చార్జింగ్ స్టేషన్ల జోరు.. సర్కార్ హుషారు.. ప్రైవేట్, ప్రభుత్వ సంస్థల స్పీడ్
మున్ముందు విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించే దిశగా మోదీ సర్కార్ చర్యలు చేపట్టింది. వచ్చే పదేళ్లలో నాలుగోవంతు వాహనాలు విద్యుత్ వాహనాలే ఉండాలన్నదని కేంద్రం వ్యూహం. ఇందుకోసం ప్రస్తుతానికి ప్రభుత్వ రంగ రవాణా సంస్థల్లో విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్రం.. వ్యక్తిగత విద్యుత్ వాహనాల కొనుగోలకు ఆఫర్లు అందిస్తున్నది
దేశంలో విద్యుత్ వాహనాల వినియోగం పెంపుదలకు కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ వడివడిగా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ప్రజా రవాణా వాహనాల్లో ఎలక్ట్రిక్ వెర్షన్ల వాటాను పెంచేందుకు ఫేమ్-2 పథకం ద్వారా భారీగా సబ్సిడీలు కల్పిస్తోంది.
వ్యక్తిగత అవసరాల కోసం ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేసేవారికి వాహన రుణ వడ్డీపై రూ.1.5 లక్షల వరకు పన్ను రాయితీనిస్తామని ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనల్లో విత్తమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఇంకా విద్యుత్ వాహనాలు, చార్జింగ్ కిట్‌లపై ప్రభుత్వం గత నెలలో జీఎస్టీని 18 నుంచి ఐదు శాతానికి కూడా తగ్గించింది. బ్యాటరీ ఆధారితంగా నడిచే ఎలక్ట్రిక్ వాహనాలకు కొత్తగా రిజిస్ట్రేషన్‌తోపాటు రెన్యువల్ కోసం వసూలు చేసే రుసుమును మాఫీ చేసింది.
అదే సమయంలో ఈ-వాహనాలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపైనా దృష్టి సారించింది. దేశంలో ప్రతి 25 కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్ ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. లాంగ్ రేంజ్, హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ వాహనాల కోసం జాతీయ రహదారులకు ఇరువైపులా 100 కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్ ఉండాలని ప్రభుత్వం పేర్కొంది.
2030 నాటికి రోడ్ల మీద తిరిగే మొత్తం వాహనాల్లో ‘ఎలక్ట్రిక్’ మోడళ్ల వాటా 25 శాతంగా ఉండవచ్చని కేంద్రం అంచనా వేస్తోంది. కాబట్టి కేంద్రం తన వంతు ఫేమ్-2 పథకం కింద విద్యుత్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. పలు ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు సైతం చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి.
దేశంలో పది లక్షలకు పైగా జనాభా కలిగిన నగరాలు, స్మార్ట్ సిటీల్లో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) చార్జింగ్ కేంద్రాల ఏర్పాటు కోసం ఫేమ్-2 పథకం కింద ప్రభుత్వం ప్రతిపాదనలు కోరింది.
ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను పిలువడం ద్వారా వచ్చే ప్రతిపాదనల్లో భాగంగా తొలుత 1,000 ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది.
వీటిని పలు రాష్ట్రాలు, నగరాలు, సంస్థలకు మంజూరు చేయడం జరుగుతుందని ప్రభుత్వం పేర్కొంది. పలు మంత్రిత్వ శాఖలు సైతం తమ అధికారుల కోసం ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడంతోపాటు వాటి కార్యాలయాల ప్రాంగణాల్లో చార్జింగ్ వసతులను ఏర్పాటు చేసుకుంటున్నాయి.
కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలోని కంపెనీ ‘ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్’(ఈఈఎస్ఎల్) కూడా చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ-ఎన్‌సీఆర్ లో 55 స్టేషన్లను ఏర్పాటు చేసిన కంపెనీ.. మున్ముందు ఈ సంఖ్యను 200కు పెంచనుంది. ఒక్క నోయిడాలోనే 100 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఈఈఎస్ఎల్ తెలిపింది.
ఢిల్లీ- దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)తోపాటు మరో 10 నగరాల్లోనూ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుందీ సంస్థ. హైదరాబాద్‌లో 50 ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రాల ఏర్పాటు కోసం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) తాజాగా ఈ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.
జీహెచ్‌ఎంసీకి చెందిన ప్రాంతాల్లో ఈఈఎస్ఎల్ ఈ స్టేషన్లు ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వ రంగ విద్యుత్ ఉత్పత్తి దిగ్గజం ఎన్‌టీపీసీ ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు రెండేళ్ల క్రితమే ప్రకటించింది.
తన తొలి చార్జింగ్ స్టేషన్‌ను విశాఖపట్నంలో ఏర్పాటు చేసింది. అంతేకాదు.. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల అభివృద్ధి, వినియోగం కోసం ఓలా, జూమ్‌కార్‌తోసహా 7 వెహికిల్ అగ్రిగేట్ కంపెనీలతో గత ఏడాది నవంబర్ నెలలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
దేశవ్యాప్తంగా తన కేంద్రాల్లో ఎలక్ట్రిక్ చార్జింగ్ వసతిని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక సేవల కంపెనీ వక్రాంజీ తెలిపింది. ప్రస్తుతం ఈ కంపెనీకి దేశంలోని 19 రాష్ట్రాల్లో 3,504 నెక్స్ట్‌జెన్ కేంద్రాలున్నాయి. వీటిలో 70 శాతం చిన్న నగరాలు, పట్టాణాల్లోనే ఉన్నాయి.
2021-22కల్లా ఈ కేంద్రాల సంఖ్యను 75,000కు పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 2024-25నాటికి మూడు లక్షల స్థాయికి చేర్చాలనుకుంటోంది. మరోవైపు టాటా సన్స్ అనుబంధ సంస్థలు టాటా మోటార్స్, టాటా పవర్ సంయుక్తంగా 500 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాయి.
పెట్రోల్, డీజిల్ వంటి సంప్రదాయ ఇంధనాన్ని విక్రయించే ప్రభుత్వ రంగ కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై దృష్టిసారించాయి. దేశంలో అతిపెద్ద ఇంధన విక్రయ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ).. తన బంకుల్లో చార్జింగ్ కేంద్రాల ఏర్పాటు కోసం ఫిన్‌లాండ్‌కు చెందిన ఫోర్టమ్‌ఓవైజేతో జతకట్టింది.
ఈ భాగస్వామ్యంలో తొలి చార్జింగ్ స్టేషన్‌ను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేసింది. ఒక్క హైదరాబాద్‌లోనే 50 స్టేషన్లను ఏర్పాటు చేయాలన్నది కంపెనీ ప్రణాళిక. ఫోర్టమ్‌తోపాటు ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, రాజస్థాన్ ఎలక్ట్రిక్‌లతోనూ ఒప్పందాలు కుదుర్చుకుంది.
హెచ్‌పీసీఎల్ కూడా తన పెట్రోల్ బంకుల్లో చార్జింగ్ కేంద్రాల ఏర్పాటు కోసం మెజెంటా, టాటాపవర్‌తో జట్టు కట్టింది. సహజవాయువు సరఫరాదారు గెయిల్ ఇండియా సైతం సీఎన్జీ స్టేషన్ల వద్ద చార్జింగ్ కేంద్రాల ఏర్పాటు యోచనలో ఉంది.
సోలార్ రంగ కంపెనీ మెజెంటా పవర్.. ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటులోకీ ప్రవేశించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి దేశవ్యాప్తంగా 500 చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
ఇందుకు అవసరమైన పెట్టుబడుల కోసం కంపెనీ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌తో జట్టు కట్టింది. మెజెంటా పవర్ దేశంలో తొలి పోర్టబుల్ ఎలక్ట్రిక్ చార్జింగ్ గ్రిడ్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. కార్యాలయాలు, మాల్స్, గృహ సముదాయాల వద్ద ఇన్‌స్టాల్ చేసుకునేందుకు ఈ చార్జింగ్ గ్రిడ్ అనువుగా ఉంటుందని అంటోంది.
విద్యుత్ వాహనాల మౌలిక సదుపాయాల సంస్థ ఈవీఐ టెక్నాలజీస్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టాలనుకుంటోంది. వచ్చే ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 20,000 చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ అధికారి తెలిపారు.
ఇక ఎలక్ట్రిక్ వాహన రంగ స్టార్టప్.. 1,400 కోట్ల పెట్టుబడులతో వచ్చే నాలుగేళ్లలో 6,500 చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఏబీబీ, డెల్టా కంపెనీలతో జతకట్టింది.
ప్రస్తుతం విద్యుత్ కార్లను విక్రయిస్తున్న, త్వరలో మార్కెట్లోకి విడుదల చేయబోతున్న కంపెనీలు కూడా చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై దృష్టిపెట్టాయి. కార్ల తయారీదారులు తమ డీలర్లు, సర్వీస్ సెంటర్ల వద్ద ఈ కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నాయి.