అహ్మదాబాద్:కరోనా వైరస్ కారణంగా గుజరాత్ రాష్ట్రంలో ఆదివారం నాడు మరో వ్యక్తి మృతి చెందాడు. 45 ఏళ్ల వ్యక్తి ఈ వైరస్ కారణంగా మృతి చెందినట్టుగా అధికారులు ప్రకటించారు. ఈ మరణంతో గుజరాత్ రాష్ట్రంలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరుకొంది.

అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ వ్యక్తి ఆదివారం నాడు మరణించాడు. అతను డయాబెటిక్ రోగిగా వైద్యులు ప్రకటించారు. డయాబెటిస్ ఉన్న వ్యక్తికి కరోనా వైరస్ సోకడంతో మరణించినట్టుగా వైద్యులు స్పష్టం చేశారు.

దేశ వ్యాప్తంగా ఆదివారం నాటికి కరోనాతో 25 మంది మృతి చెందినట్టుగా అధికారులు తేల్చి చెప్పారు.శనివారంనాడే అహ్మదాబాద్ సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఆసుపత్రిలో 46 ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్ కారణంగా మృతి చెందినట్టుగా ప్రకటించారు.

గుజరాత్ రాష్ట్రంలో ఇప్పటికే 53 మందికి కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా వైద్య,ఆరోగ్య శాఖాధికారులు ప్రకటించారు. అయితే వీరిలో ఐదుగురు మృతి చెందారు.అహ్మదాబాద్ లో ముగ్గురు,భావ్ నగర్ , సూరత్ లలో ఒక్కొక్కరి చొప్పున మృత్యువాత పడ్డారని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయంతి రవి ప్రకటించారు.

శనివారం నాడు ఒక్కరోజే కొత్తగా ఆరుగురికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. వీరంతా గాంధీనగర్, మేషానా, అహ్మదాబాద్ ప్రాంతాలకు చెందినవారుగా ఆమె తెలిపారు.

also read:కరోనా ఎఫెక్ట్: జమ్మూ కాశ్మీర్‌లో రెండో మరణం

రాష్ట్రంలో 4,46,60,856 జనాభా ఉంది. పదివేల మంది హెల్త్ వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించారు. 60,708 మంది రాష్ట్రం నుండి ఇతర ప్రాంతాల్లో పర్యటించి  వచ్చినట్టుగా గుర్తించారు. 

50,169 మంది రాష్ట్రంలోనే పలు ప్రాంతాల్లో పర్యటించారు. 10,539 మంది విదేశాల్లో పర్యటించి వచ్చినట్టుగా గుర్తించారు. వీరి ట్రావెల్ హిస్టరీ ఆధారంగా అధికారులు వారికి చికిత్స నిర్వహిస్తున్నారు.