Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచ దేశాలన్నింటి దృష్టి భారత్​పైనే... మన దేశానికి ఏమైన నష్టమా..?

కరోనా వైరస్ నియంత్రణకు మలేరియా కోసం వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్​ డ్రగ్ సత్ఫలితాలనిస్తున్నదని నివేదికలు రావడంతో దానికి మంచి గిరాకీ పెరిగింది. అగ్ర రాజ్యంతోపాటు ప్రపంచ దేశాలన్నింటి దృష్టి క్లోరోక్విన్ ఎక్కువగా ఉత్పత్తి చేసే భారత్​పై పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో క్లరోక్విన్ ఎగుమతితో మన దేశానికి ఏమైన నష్టమా? అంటే ఉత్పత్తి చేయగల సామర్థ్యం దేశీయ ఫార్మా కంపెనీలకు ఉన్నా.. ముడి సరుకుల కొరత ఏర్పడితే ఇబ్బందికరంగా మారుతుందన్న అభిప్రాయం ఉంది. 
 

Demand surge for game changer covid-19 drug hydroxy chloroquine despite lack of clinical avidence
Author
Hyderabad, First Published Apr 8, 2020, 11:48 AM IST

న్యూఢిల్లీ: హైడ్రాక్సీ క్లోరోక్వీన్.. ఇది యాంటీ వైరల్ డ్రగ్.. సరిగ్గా 40 ఏళ్ల క్రితం భారతదేశంలో మలేరియా నివారణకు వినియోగించారు. తాజాగా ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నియంత్రణకు అదే పెద్ద అసెట్‌గా మారింది.

ఆ డ్రగ్ వాడిన వారిలో సత్ఫలితాలు రావడంతో అగ్ర రాజ్యం అమెరికా,  బ్రెజిల్‌ తదితర దేశాల నుంచి విన్నపాలు వస్తున్నందున, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని మన ప్రభుత్వం భావిస్తోంది. కానీ దేశీయ అవసరాల మాటేమిటి? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

దేశీయంగా ఇబ్బంది లేదని, ప్రపంచ వ్యాప్తంగా ఈ మందు అత్యధికంగా తయారు చేయగల సామర్థ్యం మనకు ఉన్నదని ఔషధ రంగ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. 70 శాతం ప్రపంచ అవసరాలను మనం తీర్చగలమని పేర్కొంటున్నారు. 

కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) వచ్చిన వారికి హైడ్రాక్సి క్లోరోక్విన్‌ ఔషధాన్ని ఇస్తే కోలుకుంటున్నట్లు తెలిసి ప్రపంచ వ్యాప్తంగా ఈ ఔషధానికి గిరాకీ ఏర్పడింది. ఈ మందు తయారీ మనదేశంలోనే అధికం. అందుకే ఇప్పుడు అన్ని దేశాలు మనవైపు చూసే పరిస్థితి ఏర్పడింది. 

దేశీయ కంపెనీలైన ఇప్కా లేబొరేటరీస్‌, జైడస్‌ క్యాడిల్లా, సిప్లా, వాల్లేస్‌ ఫార్మాస్యూటికల్స్‌, సన్‌ ఫార్మా... తదితర కంపెనీలు హెచ్‌సీక్యూ ఔషధాన్ని పెద్దఎత్తున తయారు చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. మరిన్ని మధ్యస్థాయి ఫార్మా కంపెనీలకూ దీన్ని తయారు చేసే పరిజ్ఞానం, వసతులు ఉన్నాయి.

మనదేశంలోని ఫార్మా కంపెనీలు ప్రతి నెలా 20 కోట్ల హైడ్రాక్సి క్లోరోక్విన్‌ ట్యాబ్లెట్లను (200 ఎంజీ డోస్) తయారు చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. అవసరమైతే ఇంకా అధికంగా కూడా ఉత్పత్తి చేయొచ్చు. ఈ ఔషధాన్ని మలేరియా వ్యాధిని అదుపు చేయటానికే కాక, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌తో పాటు మరికొన్ని జబ్బుల చికిత్సలో వినియోగిస్తున్నారు.

ఈ మందు తయారీని అభివృద్ధి చెందిన దేశాల్లోని ఫార్మా కంపెనీలు ఎన్నో ఏళ్ల క్రితమే నిలిపివేశాయి. ఆ దేశాలు మలేరియా వ్యాధి నుంచి పూర్తిగా విముక్తం కావడం వల్ల, వినియోగం నామమాత్రంగా ఉండడమే దీనికి కారణం. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని కొన్ని అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాల్లోనే మలేరియా ప్రబలుతోంది. ఆయా దేశాలు అధికంగా మనదేశం నుంచే ఈ ఔషధాన్ని కొనుగోలు చేస్తున్నాయి. 
జనరిక్‌ ఔషధాల తయారీ పరిశ్రమ ఇక్కడ బాగా విస్తరించడం వల్ల దేశీయ అవసరాలతో పాటు ఇతర దేశాలకూ ఎగుమతి చేయగల సామర్థ్యం ఏర్పడటం భారతదేశానికి కలిసి వస్తోంది. ఇప్పటికే ఇప్కా, జైడస్‌ క్యాడిల్లా, సిప్లా తదితర కంపెనీలకు అమెరికా నుంచి ఆర్డర్లు లభించాయి. కేంద్ర ప్రభుత్వం కూడా 10 కోట్ల ట్యాబ్లెట్ల సరఫరాకు ఆర్డర్లు ఇచ్చింది.

ఈ ఔషధం తయారు చేయడానికి అవసరమైన ముడిపదార్థాలను భారతీయ ఫార్మా కంపెనీలు చైనా నుంచి అధికంగా దిగుమతి చేసుకుంటున్నాయి. ప్రస్తుతం చైనా నుంచి ముడిపదార్థాలు సరఫరా అయ్యే పరిస్థితి లేదు. చేతిలో ఉన్న నిల్వలే ఆధారం.

ఇప్పటికే కరోనా వైరస్‌ భయంతో ఎంతో మంది 10-15 ట్యాబ్లెట్ల హెచ్‌సీక్యూ స్ట్రిప్‌లను కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటున్నారు. దవాఖానల్లో కరోనా వైరస్‌ వ్యాధిగ్రస్తులకు పరీక్షలు, చికిత్స చేసే వైద్య సిబ్బంది ముందు జాగ్రత్తగా ఈ ఔషధాన్ని తీసుకుంటున్నారు.

అందువల్ల మున్ముందు దేశీయ అవసరాలు మరీ పెరిగితే డ్రగ్ కొరత ఎదురయ్యే ప్రమాదం ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకొని బల్క్‌ డ్రగ్స్‌, ఏపీఐ తయారీ విభాగంలోని కొన్ని దేశీయ కంపెనీలు హెచ్‌సీక్యూ ఔషధ ముడిపదార్థాలను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. జైడస్‌, ఇప్కా, మంగళం డ్రగ్స్‌ వంటి కంపెనీలు ముడిపదార్థాలు తయారు చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios