బ్యాంకు కస్టమర్లకు షాక్ : క్రెడిట్, పర్సనల్ లోన్స్ కష్టమే...
కరోనా కష్టాలు అన్నీఇన్నీ కావు.. ఇప్పటికే బయటకు వెళ్లలేక కొందరు.. ఉద్యోగాలు కోల్పోయి మరి కొందరు ఇబ్బందుల్లో పడ్డారు. మూలిగే నక్కపై తాటి పండు పడినట్లు క్రెడిట్ కార్డుల రుణ పరిమితి తగ్గించడంతోపాటు రిటైల్ రుణాల జారీపై బ్యాంకర్లు ఆంక్షలు విధిస్తున్నారు.
న్యూఢిల్లీ: అసలే ప్రజలు కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్ కారణంగా వేతనాల కోత, ఉద్యోగాలు కోల్పోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో ‘మూలుగుతున్న నక్కపై తాటికాయ పడ్డట్టు’ బ్యాంకులు మరో షాక్ ఇస్తున్నాయి.
ఇప్పటివరకూ వినియోగదారులకు ఇచ్చిన క్రెడిట్ కార్డు, వ్యక్తిగత రుణాల పరిమితుల్లో కోతను విధిస్తున్నాయి. కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్‌తో ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులెదుర్కొంటున్నది. ఈ ప్రభావం తమపై పడుతుందని భావించిన పలు బ్యాంకులు ఈ చర్యలకు పూనుకున్నాయి.
ఈ పరిణామాలు ఖాతాదారులు, వ్యాపారులకు శరాఘాతంగా పరిణమిస్తున్నాయి. తమ బ్యాంకు శాఖల్లోని దాదాపు రెండు లక్షల కస్టమర్ల క్రెడిట్ కార్డు పరిమితిని 30 శాతం నుంచి 90 శాతం వరకు తగ్గిస్తున్నట్టు యాక్సిస్ బ్యాంక్ తన అంతర్గత ఉత్తర్వుల్లో పేర్కొంది.
దేశంలోని క్రెడిట్ కార్డుల్లో 12.6 శాతం ఈ బ్యాంకువే కావడం గమనార్హం. గతంలో తన క్రెడిట్ పరిమితి రూ.5 లక్షలుగా ఉండేదని, ఇప్పుడు దాన్ని రూ.50వేలకే పరిమితం చేశారని ముంబైకి చెందిన ఓవినియోగదారుడు వాపోయారు.
కొటక్ మహీంద్రా బ్యాంకులో కూడా క్రెడిట్ కార్డు పరిమితులకు కోత్త విధిస్తున్నారు. గతంలో తన క్రెడిట్ పరిమితి రూ. 75 వేలు ఉండగా.. ప్రస్తుతం దాన్ని రూ 44 వేలకు తగ్గించారని ఆ బ్యాంకు కస్టమర్ ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.
‘క్రెడిట్ కార్డును వినియోగిస్తున్న తీరును బేరీజు వేస్తూ మార్పులు చేయడం మామూలే. దీన్ని ప్రత్యేకంగా చూడొద్దు’ అని ఆ బ్యాంకు, కన్సూమర్ అస్సెట్స్ ప్రెసిడెంట్ అంబుజ్ చంద్ర పేర్కొన్నారు. ఓవర్‌డ్రాఫ్ట్ ప్రాతిపదికన పలు బ్యాంకులు చిన్న వర్తకులు, రిటైలర్లకు ఇచ్చే రుణాల పరిమితులను కూడా తగ్గిస్తున్నాయి.
తదుపరి నోటీసులు వచ్చే వరకు ఈ తరహా రుణాల్ని కిరాణా, మెడికల్, డెయిరీలకే పరిమితం చేయాలని హెడీఎఫ్‌సీ బ్యాంకు తన శాఖల మేనేజర్లను ఆదేశించింది. క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాల పరిమితిని కూడా తగ్గించింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరి నాటికి దేశంలోని క్రెడిట్ కార్డుల మొత్తం విలువ రూ. 1.1 లక్షల కోట్లకు చేరుకున్నది. ఇది చారిత్రాత్మక గరిష్ఠ స్థాయి. గతేడాదితో పోలిస్తే ఇది 26 శాతం ఎక్కువ. ఈ ఏడాది జనవరినాటికి దేశంలో 5.6 కోట్ల యాక్టివ్ క్రెడిట్ కార్డులున్నాయి.
ఈ సందర్భంగా క్రిసిల్ రీసెర్చ్ డైరెక్టర్ అజయ్ శ్రీనివాసన్ స్పందిస్తూ ‘క్రెడిట్ కార్డు పరిమితిని సవరించడం బ్యాంకులు అవలంభించే స్వీయ సవరణ ప్రక్రియ. క్రెడిట్ కార్డు పరిమితి బ్యాంకు విచక్షణకు లోబడి ఉంటుంది. తక్కువ ముప్పును ఎదుర్కొనేందుకు ఈ చర్యలు తీసుకుంటారు’ అని తెలిపారు.