రాజమండ్రి: కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో తమ వంతు పాత్ర పోషిస్తున్న పారిశుద్య కార్మికుల కాళ్లు కడిగి  పాదాభివందనం చేశారు తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. పారిశుద్య కార్మికులు చేస్తున్న సేవకు ఎంత చేసినా కూడ తక్కువేనని ఆయన అభిప్రాయపడ్డారు.

కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఈ నెల 14వ తేదీ వరకు లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని  అత్యవసర పరిస్థితుల్లో మినహ ఇతర సమయాల్లో ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.

వైద్యులు, పారిశుద్య సిబ్బంది, పోలీసులు, మీడియాతో పాటు ఇతరత్రా అత్యవసర సిబ్బందికి మాత్రమే లాక్ డౌన్ విషయంలో మినహయింపు ఇచ్చింది ప్రభుత్వం. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్య సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారు. 

రాజానగరం నియోజకవర్గంలో పారిశుద్య కార్మికులకు వైసీపీ ఎమ్మెల్యే  జక్కంపూడి రాజా కాళ్లు కడిగారు. సబ్బుతో  వాళ్ల కాళ్లు  కడిగి వారికి పాదాభివందనం చేశారు. పారిశుద్య కార్మికులు చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు.

also read:కరోనాపై వాస్తవాలను ప్రజలకు చెప్పాలి: ఏపీ ప్రభుత్వానికి బాబు డిమాండ్

ఈ విపత్కర పరిస్థితుల్లో పారిశుద్య కార్మికులు  చేస్తున్న సేవలకు ఎంత చేసినా కూడ తక్కువేనని ఆయన అభిప్రాయపడ్డారు. పారిశుద్య కార్మికులను పిలిపించి సోమవారం నాడు ఆయన కాళ్లు కడిగారు. పారిశుద్య కార్మికుల పాదాలను కడిగిన ఎమ్మెల్యేను పలువురు అభినందించారు.ఇటీవలనే అరకు ఎమ్మెల్యే అరకులో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ కాళ్లు మొక్కిన విషయం తెలిసిందే.

ఏపీ రాష్ట్రంలో ఇవాళ్టికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 266కి చేరుకొంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహ మిగిలిన 11 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.  కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది.