ఫోర్డ్‌తో జత: ఇటు కనెక్టెడ్.. అటు విద్యుత్, పెట్రోల్ వెహికల్స్ ఇదీ మహీంద్రా ‘వ్యూ’

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా మరింత స్మార్ట్ కానున్నది. బీఎస్ -6, విద్యుత్ వాహనాల తయారీలో కనెక్టెడ్ ప్లస్ పెట్రోల్, విద్యుత్ వెహికల్స్ తయారీకి పెద్దపీట వేయనున్నది. కేయూవీ, ఎక్స్‌యూవీల్లో ఎలక్ట్రిక్‌ వెర్షన్లను తయారు చేయడంతోపాటు వాటిని మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది. 
 

Mahindra to focus on EV, petrol engines and connected vehicles

శరవేగంగా వాహనాల్లో మార్పులు జరుగుతున్న తరుణంలో ఇక కనెక్టెడ్‌ వాహనాలు, పెట్రోల్‌ ఇంజిన్లు, ఎలక్ట్రిక్‌ వాహనాలపై (ఈవీ) మరింత దృష్టి పెట్టాలని మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) నిర్ణయించింది.

మహారాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ కింద తమ ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రాజెక్టుపై రూ.500 కోట్లు వెచ్చించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఎస్‌యూవీ మాడల్ కార్లు  కేయూవీ 100, ఎక్స్‌యూవీ 300ల్లో ఎలక్ట్రిక్‌ వెర్షన్లు కూడా రూపొందిస్తున్నట్లు తన వార్షిక నివేదికలో ఎంఅండ్‌ఎం వివరించింది.

గతంలో మాదిరి సరైన ధరతో సరైన ఉత్పత్తిని ప్రవేశపెడితే సరిపోదని.. మార్కెట్లో నెగ్గుకు రావాలంటే మరింత కృషి చేయాలని స్పష్టంచేసింది. ‘పర్యావరణ కాలుష్యం, రహదారులపై భద్రత వంటి అంశాలపై జాగ్రత్తలు పెరుగుతున్న నేపథ్యంలో ఇంధనాల వినియోగం, వాహనాల కొనుగోలు తీరు తెన్నులు మారుతున్నాయి.

రాబోయే రోజుల్లో ఆటోమోటివ్‌ పరిశ్రమపై ఇవి చాలా పెద్ద ప్రభావమే చూపిస్తాయి‘ అని ఎంఅండ్‌ఎం పేర్కొంది. అమెరికన్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం ఫోర్డ్‌తో కలిసి కనెక్టెడ్‌ వాహనాలను రూపొందిస్తామని మహీంద్రా అండ్ మహీంద్రా వివరించింది.ఇంటర్నెట్, బ్లూటూత్‌ తదితర టెక్నాలజీల ద్వారా నియంత్రించగలిగే వాహనాలు ఈ కోవకు చెందుతాయి. 

నిలకడగా వృద్ధి సాధించే లక్ష్యంతో ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో పటిష్టం, ప్రస్తుత ఉత్పత్తుల్లో కొత్త వేరియంట్లు ప్రవేశపెట్టడం, పరిశోధన.. అభివృద్ధి సామర్థ్యాలను పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు వివరించింది.

2018–19లో మహీంద్రా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ (ఎంఈఎంఎల్‌) మొత్తం 10,276 ఎలక్ట్రిక్‌ వాహనాలు విక్రయించింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం 4,026 యూనిట్లు మాత్రమే విక్రయించింది.

ఈవీ చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలను ఆహ్వానించిన కేంద్రం 
దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగానికి ప్రధాన ఆధారం చార్జింగ్‌ వసతుల కల్పనపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఫేమ్‌–2 పథకం కింద దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ఈవీ చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు ఆసక్తి కలిగిన సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించింది. 

2011 జనాభా లెక్కల ప్రకారం రూ.లక్ష జనాభా కంటే ఎక్కువ మంది ఉన్న పట్టణాలు, ప్రభుత్వం నోటిఫై చేసిన స్మార్ట్‌సిటీలు, మెట్రో నగరాలకు అనుసంధానమైన శాటిలైట్‌ పట్టణాలకు ఈ ప్రతిపాదనలను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఆహ్వానం పలికింది. 

తొలి విడత కింద 1,000 ఈవీ చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తీకరణ తెలియజేయాలని కోరింది. ఆ తర్వాత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వీటిని మంజూరు చేయనున్నట్టు తెలిపింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios