Asianet News TeluguAsianet News Telugu

కరోనా నివారణకు మరిన్ని చర్యలు...ఏపి మంత్రుల బృందం కీలక ఆదేశాలు

కరోనా వైరస్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని పటిష్ట చర్యలు తీసుకుంది. ఇవాళ ఉన్నతాధికారులతో మంత్రుల బృందం సమావేశమయ్యింది. 

Coronavirus Effects... AP Ministers Meeting with officers
Author
Amaravathi, First Published Mar 28, 2020, 3:47 PM IST

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని నివారణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో పకడ్బందీగా చర్యలు చేపట్టాగలిగామని... కేవలం ప్రజలు సామాజిక దూరాన్ని  పాటిస్తూ ఎవరికి వారు స్వచ్ఛంధ నియంత్రణ చర్యలు తీసుకోవాలని మంత్రులు ఆళ్ల నాని, బుగ్గన రాజేంద్రనాథ్, కె.కన్నబాబు, బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, హరికృష్ణలు పేర్కొన్నారు.

శనివారం ఉదయం స్థానిక రాష్ట్ర ఆర్ అండ్ బి భవన ప్రాంగణంలో నిర్వహించిన మంత్రుల బృందం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ... కరోనా వైరస్ వ్యాప్తిని నివారణకు కఠినమైన కొన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతర్ రాష్ట్ర ప్రజా రవాణాపై ప్రజల్లో అవగాహన కలుగ చెయ్యాల్సి ఉందన్నారు. అందులో భాగంగా వాస్తవ పరిస్థితులను  వివరించి తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని అన్నారు. ఈ విషయంలో ప్రజల్లోకి భయాందోళనలను దూరం చెయ్యడమే ముఖ్యమన్నారు. 

ఈ సందర్భంగా పలువురు మంత్రులు, రాష్ట్ర ఉన్నతాధికారులు మాట్లాడుతూ... రాష్ట్రంలో 104 ద్వారా వైద్య సేవలు , 1902  ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ, ధరల నియంత్రణ చర్యలను పకడ్బందీగా చేపట్టడం జరుగుతోందన్నారు. లాక్ డౌన్ అమలుకు చేపడుతున్న కార్యక్రమాలను ప్రసార సాధనాలు ద్వారా ప్రజల్లోకి సామాజిక బాధ్యతగా తీసుకుని వెళ్లాలని పేర్కొన్నారు. 

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది అన్నది వాస్తవం అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపట్టడం ద్వారా ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తీసుకుని రాగలిగామన్నారు. కేంద్రం  దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటన చేసిందన్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ను పటిష్టంగా అమల్లోకి తీసుకుని వచ్చామన్నారు.

కరోనా వైరస్ వ్యాప్తిని సామాజిక దూరం పాటించడం ద్వారా మాత్రమే నియంత్రణలోకి తీసుకుని రాగలుగుతామని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలలో ఉన్న రాష్ట్రవాసులకు తగిన షెల్టర్ , ఇతర సదుపాయాలు కల్పించాలని ఆయా ప్రభుత్వాలను కోరడం జరుగుతున్నదని తెలిపారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి తగిన విధంగా షెల్టర్ కల్పించాలని కలెక్టర్లను, ఎస్పీ లకు స్పష్టం చేశామన్నారు. నిత్యావసర సామగ్రి, అత్యవసర సేవలు విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు.

వైరస్ వ్యాప్తిని నివారణకు సామాజిక దూరం ఏకైక మార్గమని, ఇందుకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకారాన్ని అందించాల్సి ఉందన్నారు. ఇటలీ, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితిని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని, మనకి మనమే స్వీయ నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరారు. 

నిత్యావసర వస్తువుల రవాణా, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కోసం, వాటిని కోల్డ్ స్టోరేజ్ గురించి సమావేశంలో చర్చించారు. ఆక్వా సాగు, చేపలు, హార్టికల్చర్ పంటల ద్వారా వొచ్చినా ఉత్పత్తులకు తగిన కోల్డ్ స్టోరేజ్, ఎగుమతులపై దృష్టి సారించాలన్నారు.  వారికి చేదోడుగా నిలవాల్సిన అవసరం ఉందని ,  ఆ దిశలో జిల్లా కలెక్టర్లు మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కోసం తప్పనిసరి గా మార్గదర్శకాలు జారీ చెయ్యాల్సి ఉందన్నారు. 

వరి పంట కోతకు వచ్చిందని, వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన యంత్ర పరికరాలు రవాణాపై ఎటువంటి నిషేధం లేదని తెలియచేసారు. రాష్ట్రంలోని పరిస్థితులు, ఇతర దేశాలలో రవాణా, ఎగుమతులపై అమలు చేస్తున్న పద్ధతులు పై అధ్యయనం చేయాలని మంత్రులు సూచనలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్న  సూచనలు పరిగణనలోకి తీసుకోవడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కంటే, పట్టణ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటున్నదని పేర్కొన్నారు. ఆ దిశలో ఇంటింటి సర్వే ప్రతి రోజు చేపట్టే ఆలోచన చెయ్యాల్సి ఉందన్నారు. 

ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాల్లో ప్రజలను ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇస్తున్న అనుమతి సమయం నియంత్రణ చెయ్యాల్సి ఉందన్నారు. ప్రతి రెండు కిలోమీటర్ల పరిధిలో రైతు బజార్ లను అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందన్నారు. వీటికి అదనంగా మొబైల్ రైతు బజారులను కూడా అందుబాటులో ఉంటాయని మంత్రులు పేర్కొన్నారు. 

పారిశుధ్యంపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని,  డిజిపి గౌతమ్ సవాంగ్, ఉన్నతాధికారులు కేఎస్ జవహర్ రెడ్డి, పివి రమేష్, గిరిజా శంకర్, మధుసూదన్, గోపాలకృష్ణ ద్వివేది,  జె.శ్యామల రావు, టీ విజయ కుమార్ రెడ్డి, కార్తికేయ మిశ్రా, విజయకుమార్, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios