Asianet News TeluguAsianet News Telugu

ఉద్యోగులుకు కార్పొరేట్ల భరోసా...అండగా నిలుస్తామని సంస్థల హామీ

డీఎల్ఎఫ్ మొదలు అగ్రశ్రేణి కార్పొరేట్ సంస్థల నుంచి చిన్న, మధ్య తరహా సంస్థల యాజమాన్యాలు ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తమ సిబ్బందికి బాసటగా నిలుస్తామని హామీనిస్తున్నాయి. మార్చి నెల వేతనం ఇప్పటికే చెల్లించాయి. కొన్ని సంస్థలు అదనంగా ఇంక్రిమెంట్లు కూడా ఇస్తామని.. అయితే, ఉద్యోగులు లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా ఇంటిపట్టునే ఉండాలని కోరాయి. 
 

DLF not to sack any employee, to give hike to select staff
Author
Hyderabad, First Published Apr 8, 2020, 10:43 AM IST

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ దెబ్బకు దేశమంతా లాక్‌డౌన్‌ అయ్యింది. అత్యవసర సేవలు మినహా మిగతావన్నీ మూతబడ్డాయి. వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఎక్కడికక్కడ ఉత్పత్తి నిలిచిపోయింది. 

ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేని దుస్థితి నెలకొనడంతో కొనుగోళ్లు పూర్తిగా మందగించాయి. అయినా పలు కంపెనీలు నిరుత్సాహ పడట్లేదు. తమపై ఆధారపడ్డ ఉద్యోగుల జీతాల్ని చెల్లిస్తున్నాయి. కొన్ని సంస్థలైతే సిబ్బంది బ్యాంకు ఖాతాలో ముందే వేతనాల్ని జమ చేయటం గమనార్హం. 

ఈ పెను ఉత్పాతం నుంచి బయటపడితే చాలని, ఆ తర్వాత ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకోవచ్చని సంస్థలన్నీ హామీనిస్తున్నాయి. ఆయా సంస్థలు హౌస్‌ కీపింగ్‌, మెయింటేనెన్స్‌, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలకు కోత విధించట్లేదని అంటున్నాయి. ఈ క్రమంలోనే రెగ్యులర్‌ సిబ్బంది తోపాటు కాంట్రాక్టు ఉద్యోగులకు అడ్వాన్స్ జీతాలు చెల్లిస్తుండటం విశేషం. 

గతంతో పోల్చితే ఈసారి వారం ముందే ఉద్యోగుల వేతనాన్ని బ్యాంకుల్లో జమ చేస్తున్నాయి. చాలా ప్రైవేట్‌ కంపెనీలు 7-10 తేదీల్లో ఉద్యోగులకు జీతాలిస్తాయన్న విషయం తెలిసిందే. పైగా ఉద్యోగానికి రాకున్నా పర్వాలేదని, ఇంట్లోనే ఉండి లాక్‌డౌన్‌కు సహకరించాలని కోరుతున్నాయి. 

ఉద్యోగుల్ని తొలగించబోమని డీఎల్ఎఫ్ హామీ
కరోనాను కట్టడి చేయడానికి దేశవ్యాప్తంగా కేంద్రం విధించిన లాక్ డౌన్ వల్ల స్థిరాస్థి రంగం (రియాల్టీ) దెబ్బ తిన్నా తాము ఉద్యోగులను తొలగించబోమని ప్రముఖ రియాల్టీ సంస్థ డీఎల్ఎఫ్ తెలిపింది. కొన్ని స్థాయిల్లో ఉద్యోగుల వార్షిక వేతనాలను పెంచుతామని వెల్లడించింది. 

వార్షిక వేతనాలతోపాటు ఇంక్రిమెంట్లు ఇస్తామన్న డీఎల్ఎఫ్
‘ఎవరినీ తొలగించబోం. లెవెల్ త్రీ స్థాయి వరకు డీఎల్ఎఫ్  ఉద్యోగులకు వార్షిక వేతనాలు పెంచుతాం’ అని ప్రకటించింది. ఉద్యోగులందరికీ, డీఎల్ఎఫ్ సంస్థలో ప్రత్యక్షంగా పని చేస్తున్న రోజువారీ కూలీలు, కాంట్రాక్టర్లకు మార్చి నెల వేతనాలను చెల్లించామని డీఎల్ఎఫ్ పేర్కొంది. 

డీఎల్ఎఫ్ ‘కరోనా’ సాయం ఇలా
ఏప్రిల్ నెలకూ వేతనాలు చెల్లిస్తామని డీఎల్ఎఫ్ హామీ ఇచ్చింది. డీఎల్ఎఫ్ ఫౌండేషన్ తరఫున కొవిడ్ నియంత్రణ కోసం హర్యానా ప్రభుత్వానికి రూ.5 కోట్ల విరాళం ప్రకటించింది. మరో రూ.50 లక్షలు తమిళనాడుకు, రూ.10 లక్షలు చెన్నై-కాంచీపురం జిల్లా సహాయ కేంద్రానికి, హైదరాబాద్ లోని సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు రూ.5 లక్షల సాయం అందజేస్తామని వెల్లడించింది. 

25 శాతం అధిక జీతం చెల్లిస్తున్న కాగ్నిజెంట్‌
అంతర్జాతీయ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌.. భారతీయ ఉద్యోగులకు 25 శాతం అధికంగా వేతనాలను చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంస్థలో మొత్తం 2.03 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తుండగా.. తాజా నిర్ణయంతో దేశంలోని దాదాపు 1.30 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది. ఈ నెల నుంచే దీన్ని అమలు చేస్తున్నట్లు కాగ్నిజెంట్‌ సీఈవో బ్రయాన్‌ హంప్రీస్‌ తెలిపారు. 

ఉద్యోగుల తొలగింపుల్లేవన్న పీడబ్ల్యూసీ
దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్నా తాము మాత్రం ఉద్యోగుల్ని తొలగించడం లేదని ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్‌ (పీడబ్ల్యూసీ) సంస్థ ప్రకటించింది. కాకపోతే క్రమం తప్పక అందించే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, బోనస్‌లు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో సకాలంలోనే మార్చి నెల జీతాల్ని అందజేస్తామని సమాచారాన్ని ఇచ్చింది. 

ముందస్తు వేతనాల చెల్లింపునకు సంస్థలు రెడీ
ఇక భారతీ ఎయిర్‌టెల్‌ సంస్థ ఇప్పటికే ఉద్యోగులకు మార్చి నెల జీతాన్ని చెల్లించింది. దాల్మియా భారత్‌ గ్రూప్‌ మార్చి 26-27 తేదీ మధ్యలోనే ఉద్యోగుల ఖాతాల్లోకి ముందస్తుగా జీతాల్ని జమ చేసింది. 
ప్రైవేటు ఉద్యోగుల జీతాల్ని చెల్లించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి నేపథ్యంలో శ్రీనివాసా ఫామ్స్‌, అబీబస్‌, రాంకీ ఎస్టేట్స్‌ వంటి సంస్థలు సానుకూలంగా స్పందించాయి. 

సకాలంలో వేతనాల చెల్లింపునకు శ్రీనివాసా ఫామ్స్, అలీబస్ ఓకే
తమ వద్ద పనిచేసే 4000 మంది ఉద్యోగుల జీతాల చెల్లింపుల్లో ఎలాంటి కోతల్ని విధించడం లేదని శ్రీనివాసా ఫామ్స్‌ ఎండీ సురేష్‌ చిట్టూరి తెలిపారు. ఇదే పంథాను అబీబస్‌ సైతం అనుసరించింది. తమ 200 మంది ఉద్యోగులకు సకాలంలో జీతాలను చెల్లిస్తున్నామని, కొందరు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నారని సంస్థ సీవోవో రోహిత్‌ శర్మ తెలిపారు. 

భవన నిర్మాణ కార్మికులకు రాంకీ తోడ్పాటు 
రాంకీ ఎస్టేట్స్‌ ఉద్యోగుల జీతాలను సకాలంలో చెల్లించడంతోపాటు భవన నిర్మాణ కార్మికులకు అన్నిరకాల తోడ్పాటును అందిస్తున్నది. అలాగే చైనాకు చెందిన వీవో, ఒప్పో మొబైల్‌లతోపాటు ఎన్‌టీటీ నెట్‌మ్యాజిక్‌, సెరా శానిటరీ వేర్‌లూ ఉద్యోగులకు భరోసా ఇచ్చాయి.

also read బ్యాంకులకు తడిసిమోపెడు కానున్న మొండి బాకీలు...

తొలగింపులూ వేతనాల్లో కోతలు వద్దన్న ఈపీఎఫ్‌వో
వ్యాపారం లేక ఆదాయం దూరమవడంతో ఉద్యోగుల్ని తొలగించడం, జీతాలను తగ్గించడంపై దృష్టి పెడుతుండటంపై ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్‌వో) స్పందించింది. ఉద్యోగాల నుంచి ఎవరినీ తీసేయవద్దని, జీతాలకూ కోత పెట్టవద్దని ఆయా కంపెనీల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేసింది. ఈ కష్టకాలంలో లాభనష్టాలను మరిచి ఉద్యోగులకు అండగా ఉండాలని సూచించింది.

సాయం చేయాలని ఆనంద్ మహీంద్రా పిలుపు
‘మనతోపాటు మన చుట్టూ ఉన్నవారి గురించి కూడా ఆలోచించాలి. కూడు, గూడులేని ఎంతోమంది అభాగ్యులు ఈ దేశంలో నివసిస్తున్నారు. ప్రస్తుత గడ్డు పరిస్థితులు వారి జీవనాన్ని మరింత దయనీయంగా మార్చేశాయి. ఈ సంక్షోభం సమయాన వారందరికీ మనం అండగా ఉండాలి. లాక్‌డౌన్‌తో ఎందరో రోజుకూలీలు పూట గడువని దుస్థితిని ఎదుర్కొంటున్నారు’ అని మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన ఉద్యోగులకు లేఖ రాశారు.

మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ఈ సందర్భంగా స్పందిస్తూ.. ‘ఇది నిజంగా గుండెలు పగిలే వ్యథే. ఇలాంటి నిరుపేదల కోసం మన గ్రూప్‌ చేతనైన సాయం చేస్తున్నది. వారికోసం స్వచ్ఛంద విరాళాలతో ఓ నిధిని ఏర్పాటు చేశాం. ఎన్ని చేసినా కష్టాల్లో ఉన్న తోటివారిని ఆదుకోవడం మన వ్యక్తిగత బాధ్యత. మీకు మేం ఉన్నాం.. వారికి తోడుగా మీరుండండి’ అని ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. 

మేమున్నామని టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ పిలుపు
‘ఒకరికొకరు అండగా ఉండాల్సిన సమయమిది. కరోనా వైరస్‌ రోజురోజుకూ విజృంభిస్తున్నది. లాక్‌డౌన్‌కు సహకరించండి. నిర్లక్ష్యానికి భారీ మూల్యం తప్పదు. మీ ప్రస్తుత పరిస్థితిని మేము అర్థం చేసుకోగలం. మీకు, మీ కుటుంబ సభ్యులకు తోడుగా ఉంటాం’ తన గ్రూపు ఉద్యోగులకు టాటా సన్స్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌ లేఖ రాశారు. 

భయం వద్దన్న ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓ
‘ఉద్యోగాల గురించి దిగులు అక్కర్లేదు. జీతాల కోతలూ ఉండబోవు. సిబ్బంది, వ్యాపార భాగస్వాములు సహా అందరికీ ఉద్యోగ, ఉపాధి భద్రత ఉంటుంది. ప్రస్తుతం ఇస్తున్న వేతనాలను తగ్గించం. ఉద్యోగ ఆఫర్లనూ వెనక్కి తీసుకోం. ఈ విపత్కర సమయంలో అండగా ఉంటాం’ అని  ఫ్లిప్ కార్ట్ గ్రూప్ సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి వెల్లడించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios