దేశంపై కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్నవేళ వేరే దారి లేక దేశమంతా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే! ఈ లాక్ డౌన్ వల్ల పూర్తిగా ఉత్పత్తి ఆగిపోయి దేశానికి కానీ, రాష్ట్రాలకి కానీ పూర్తిగా ఆర్ధిక రాబడి నిలిచిపోయింది. 

ఈ నేపథ్యంలో ఈ కరోనా కష్టకాలంలో భారత ప్రజలెవ్వరూ కష్టపడకుండా ఉండేందుకు ప్రధాని పీఎం కేర్స్ ఫండ్ ని ఏర్పాటు చేసి విరాళాలను ఆహ్వానించినా విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ నిధికి అంబానీ నుండి టాటాల వరకు అనేక మంది విరాళాలను ప్రకటించారు. 

తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ గారు కూడా ప్రధాని ఏర్పాటు చేసిన నిధికి విరాళాన్ని అందించారు. ఇందుకు సంబంధించి రాష్ట్రపతికి లేఖ రాసారు. 

దేశంలో ఈ కరోనా వైరస్ పీడా పూర్తిగా తొలిగి పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే అంతవరకు తన నెల జీతంలో ప్రతి నెల 30 శాతం జీతాన్ని ప్రధాని ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్ కి ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు. బాధ్యతగల దేశ వాసిగా తాను తన కర్తవ్యంగా ఈ విరాళాన్ని ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు. 

తమిళిసై సౌందర రాజన్ గారి జీతం నెలకు దాదాపుగా 3,50,000 రూపాయలు. అందులో 30% అంటే ఆమె నెలకు సుమారు లక్ష రూపాయలను పరిస్థితి పూర్తిగా నార్మల్ అయ్యేంతవరకు ఇవ్వనున్నారన్నమాట. 

ఇకపోతే దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కేసుల సంఖ్య సోమవారం నాటికి 4,067కి చేరుకొంది. గత 24 గంటల్లో కొత్తగా 693 కేసులు నమోదైనట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

సోమవారం నాడు సాయంత్రం కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు 109 మంది మృతి చెందారు. దేశంలో నమోదైన 4067 కరోనా కేసుల్లో 1445 కేసులు ఢిల్లీ మర్కజ్ ప్రార్ధనల్లో పాల్గొని వచ్చినవారేనని కేంద్రం ప్రకటించింది.

Also read:కరోనా అంటిస్తావా అంటూ లేడీ డాక్టర్‌పై వ్యక్తి దాడికి యత్నం

కరోనా వైరస్ సోకినవారిలో 76 శాతం మంది పురుషులే ఉన్నారని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ చెప్పారు.47 శాతం కరోనా కేసులు 40 ఏళ్లలోపు వయస్సు వాళ్లకు సోకిందని కేంద్రం తేల్చింది. 34 శాతం కేసులు 40 నుండి 60 ఏళ్ల వయస్సు మధ్య వారికి సోకిందని లవ్ అగర్వాల్ చెప్పారు.

మృతి చెందిన వారిలో 30 మంది 60 ఏళ్లకు పైబడినవారే ఉన్నారు.63 శాతం మంది 60 ఏళ్లకు పైబడిన వారే మృత్యువాతపడ్డారని గణాంకాలు చెబుతున్నాయి. దేశ వ్యాప్తంగా మర్కజ్ ప్రార్ధనల్లో పాల్గొని వచ్చిన వారితో పాటు వారితో సన్నిహిత సంబంధాలు కలిగిన సుమారు 25 వేల మందిని క్వారంటైన్ చేసినట్టుగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది.దేశ వ్యాప్తంగా 291 మంది ఈ వ్యాధి నుండి కోలుకొన్నారని కేంద్రం తెలిపింది.