న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన మర్కజ్ కు హాజరైనవారు ప్రయాణించిన రైళ్లను, ఆ రైళ్లలో ప్రయాణించినవారిని గుర్తించే పనిలో రైల్వే అధికారులు పడ్డారు. తబ్లిఘి జమాత్ కు హాజరైనవారికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలుతుండడంతో వారు రైళ్లపై, వాటిలో ప్రయాణించినవారిపై దృష్టి పెట్టారు. 

ఆ రైళ్లు మార్చి 13, 19 తేదీల మధ్య ఢిల్లీ నుంచి బయలదేరాయి. ఆంధ్రప్రదేశ్ లోని దురంతో ఎక్స్ ప్రెస్, చెన్నైకి చెందిన గ్రాండ్ ట్రంక్ ఎక్స్ ప్రెస్, చెన్నైకి వెళ్లిన తమిళనాడు ఎక్స్ ప్రెస్, న్యూఢిల్లీ - రాంచీ రాజధాని ఎక్స్ ప్రెస్, ఎపి సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైళ్లపై అధికారులు దృష్టి సారించారు. 

మర్కజ్ కు హాజరైనవారితో కాంటాక్టులోకి వచ్చినవారికి సంబంధించి రైల్వే వద్ద కచ్చితమైన సంఖ్య ఏదీ లేదు. ప్రతి రైలులో దాదాపు 1000 నుంచి 1200 మందితో పాటు సిబ్బంది ప్రయాణించారు. వారందరికీ ప్రమాదం ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. 

మార్చి 13వ తేదీన సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలులో వచ్చిన ఇండోనేషియాకు చెందిన వారి నుంచి ఒక్కరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలిన విషయం తెలిసిందే. న్యూఢిల్లీ - రాంచీ రాజధాని ఎక్స్ ప్రెస్ రైలులోని బీ1 కోచ్ లో ప్రయాణించిన మలేషియా మహిళకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఈ కోచ్ లో దాదాపు 60 మంది ప్రయాణించారు. వారంతా ఎక్కడున్నారనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. 

మహిళ మార్చి 16వ తేదీన మరో 23 మందితో కలిసి ప్రయాణం చేసింది. జార్ఖండ్ తొలి పాజిటివ్ కేసు కూడా ఆమెదే. అలాగే, దురంతో ఎక్స్ ప్రెస్ రైల్లోని ఎస్8 కోచ్ లో మార్చి 18వ తేదీన ప్రయాణించిన ఇద్దరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఇలా ఐదు రైళ్లలో ప్రయాణించినవారు, వారితో కాంటాక్టులోకి వచ్చినవారి కోసం ఆరా తీస్తున్నారు.