దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే దేశంలో 700లకు పైగా కేసులు నమోదవ్వగా.. తాజాగా మరో కుటుంబానికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. మొత్తం కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఉండగా.. అందరికీ వైరస్ పాజిటివ్ వచ్చింది. బాధితుల్లో 9 నెలల చిన్నారి కూడా ఉండటం గమనార్హం. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... పశ్చిమ బెంగాల్ లోని ఓ కుటుంబానికి కరోనా సోకినట్లు అధికారులు నిర్థారించారు.బాధితులు మొత్తం ఐదుగురు కాగా.. వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు  చిన్నారులు ఉన్నారు. ఇద్దరు మహిళల వయసు 27, వ్యక్తి వయసు 45 కాగా.. బాధితుల్లో 6ఏళ్ల చిన్నారి, 9నెలల చిన్నారి కూడా ఉన్నారు.

Also Read వైరస్ ని వ్యాపించండంటూ పోస్ట్.. ఇన్ఫోసిస్ ఉద్యోగి అరెస్ట్...

బాధితుల్లోని ఓ మహిళ ఇటీవల యూకే నుంచి వచ్చిన ఓ వ్యక్తితో చనువుగా ఉంది. అతనికి కరోనా పాజిటివ్ రాగా... అతని నుంచి సదరు మహిళకు.. ఆమె నుంచి మొత్తం కుటుంబానికి పాకినట్లు గుర్తించారు.

" యూకే నుంచి వచ్చిన వ్యక్తి అక్కడ చదువుకుంటున్నాడు. కాగా.. ఇటీవల విదేశాల నుంచి వచ్చాడు. అతనిని పాజిటివ్ గా గుర్తించిన అధికారులు ఢిల్లీలో క్వారంటైన్ చేశారు. కాని అతను దిగ్బంధం ప్రోటోకాల్‌ను ఉల్లంఘించి, అక్కడ ఒక కుటుంబ కార్యక్రమంలో పాల్గొనడానికి టెహట్టాకు వచ్చాడు. అక్కడ అతనికి సదరు మహిళ పరిచయం కాగా.. వైరస్ ఇలా వ్యాపించింది.’’ అని అధికారులు తెలిపారు. 

ముందుగా కరోనా లక్షణాలు సదరు మహిళలో కనిపించగా.. ఆమె ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అనుమానంతో కుటుంబసభ్యులకు కూడా పరీక్షలు చేయగా.. వారికి కూడా కరోనా సోకినట్లు గుర్తించారు. అందరినీ ఐసోలేషన్ చేసినట్లు అధికారులు తెలిపారు. వారి ఇరుగుపొరుగు వారికి కూడా పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు.