Asianet News TeluguAsianet News Telugu

వారం రోజుల లాక్ డౌన్... ఏపి గవర్నర్ తో సీఎం జగన్ సమావేశం

కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి  గురించి గవర్నర్  కు వివరించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ సమావేశం కానున్నారు.  

Corona effect... AP  CM Jagan Meeting With Governor
Author
Vijayawada, First Published Mar 30, 2020, 4:19 PM IST

అమరావతి: కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తిచెందుతుండటంతో దాన్ని అడ్డుకోడానికి కేంద్రం దేశం మొత్తాన్ని లాక్ డౌన్ చేసింది. ఈ క్రమంలో రాష్ట్రాల మధ్యే కాదు  ఒకే రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు, గ్రామాల  మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఇలా ఆంధ్ర ప్రదేశ్ లో లాక్ డౌన్ ను వైసిపి ప్రభుత్వం పకడ్బందీగా అమలుచేస్తోంది. 

కరోనా కారణంగా రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేసినప్పటి నుండి జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంపై వైరస్ ప్రభావం, ప్రస్తుత రాష్ట్ర పరిస్థితిని వివరించేందుకు ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర గవర్నర్ ను బిశ్వభూషన్ హరిచందన్ ను  కలవనున్నారు. సాయంత్రం గవర్నర్ ను కలవనున్న సీఎం జగన్ కరోనా నివారణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించనున్నారు.  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం నాడు ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా రాజమండ్రి, కాకినాడలకు చెందిన ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో  649 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 495 మందికి నెగిటివ్ వచ్చినట్టుగా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. మరో వంద మందికి సంబంధించిన రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది.

రాష్ట్రంలో అత్యధికంగా విశాఖపట్టణం జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ జిల్లాలో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్టణం తర్వాత స్థానాన్ని కృష్ణా, గుంటూరు జిల్లాలు ఉన్నాయి. 

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో మూడేసి చొప్పున పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయి.ఇక చిత్తూరు, కర్నూల్, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్క కేసులు నమోదయ్యాయి.

 రాష్ట్రానికి విదేశాల నుండి సుమారు 28 వేలకు పైగా వచ్చారు. విదేశాల నుండి వచ్చిన వారి జాబితాను గుర్తించి వారిని హోం క్వారంటైన్ లో ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. విదేశాల నుండి వచ్చిన వారితో పాటు లోకల్ ట్రాన్స్ మిషన్ ద్వారా కూడ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా అధికారులు గుర్తించారు.

దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరించనుంది. నిత్యావసర సరుకుల కొనుగోలు కోసం గతంలో మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్ర ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. అయితే ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా నిత్యావసర సరుకుల కొనుగోలును ఉదయం 11 గంటలకు మాత్రమే ప్రభుత్వం అవకాశం కల్పించింది. 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios