పాలకొల్లు: ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు వినూత్నరీతిలో ప్రయత్నిస్తుంటారు. అక్వా ఉత్పత్తులను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని డిమాండ్ తో కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించేందుకు ఆయన సోమవారం నాడు పాలకొల్లు నుండి ఏలూరుకు సైకిల్ పై బయలుదేరారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్వా సాగుపై రైతులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కరోనా కారణంగా అక్వా ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం కన్పిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడ అక్వా రైతులను ఆదుకొనేందుకు చర్యలను ప్రారంభించింది. 

లాక్‌డౌన్ కారణంగా అక్వా రైతుల సమస్యలపై చర్చించేందుకుగాను కలెక్టర్ కు పోన్ చేసినా కూడ  ఆయన అందుబాటులోకి రావడం లేదని పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు చెప్పారు. దీంతో ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం ఇవ్వాలని ఆయన భావించారు. సోమవారం నాడు ఉదయం సైకిల్ పై పాలకొల్లు నుండి ఏలూరుకు ఆయన బయలుదేరారు. 

Also read:ఏపీపై కరోనా పంజా: 266కి చేరిన కేసులు, ముగ్గురి మృతి

అక్వా రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా కూడ ఫలితం లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేలా చేసేందుకు సైకిల్ యాత్ర చేపట్టినట్టుగా  ఎమ్మెల్యే రామానాయుడు ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం నాటికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 266కి చేరుకొంది. ఢిల్లీ నుండి వచ్చిన వారి నుండే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.