స్టాక్ మార్కెట్లకు ‘వ్యాక్సిన్ జోష్’ .. అవసరమైతే మరో ప్యాకేజీకి ఇచ్చేందుకు ఫెడ్ రెడీ

కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్ తయారీ యత్నాలు అమెరికా డ్రగ్ మేకర్ మొడెర్నా సత్ఫలితాలను ఇస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో జోష్ నెలకొంది.

stock market : coronavirus vaccine trial boosted sentiment in investors

న్యూయార్క్/ ముంబై: ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లకు మంగళవారం కలిసి వచ్చింది. అమెరికాలో డ్రగ్ తయారీ సంస్థ మోడెర్నా ‘కరోనా వైరస్’ వ్యాక్సిన్ ప్రయోగాలు సత్ఫలితాలనిస్తున్నాయని చెప్పడంతో ఇన్వెస్టర్లలో జోష్ కనిపిస్తోంది. దేశీయంగా భారతీ ఎయిర్‌టెల్, ఓఎన్జీసీ షేర్ల దన్నుతో ఇవాళ సెన్సెక్స్ మళ్లీ లాభాల బాట పట్టింది.  అటు అంతర్జాతీయ మార్కెట్లు సైతం పుంజుకున్నాయి. 

ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు మళ్లీ కొనుగోళ్లకు ఉత్సాహం చూపడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు 2 శాతానికి పైగా లాభాలను నమోదు చేస్తున్నాయి. ప్రస్తుతం బీఎస్‌ఈ సెన్సెక్స్ 626.81 పాయింట్లు (2.09 శాతం) ఎగబాకి 30655.79 వద్ద ట్రేడవుతోంది. 

మరోవైపు ఎన్ఎస్‌ఈ నిఫ్టీ 183.40 పాయింట్లు (2.08 శాతం) దూసుకెళ్లి 9006.65 వద్ద కొనసాగుతోంది. భారతీ ఎయిర్‌టెల్ షేర్ ఏకంగా 9 శాతం మేర లాభం నమోదు చేస్తుండగా.. ఓఎన్జీసీ 7.6 శాతం లాభంతో తర్వాతి స్థానంలో ఉంది. టాటాస్టీల్, కొటాక్ మహింద్రా బ్యాంక్, మారుతి సుజుకి, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ తదితర షేర్లు కూడా 3 శాతానికి పైగా లాభాలను నమోదు చేస్తున్నాయి. 

also read కరోనా ప్యాకేజీతో నో యూజ్.. జీడీపీ పతనం యధాతథం..

మరోవైపు సోమవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. దీనికితోడు ఆర్థిక వృద్ధికి అవసరమైతే మరో ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధమంటూ ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ వారాంతాన ప్రకటించడం కూడా సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. 

వెరసి డోజోన్స్‌ 912 పాయింట్లు(3.9 శాతం) జంప్‌చేసి 24,597 వద్ద ముగిసింది. ఈ బాటలో ఎస్‌అండ్‌పీ 90 పాయింట్లు(3.2 శాతం) ఎగసి 2954 వద్ద నిలవగా.. నాస్‌డాక్‌ సైతం 220 పాయింట్లు(2.5 శాతం) పురోగమించి 9235 వద్ద స్థిరపడింది. 

ఆర్థిక రికవరీపై ఆశలతో మార్చిలో నమోదైన కనిష్టాల నుంచి ఎస్‌అండ్‌పీ 32 శాతం ర్యాలీ చేసినా.. కరోనా వైరస్‌ మరోసారి విస్తరించవచ్చన్న ఆందోళనలతో ఈ నెలలో అటూఇటుగా కదులుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios