Asianet News TeluguAsianet News Telugu

కరోనా కాటు: ఐటీలో 40 లక్షల ఉద్యోగాలు గోవిందా..

కరోనా మహమ్మారి అన్ని రంగాల ఉసురు తీస్తోంది. 40 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని ‘క్రిసిల్’ అంచనా వేసింది. దశాబ్ధ క్రితం వరకు ఐటీ రంగ లాభాలు పడిపోతాయని తెలిపింది.

IT sector revenue growth may hit decadal low due to COVID-19: Crisil
Author
Hyderabad, First Published Apr 25, 2020, 2:14 PM IST

ముంబై : కరోనా మహమ్మారి ప్రభావంతో దేశీయ టెక్నాలజీ పరిశ్రమ కుదేలవుతోంది. వైరస్‌ ధాటికి ఆర్డర్లు, ప్రాజెక్టులు నిలిచిపోయే ప్రమాదం ఉండటంతో భారత ఐటీ రంగంలో రాబడి వృద్ధి పదేళ్ల కనిష్ట స్ధాయిలో రెండు శాతం వరకూ తగ్గిపోనున్నది.

ఐటీ కంపెనీల మార్జిన్లు పడిపోవడంతో లాభాలు తగ్గుముఖం పడతాయని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ అంచనా వేసింది. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి వివిధ దేశాలు విధించిన లాక్‌డౌన్‌ల నేపథ్యంలో కొత్త ఒప్పందాలు జరగక ప్రస్తుత ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం పడుతుందని క్రిసిల్ పేర్కొంది.

వివిధ దేశాల కంపెనీలకు ఐటీ సర్వీసులు అందిస్తున్న దేశీయ ఐటీ రంగం టర్నోవర్ 97 బిలియన్ల డాలర్లు ఉంటుంది. 

భారత ఆర్థిక వ్యవస్ధకు వెన్నుదన్నుగా నిలుస్తూ 40 లక్షల మందికి పైగా ఉద్యోగాలను సమకూరుస్తున్న దేశీయ ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమ మహమ్మారి ప్రభావానికి లోనైతే ఉపాధి రంగంపై అది పెను ప్రభావం చూపుతున్నది.

కరోనా వైరస్‌ ఎప్పుడు తగ్గుముఖం పడుతుందనే విషయంలో అనిశ్చితి కొనసాగుతున్న క్రమంలో దేశీయ ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్‌, విప్రో సహా పలు ఐటీ కంపెనీలు వార్షిక గైడెన్స్‌లు ఇచ్చే పద్ధతిని విరమించుకున్నాయి.  

మార్చి- మే మధ్య సహజంగా కొత్త ఒప్పందాలు జరుగుతుంటాయి. ఈసారి కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌లు అమలు అవుతున్న క్రమంలో ఈ ప్రక్రియ నిలిచిపోయిందని, మరోవైపు ప్రస్తుత కాంట్రాక్టుల కొనసాగింపుపైనా అనిశ్చితి నెలకొందని క్రిసిల్‌ సీనియర్‌ డైరెక్టర్‌ అనుజ్‌ సేథి పేర్కొన్నారు. 

ఆదాయాల్లో క్షీణత ఐటీ కంపెనీల లాభాలను ప్రభావితం చేస్తుందని క్రిసిల్ తెలిపింది. మరోవైపు ఆయా కంపెనీలు డిజిటల్‌ ప్రాజెక్టులపై వెచ్చిస్తున్న క్రమంలో ఈ ప్రభావం మరింత అధికంగా ఉంటుందని క్రిసిల్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ రాజేశ్వరి కార్తిగేయన్‌ వెల్లడించారు.

 టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో కష్టాలు తప్పవని సంకేతాలిచ్చింది. ఐటీ రంగం సేవలందిస్తున్న క్లయింట్లలో బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్, బీమా రంగాలన్నీ కలిపి 28 శాతం ఉంటాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్లు, లాంగ్ టర్మ్ కాంట్రాక్టులపై 8 శాతం రెవెన్యూ ఉంటుంది. 

ఇక హెల్త్ కేర్ రంగం నుంచి ఐటీ సెక్టార్ కు ఎనిమిది శాతం రెవెన్యూ లభిస్తుంది. రిటైల్ రంగంలో 32 శాతం, కమ్యూనికేషన్స్, ఎరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో 22శాతం, ఉత్పాదకత, రవాణా, పర్యాటక రంగం, ఆయిల్ అండ్ ఎనర్జీ విభాగాల నుంచి గణనీయ స్థాయిలో రెవెన్యూ వస్తోంది. కానీ కరోనా లాక్ డౌన్‌తో ఈ రంగాల్లో ఆదాయం భారీగా పతనమైందని క్రిసిల్ తెలిపింది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2-2.50 శాతం పాయింట్ల నుంచి 20 శాతం వరకు ఐటీ దిగ్గజ సంస్థల లాభాలు తగ్గుముఖం పడతాయని, ఇవి దశాబ్ది క్రితం స్థాయికి చేరతాయని క్రిసిల్ అంచనా వేసింది. అమెరికా డాలర్‌పై రూపాయి విలువ పతనమైనా పరిస్థితిలో తేడా ఉండదని తెలిపింది. 

గత నాలుగేళ్లుగా డిజిటల్ రెవెన్యూ పెరుగుతున్నది. మొత్తం ఐటీ రంగం రెవెన్యూలో 40 శాతం ఉంటుందని క్రిసిల్ గుర్తు చేసింది. దీనివల్ల లాభాలు 1.50 శాతం చేరతాయన్నది. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలు తమ ఖర్చులు, లావాదేవీలను క్రమబద్ధీకరిస్తూ చర్యలు చేపట్టాయని క్రిసిల్ తెలిపింది. మొత్తం 15 కంపెనీల రెవెన్యూ మొత్తం రెవెన్యూలో 70 శాతం ఉంటుందని క్రిసిల్ అంచనా వేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios