భారీగా వాహన కాలుష్యం  తగ్గించేందుకు వీలు కల్పించే ‘బీఎస్-6’ ఉద్గార నిబంధనలు వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి దేశవ్యాప్తంగా అమలు కానున్నాయి. ఈ నిబంధనలకనుగుణంగా లేని వాహనాల రిజిస్ర్టేషన్లకు అనుమతి ఉండదు.

ఈ నేపథ్యంలో ఆటోమొబైల్‌ కంపెనీలు బీఎస్‌-6 నిబంధనలకు అనుగుణంగా తమ వాహనాల్లో మార్పులు చేర్పులపై దృష్టిని సారించాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు తమ ప్రస్తుత మోడళ్లలో బీఎస్‌-6 వేరియంట్లను విడుదల చేయగా, మరికొన్ని కంపెనీలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి.

బీఎస్‌-6 నిబంధనల అమలు వల్ల అటు ఆటోమొబైల్‌ రంగంపై ఇటు వినియోగదారులపై భారం బాగానే పడుతుంది. తయారీ సంస్థలకు ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. దాని ప్రభావం సదరు వాహనాల కొనుగోలు ధర పెరుగుదలకు దారి తీస్తుంది. 

బీఎస్‌-6 నిబంధనలకనుగుణంగా ఒక వాహనంలో మార్పులు, చేర్పులకు దాని మోడల్, ఫీచర్లను బట్టి 20 శాతం వరకు ఉత్పత్తి వ్యయం పెరుగుతుందని పరిశ్రమవర్గాల అంచనా. నూతన భద్రతా నిబంధనలతో కలిపి ప్యాసెంజర్‌ వాహనాలకైతే 12-15 శాతం, వాణిజ్య వాహనాలకైతే 15-20 శాతం వరకు తయారీ వ్యయం పెరుగుతుందంటున్నారు. 

ఆటోమొబైల్ కంపెనీలు తమపై పెరిగే ఉత్పత్తి వ్యయాన్ని పూర్తిగా కస్టమర్లపై మోపే పరిస్థితి ఉండకపోవచ్చని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే వాహనాల అమ్మకాలు అంతంత మాత్రంగా సాగుతున్నాయి. ముడిసరుకుల వ్యయాలు పెరగడంతోకంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతూనే ఉన్నాయి. 

ఇక వాహనాల బీమా వ్యయం ఇటీవలి కాలంలో బాగానే పెరిగింది. వడ్డీ రేట్లు కూడా అధికంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమ్మకాలపై దెబ్బ పడుతోంది. ఇప్పుడు బీఎస్‌-6 నిబంధనలవల్ల ధరలను ఎక్కువగా పెంచితే అమ్మకాలు మరింతగా తగ్గవచ్చని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి.

అందుకే పెరిగిన వ్యయంలో కొంత వరకు భరించేందుకు సిద్ధం అవుతున్నట్టు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా బీఎస్‌-6 నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన వాహనాలతో సిద్ధం అవుతోంది.

వచ్చే ఏడాది నుంచి ఈ వాహనాలను తేనుంది. ఈ ఏడాదిలోనే పెట్రోల్‌తో నడిచే బీఎస్‌-6 వాహనాలను తీసుకురానుంది. బీఎస్-6కు మారడానికి కంపెనీ రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టింది.
 
గమ్మత్తేమిటంటే అన్ని కేటగిరీల్లో వాహనాల రిటైల్‌ అమ్మకాలు మే నెలలో 7.5 శాతం తగ్గి 17.7 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. ఆర్థిక వ్యవస్థలో మందగమనం, నగదు లభ్యత వంటి సమస్యలు వంటివి అమ్మకాలను దెబ్బతీసినట్టు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.

మారుతీ సుజుకీ తన హోల్‌సేల్‌ డిస్పాచ్‌లను 23 శాతం తగ్గి 1,25,552 యూనిట్లకు, హ్యుండాయ్‌ మోటార్స్ 5.6 శాతం తగ్గించి 42,502 యూనిట్లకు, మహీంద్రా ఒక శాతం తగ్గించి 20,608 యూనిట్లకు చేర్చాయి.

రిటైల్‌ డిమాండ్‌ తక్కువగా ఉండటంతో మారుతి సుజుకీ ఉత్పత్తిని 18శాతం మేర తగ్గించింది. మే నెలలో ప్రయాన వాహనాల అవ్మకాలు 20.5% తగ్గాయి. వరుసగా ఏడో నెలలోనూ ప్యాసెంజర్‌ వాహనాల అమ్మకాలు తగ్గుముఖం పట్టడం పట్ల కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి.
 
వాహనాల కొనుగోళ్లు తగ్గిపోతుండటంతో డీలర్ల వద్ద వాహనాల సంఖ్య పేరుకుపోయాయి. గత రెండు నెలల్లోనే డీలర్ల వద్ద అదనంగా మూడు లక్షల బైక్‌లు, స్కూటర్లుపేరుకున్నట్టు తెలుస్తోంది. ఈ మూడు లక్షల వాహనాల విలువ సుమారుగా రూ.1,500 కోట్లు. కంపెనీలు ఉత్పత్తిని తగ్గించుకుంటున్నా ఈ ఇన్వెంటరీ మాత్రం తగ్గడం లేదని తెలుస్తోంది. 

మే చివరినాటికి టూవీలర్‌ డీలర్ల వద్ద సగటు ఇన్వెంటరీ 10 రోజులు పెరిగింది. ఏప్రిల్‌లో ఇది 55-60 రోజులుగా ఉందని ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ సమాఖ్య (ఫాడా) గణాంకాల ద్వారా తెలుస్తోంది.

ఇక అమ్మకాల విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మధ్యప్రదేశ్‌ మినహా ఏప్రిల్‌, మే నెలల్లో వరుసగా రిటైల్‌ అమ్మకాలు 13.3 లక్షలు, 14.1 లక్షలుగా ఉన్నాయి. ఇక ప్యాసెంజర్‌ వాహనాల విషయానికొస్తే.. మే నెలలో ఇన్వెంటరీ ఏప్రిల్‌ నెలతో పోల్చితే 10 రోజులు తగ్గి 35-40 రోజులకు చేరుకుంది.

దేశంలోని టాప్‌ 10 కార్ల కంపెనీల్లో ఏడు కంపెనీలు మే, జూన్‌ నెలల్లో తమ ఉత్పత్తిని తగ్గించివేశాయి. అయినా ఇన్వెంటరీ మాత్రం తగ్గడం లేదు. ఇక వాణిజ్య వాహనాల పరిస్థితీ ఇలాగే ఉంది. ఈ వాహనాల ఇన్వెంటరీ 45-50 రోజులుగా ఉంది. ఉత్పత్తిని తగ్గింపుతో డీలర్ల వద్ద ఇన్వెంటరీని తగ్గించేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి.
 
కార్ల మార్కెట్‌ దిగ్గజం మారుతి సుజుకీ బాలెనోతోపాటు స్విఫ్ట్‌, వ్యాగన్‌ఆర్‌ మోడళ్లలో బీఎస్‌-6 వేరియంట్లను విడుదల చేసింది. పాత వ్యాగన్‌ ఆర్‌తో పోల్చితే కొత్త వేరియంట్ల ధర గరిష్ఠంగా రూ.16 వేల వరకు పెరిగినట్టు తెలుస్తోంది. కొత్త భద్రతా ఫీచర్లను జోడించిన బీఎస్‌-6 స్విఫ్ట్‌ ధర గరిష్ఠంగా రూ.15వేల వరకు పెరిగింది.

టూవీలర్ల కంపెనీ హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా బీఎస్‌-6 ప్రమాణాలతో కూడిన యాక్టివా 125 స్కూటర్‌ను విడుదల చేసింది. బీఎస్‌-4 వెర్షన్‌తో పోల్చితే బీఎస్‌-6 వెర్షన్‌ ధర 10-15 శాతం అధికంగా ఉంటుందని కంపెనీ ప్రకటించింది.

వీఈ కమర్షియల్‌ వెహికిల్స్‌లో భాగంగా ఉన్న ఐషర్‌ ట్రక్స్‌ అండ్‌ బసెస్‌ కంపెనీ బీఎస్‌-6 నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఐషర్‌ ప్రో 2000 సీరిస్‌ లైట్‌ కమర్షియల్‌ ట్రక్కులను ఇటీవలే ఆవిష్కరించింది.

ఇక దేశీయ ప్రముఖ ఆటో దిగ్గజం టాటా మోటార్స్‌ గత ఆర్థిక సంవత్సరంలో బీఎస్‌-6 వాహనాల కోసం రూ.1,200 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరింత ఎక్కువగా ఖర్చు చేయనుంది.
 
బీఎస్‌-6 నిబంధనల అమలు నేపథ్యంలో స్పెషలైజ్డ్‌ స్టీల్‌ను తయారు చేస్తున్న కంపెనీలకు ఊహించని వ్యాపార అవకాశాలు లభిస్తున్నాయి. కొన్ని వాహనాలను కొత్త నిబంధనలకనుగుణంగా మార్చాలంటే వాటి బరువును పెంచాల్సి వస్తోంది. 

ఉదాహరణకు టిప్పర్‌ ట్రక్‌ బరువు కనీసం మూడు టన్నులు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. దీని వల్ల ఇంధన సామర్థ్యంపై ప్రభావం పడనుంది.  నిబంధనలకు అనుగుణంగా స్పెషలైజ్డ్‌ స్టీల్‌ను వినియోగిస్తే ట్రక్కు బరువు 2.2 నుంచి 2.4 టన్నుల వరకు మాత్రమే పెరిగే అవకాశం ఉండనుంది.