా తమిళనాడులో ఇప్పటి వరకు సుమారు 309 మందికి కరోనా పాజిటివ్ సోకింది. వీరిలో ఎక్కువమంది ఢిల్లీ నుంచి నిజాముద్దీన్‌లో జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొన్నవారే.