రెండు రోజుల నుంచి దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 24 గంటల్లో ఏకంగా 350 మందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కొంతమంది నిర్లక్ష్యం, అవగాహన లేమితో కోవిడ్ 19 కోరలు చాస్తోంది.

రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లో కరోనా కారణంగా చోటు చేసుకున్న తొలి మరణం కూడా బాధ్యతారాహిత్యం కారణంగానే చోటు చేసుకుందని తెలుస్తోంది. మృతుడికి అందించిన చికిత్సా విధానంతో పాటు అతడి ప్రయాణ వివరాలు గోప్యం ఉంచడం ఇప్పుడు సమాజాన్ని ప్రమాదంలోకి నెట్టింది.

Also Read:జీవితాంతం గుర్తుండాలని: పిల్ల పేరు కరోనా, పిల్లాడి పేరు లాక్‌డౌన్

ఐసోలేషన్ వార్డులో చికిత్స అందించాల్సిన అతనికి జనరల్ వార్డులో వైద్యం చేసినట్లుగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. బస్తీ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆదివారం శ్వాస సంబంధిత అనారోగ్యంతో గోరఖ్‌పూర్‌లోని బీఆర్‌డీ వైద్య కళాశాలకు వచ్చాడు.

అయితే అతని ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం సాయంత్రమే కన్నుమూశాడు. అయితే దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం నేపథ్యంలో వైద్యులు మృతుడి రక్త నమూనాలను పరీక్షించగా, అతనిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. అనంతరం పూర్తి ధ్రువీకరణ కోసం లక్నోలోని కింగ్ జార్జ్ వైద్య విశ్వవిద్యాలయానికి పంపగా బుధవారరం పాజిటివ్ అని తేలింది.

అయితే మరణించిన వ్యక్తి కొద్దిరోజుల క్రితం ముంబై, హైదరాబాద్‌లో ప్రయాణం చేసినట్లుగా తేలింది. అయితే ట్రావెల్ హిస్టరీని దాచి పెట్టి బస్తీలోని ఓ ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. ఈ సంగతి తెలియని వైద్యులు అతనికి జనరల్ వార్డులో చికిత్స అందించారు.

అనారోగ్యం నుంచి ఎంతకీ కోలుకోకపోవడంతో అతనిని బంధువులు బీఆర్‌డీకి తరలించారు. ఈ క్రమంలో గోరఖ్‌పూర్ ఆసుపత్రిలో మరణించిన అతను కరోనా పాజిటివ్ అని తేలడంతో బస్తీ ప్రభుత్వాసుపత్రి వైద్యులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు.

Also Read:నిన్న ఢిల్లీ అల్లర్లు, నేడు మర్కజ్: అన్ని సమస్యలకు ఒకటే సొల్యూషన్... అజిత్ దోవల్

గత నెలరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నానని అతను చెప్పడంతో పాటు ప్రయాణ వివరాలు గోప్యంగా ఉంచాడని, వాస్తవాలు వెల్లడించి వుంటే వెంటనే కరోనా ప్రత్యేక వార్డులో చికిత్స అందించేవాళ్లమని వైద్య సిబ్బంది తెలిపారు.

కాగా ఈ మరణంపై బస్తీ జిల్లా కలెక్టర్ స్పందించారు... మృతుడు మూడు నెలలుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాని చెప్పారు. బాధితుడికి కిరణా దుకాణం ఉండటంతో ఆ ప్రాంతంలోని వారిపై ఆరా తీస్తున్నామని, అలాగే అతనికి చికిత్స అందించిన వైద్యులను క్వారంటైన్‌కు తరలించామని కలెక్టర్ పేర్కొన్నారు. కాగా ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటి వరకు 100 మందికి పైగా కోవిడ్ 19 పాజిటివ్ వచ్చింది.