కరోనా కష్టాల నుంచి కొత్త అవకాశాలు.. ఇండియాకు వచ్చేందుకు వెయ్యి కంపెనీలు రెడీ

కరోనా వైరస్ వల్ల ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నా భవిష్యత్‌లో భారత్ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. చైనాలో ఉత్పాదక యూనిట్లు ఉన్న విదేశీ సంస్థలు భారతదేశంలోకి వాటిని మార్చేందుకు సిద్ధం కావడమే దీనికి నిదర్శనం. దాదాపు 1000 కంపెనీలు డ్రాగన్ నుంచి వచ్చేందుకు సిద్దమని సమాచారం.
 

Several firms ready to shift from China to India: says Gadkari

ముంబై: కరోనాతో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న ఇండియా ఈ ఆపత్కాలంలో కొత్త అవకాశాలను సృష్టించుకుంటోంది. ఈ వ్యాధికి పుట్టినిల్లుగా అనుమానిస్తున్న చైనా నుంచి బయటికి రావడానికి సిద్ధమైన విదేశీ కంపెనీలను ఆకర్షించ‌డంలో సక్సెస్‌ అవుతోంది. 

ఇదే అదనుగా మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా ఎదగడానికి భారత్ ప్రయత్నిస్తోంది. ఈ అంశాన్ని కేంద్ర సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ధ్రువీకరించారు. 

చైనాలో ఉత్పాదక యూనిట్లు కలిగి ఉన్న పలు బహుళ జాతి సంస్థలు (ఎంఎన్సీ) భారతదేశానికి తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ మరాఠీ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయా సంస్థలు మనదేశంలోకి సులభతరంగా ప్రవేశించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. దేశీయంగా ఆయా సంస్థలకు సరైన వసతులు కల్పించాల్సి ఉందన్నారు.

ఇప్పుడు దాదాపు వెయ్యి విదేశీ కంపెనీలు ఇండియా వైపు చూస్తున్నాయని అధికార వర్గాల సమాచారం. వీటిలో 300 కంపెనీలు మాన్యుఫ్యాక్చరింగ్‌‌ను చైనా నుంచి ఇండియాకు మార్చడానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాయి. 

ఇండియాలో మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు పెట్టేందుకు అనుమతుల కోసం ఇవి వివిధ స్థాయిల్లో దరఖాస్తులు కూడా పెట్టుకున్నాయి. వీటిలో మొబైల్స్‌‌, ఎలక్ట్రానిక్స్‌‌, ఔషధ పరికరాలు, టెక్స్‌‌టైల్‌ వంటి కంపెనీలు ఉన్నాయి. 

విదేశాల్లోని ఇండియా ఆఫీసులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిశ్రమలశాఖల వద్ద అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం వెయ్యి కంపెనీలు ప్రభుత్వంతో చర్చిస్తున్నాయని సంబంధిత ఆఫీసర్‌ ఒకరు చెప్పారు. 

‘కరోనా బెడద పూర్తిగా తొలగిపోతే చాలా కంపెనీలు ఏర్పాటు అవుతాయి. ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా ఎదుగుతుంది. జపాన్‌, అమెరికా, దక్షిణ కొరియా కంపెనీలు ఎక్కువగా చైనాపై ఆధారపడుతున్నాయి. వీటిలో చాలా వరకు ఇండియా బాట పట్టే అవకాశాలు ఉన్నాయి’’ అని ఆయన వివరించారు.

విదేశాల కంపెనీలను ఆకర్షించి, కార్పొరేట్లను ప్రోత్సహించడంతో దేశంలో మాన్యుఫ్యాక్చరింగ్‌‌ను పెంచడానికి మోదీ ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ నెలలో కార్పొరేట్‌ ట్యాక్స్‌‌ను పది శాతానికి తగ్గించడంతో ఇది 25.17 శాతానికి చేరింది. 

కొత్త కంపెనీలు అయితే కేవలం 17 శాతం ట్యాక్స్ కడితే సరిపోతుంది. ఆగ్నేయాసియా దేశాల్లో ఇంత తక్కువ పన్ను ఇండియాలో తప్ప ఎక్కడా లేదు. జీఎస్టీని కూడా తగ్గించడంతో మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించగలమని కేంద్ర ప్రభుత్వం నమ్మకంగా ఉంది. చైనా మాదిరే ఉత్పత్తి వ్యయాన్ని బాగా తగ్గించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. 

ఇదిలా ఉంటే కరోనా వ్యాప్తికి చైనాయే కారణమంటూ అమెరికా సహా పలు దేశాలు బహిరంగంగానే విమర్శలు చేశాయి. కొన్ని దేశాలైతే పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. మరోవైపు చైనా నుంచి తమ కంపెనీలను తరలించడానికి రెండు బిలియన్ డాలర్ల ప్యాకేజీ ఇస్తామని జపాన్ ప్రకటించింది. 

ఇప్పటికే ఫ్రాన్స్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్డ్ చైనా నుంచి వైదొలిగింది. మరిన్ని దేశాలు కూడా ఇదే బాట పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

‘అన్ని గుడ్లనూ ఒకే బుట్టలో పెట్టకూడదనే సూత్రాన్ని కంపెనీలు పాటిస్తున్నాయి. అందుకే ప్లాంట్లను ఇండియా వంటి దేశాలకు తరలించాలని కోరుకుంటున్నాయి. మనదేశానికి రావడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి’’ అని డిపార్ట్‌‌మెంట్‌ఫర్ ప్రమోషన్ ఆఫ్‌ ఇండస్ట్రీ ఇండ్ ఇంటర్నెల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ) సెక్రటరీ గురుప్రసాద్‌ మహాపాత్ర అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios