ఎలక్ట్రిక్ వాహనాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన.. రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు ఫ్రీ..
తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలానికి ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని రూపొందించింది, అలాగే సుమారు 400 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించాలని యోచిస్తోంది.
ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి, తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలానికి ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని రూపొందించింది, అలాగే సుమారు 400 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించాలని యోచిస్తోంది.
రాష్ట్రంలో కొనుగోలు చేసి నమోదు చేసుకున్న ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు 100 శాతం మినహాయింపును రాష్ట్రం అందిస్తుందని ఎలక్ట్రిక్ వాహనాల పాలసీలో తెలిపింది.
గుజరాత్, ఢీల్లీ తరువాత ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ అనుసరించిన మూడవ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ విధానం ప్రకారం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, త్రీ వీలర్లు, వాణిజ్య ప్యాసెంజర్ వాహనాలు, ప్రైవేట్ కార్లు, ట్రాక్టర్లతో సహా రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రతిపాదించింది.
రాష్ట్ర ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీ ప్రకారం, ఎలక్ట్రిక్ వాహనాలన్నీ రాష్ట్రంలోనే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ పాలసీని తెలంగాణ మంత్రులు కె.టి రామారావు, అజయ్ కుమార్ ప్రారంభించారు, ఈ పాలసీ 2020 నుండి 2030 వరకు అమలులో ఉంటుంది.
మొదటి రెండు లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 20వేల ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు, 20వేల ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాలు, 500 ఎలక్ట్రిక్ బస్సులపై రాష్ట్రంలో 100 శాతం రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుండి మినహాయింపు కల్పించింది.
రవాణా శాఖ ద్వారా ట్రాక్టర్లు, 5వేల ఎలక్ట్రిక్ కార్లపై ప్రభుత్వం 100 శాతం ప్రోత్సాహకాలను కూడా ఇవ్వనుంది, ఇందులో సగం టాక్సీ, టూరిస్ట్ క్యాబ్స్ వంటి వాణిజ్య అవసరాలకు కేటాయించారు. ఎలక్ట్రిక్ ట్రాక్టర్లకు రిజిస్ట్రేషన్ ఫీజుపై 100 శాతం మినహాయింపును ఇస్తుంది.
ఛార్జింగ్ మౌలిక సదుపాయాల విషయానికొస్తే హైదరాబాద్, ఇతర పట్టణాల్లోని ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను దశలవారీగా ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించనుంది.