ఫ్యూచర్ విద్యుత్ ‘వెహికల్స్’దే.. ఈవీ మొబిలిటీకి రెడీ: టాటామోటార్స్

ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ శకానికి నాంది పలుకనున్నది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అంతర్జాతీయంగానే వివిధ దేశాల్లో ధోరణి మారుతోంది

Tata Motors to lead transition towards electric mobility: N Chandrasekaran

ప్రభుత్వం విద్యుత్‌ వాహనాల (ఎలక్ట్రిక్ వెహికల్స్)కు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. తాజాగా బడ్జెట్‌లో ఎలక్ర్టిక్‌ వాహనాలను రుణంతో కొనుగోలు చేసే వారు చెల్లించే వడ్డీపై రూ.1.50 లక్షల పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఎలక్ర్టిక్‌ వాహనాల మరింత ప్రోత్సహించనుంది.

సంప్రదాయ ఇంధనాలతో నడిచే వాహనాలు వెలువరించే కాలుష్య ఉద్గారాలు పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్నాయని, విద్యుత్ వాహనాలు వినియోగాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులు, ఎలక్ర్టిక్‌ వాహనాలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు సైతం విద్యుత్‌ వాహనాలపై అభివృద్ధి తయారీపై దృష్టి పెడుతున్నాయి. 

ఎలక్ట్రిక్‌ మొబిలిటీలోకి మారేందుకు టాటా మోటార్స్‌ సిద్ధమని టాటా గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ చెప్పారు. పర్యావరణ అనుకూలమైన ఈ వాహనాలను ఉత్పత్తి చేసేందుకు అవసరమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ఇతర సంస్థలతో కలిసి పనిచేయాలని చూస్తున్నట్లు చెప్పారు. భారత్‌కు ఎలక్ట్రిక్‌ వాహనాలు ఎంతో అవసరమని టాటా మోటార్స్‌ 2018-19 వార్షిక నివేదికలో చంద్రశేఖరన్ పేర్కొన్నారు. 

దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఆదరణ పెరుగుతోందని టాటా సన్స్ అధినేత చంద్రశేఖరన్ తెలిపారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు టాటా మోటార్స్‌ సిద్ధంగా ఉండటంతోపాటు అందుకు అనుకూల వాతావరణం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వాటాదారులకు పంపిన సందేశంలో చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. 

ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు సాగుతున్న ఈ మార్పును ప్రభుత్వం, పరిశ్రమ ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకుపోవాల్సి ఉంటుందని టాటా మోటార్స్ చైర్మన్ చంద్రశేఖరన్ తెలిపారు.

ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, కార్లు, ప్రజా రవాణా, వాణిజ్య వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. పెట్రోల్‌, డీజిల్‌తో నడిచే వాహనాలు అత్యధికంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. 

భారత్‌ ఇంధన అవసరాల్లో దాదాపు 80 శాతం దిగుమతి చేసుకుంటోంది. ముడిచమురు దిగుమతుల కోసం ప్రభుత్వం భారీ మొత్తంలో విదేశీ మారక నిల్వలను వెచ్చించాల్సి వస్తోంది. చమురు ఉత్పత్తి దేశాల్లోని భౌగోళిక రాజకీయ పరిణామాలతో చమురు సరఫరాపై ప్రభావం పడుతోంది. ఇది ధరల పెరుగుదలకు దారితీస్తోంది.

ప్రపంచమంతా ఎలక్ర్టిక్‌ వాహనాల దిశగా అడుగులు వేస్తోంది. ఇలాంటి తరుణంలో ఉన్న అవకాశాలను వదులుకోవద్దని కేంద్ర ప్రభుత్వం కూడా భావిస్తోంది. ఎలక్ర్టిక్‌ వాహనాల ద్వారా మేక్‌ ఇన్‌ ఇండియాకు మరింత ఊతం అందించవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది.

2013-14లో భారత్‌ ముడి చమురు దిగుమతులు 77 శాతంగా ఉన్నాయి. 2022 నాటికి వీటిని 67 శాతానికి తగ్గించాలన్న ప్రధాని నరేంద్రమోదీ సంకల్పం. 2030నాటికి దీన్ని సగానికి సగం తగ్గించాలని కూడా ఆయన ఆశిస్తున్నారు.

2015-16లో భారత్‌లో ఇంధన వినియోగం 18.47 కోట్ల టన్నులుగా ఉంది. 2018-19 లో 21,160 కోట్ల టన్నులకు పెరిగింది. 2015-16లో ముడిచమురు దిగుమతి కోసం భారత్‌ 6400 కోట్ల డాలర్లు వెచ్చించింది. 2018-19 నాటికి ఇది 11,190 కోట్ల డాలర్లకు ఎగబాకింది.

ఎలక్ర్టిక్‌ వాహనాలకు మారిపోవాలన్న సంకల్పం గొప్పదైనా భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్నదేశాల్లో నిర్దేశిత లక్ష్యం మేరకు ఇది సాధ్యం కాదని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. 2025 నాటికి అన్ని 3 వీలర్లు, 2 వీలర్లు ఎలక్ర్టిక్‌కు మారిపోవాలని, 2030నాటికి ఎలక్ర్టిక్‌ వాహనాల అమ్మకాలు మాత్రమే జరగాలన్న విషయమై నీతి ఆయోగ్‌ ప్రభుత్వానికి సూచనలు చేసింది.

నీతి ఆయోగ్ ప్రతిపాదనలు, సూచనలపై ఆటోమొబైల్ పరిశ్రమ వర్గాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇది అనుకున్నంత సులభం కాదని, ఇందుకోసం ఆటో పరిశ్రమ భారీగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని అంటున్నాయి.

ఇప్పటికే బీఎస్‌-6 ప్రమాణాల కోసం ఆటో పరిశ్రమ రూ.70వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టిందని, ఇప్పుడు ఈవీల కోసం కూడా పెట్టుబడులు పెట్టాల్సి రావడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు.

ఇటీవలే ఫేమ్‌-2 కింద ఎలక్ర్టిక్‌ వాహనాలకు ఇచ్చే సబ్సిడీలను కేంద్రం ప్రకటించింది. అప్పుడే 2, 3 వీలర్ల డెట్‌లైన్‌ను విధించడం సమంజసం కాదని ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలు అంటున్నాయి. ఎలక్ర్టిక్‌ కార్లకు చార్జింగ్‌ స్టేషన్లు ఎంతో కీలకం. వీటి ఏర్పాటు వేగవంతంగా జరిగితేనే ఎలక్ర్టిక్‌ వాహనాలకు ప్రయోజనం కలుగుతుందని పరిశ్రమవర్గాలు అంటున్నాయి.

పెట్రోల్‌, డీజిల్‌తో నడిచే కార్లకన్నా ఎలక్ర్టిక్‌ కార్ల ధర దాదాపు డబుల్‌ ఉంటుంది. భారత్‌ లాంటి దేశాల్లో ధరలు ఎంతో ముఖ్యమైనవి. బ్యాటరీలు, వాహనాల్లో వినియోగించే విడిభాగాల ధరలు తగ్గితేనే వాహన ధరలు తగ్గడానికి అవకాశం ఉంటుంది.

ధరలకు ప్రాధాన్యం ఇచ్చే భారత్‌ వంటి దేశాల్లో ఎక్కువ ధర ఉండే వాహనాలకు ఆదరణ ఉండదన్నది పరిస్థితులకు అనుగుణంగా తగిన ఎలక్ట్రిక్ ఎకో సిస్టమ్‌ అభివృద్ధి చెందితేనే వాహనాల ఉత్పత్తి, అమ్మకాలు పెరుగుతాయని పరిశీలకులు అంటున్నారు.

ప్రభుత్వ ప్రకటనలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని చెబుతున్నారు.ఎలక్ర్టిక్‌ వాహనాల ఉత్పత్తి పెంచాలన్న లక్ష్యం ఉన్నప్పటికీ అందుకు తగిన స్థాయిలో మౌలిక సదుపాయాలు, విద్యుత్‌ లభ్యత వంటి వాటిపై స్పష్టత లేదని పరిశ్రమవర్గాలు అంటున్నాయి.

చైనాలో ఎలక్ర్టిక్‌ కార్ల వాటా రెండు శాతం కాగా, నార్వేలో 39 శాతంగా ఉంది. భారత మార్కెట్లో మాత్రం 0.06 శాతమే ఉన్నట్టు తెలుస్తోంది. ఎలక్ర్టిక్‌ వాహన అమ్మకాల్లో టూవీలర్ల వాటాయే అధికం. టూవీలర్లు, బస్సుల అమ్మకాలు పెరుగుతున్నాయి.

2018లో ప్రపంచవ్యాప్తంగా 8.6 కోట్లకు పైగా ఎలక్ర్టిక్‌ ప్యాసెంజర్‌ వాహనాలు అమ్ముడయ్యాయి. ఇందులో ఎలక్ర్టిక్‌ వాహనాలు కేవలం 20 లక్షలు మాత్రమే. ప్రస్తుతం 50 లక్షల ఎలక్ర్టిక్‌ వాహనాలు మాత్రమే రోడ్లపై తిరుగుతున్నాయి.

2040నాటికి ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే కొత్త ప్యాసెంజర్‌ వాహనాల్లో ఈవీల వాటా 57 శాతం ఉంటుందని అంచనా. కాలుష్యం నివారణపై ప్రభుత్వాల ఆందోళనలే ఎలక్ర్టిక్‌ వాహనాలకు ప్రాధాన్యం పెంచుతున్నాయి. కఠిన నిబంధనల అమలుతో పదేళ్ల కాలంలో ప్రపంచవ్యాప్తంగా కార్ల కంపెనీలు 30,000 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది.

విద్యుత్ వాహనాల అమ్మకాల్లో చైనా అగ్రస్థానంలో ఉంది. 2018లో ఈ దేశంలో 13 లక్షల ఈవీలు అమ్ముడయ్యాయి. షెంజన్‌కు చెందిన బీవైడీ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీల తయారీ సంస్థగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఆటోమొబైల్‌ కంపెనీలు కూడా ఎలక్ర్టిక్‌ వాహనాలపైనే దృష్టి సారిస్తున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios